కరోనావైరస్: భారత్‌లో 20 వేలు దాటిన మొత్తం కేసులు, 652 మంది మృతి; ఏపీలో 819, తెలంగాణలో 943 మందికి పాజిటివ్
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471కి చేరింది. కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్య 652కు చేరింది. వీరిలో 3959 మంది ఇప్పటివరకూ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో 24 మంది, తెలంగాణలో 24 మంది మరణించారు.
దేశంలో కరోనా
పాజిటివ్ కేసుల సంఖ్య 19,984కు చేరింది.
ఈ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా 640 మంది
చనిపోయారు.
భారత కుటుంబ సంక్షేమ
శాఖ వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఈ వ్యాధి నుంచి 3869 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్లాస్మా థెరపీపై ప్రపంచమంతటా చర్చలు
ఫొటో సోర్స్, PA
కోవిడ్-19 రోగులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణులు పంపిన ప్రతిపాదనకు ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు 1,500కు పైగా ఆస్పత్రుల సమన్వయంతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే 600 మందికి పైగా రోగులకు ఈ విధానం ద్వారా చికిత్స అందించారు.
ఇంతకీ ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? దీనితో కోవిడ్ నయమవుతుందా?
గుంటూరు, కర్నూలుల్లో తగ్గని ప్రవాహం... ఏపీలో 56 కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గుంటూరు, కర్నూలుల్లో కరోనావైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే 19 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 5,757 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
తాజా కేసులను కూడా కలిపితే, రాష్ట్రంలో ఇంతవరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 813 కి చేరింది.
వీరిలో 120 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 మంది మరణించారు. మిగతా 669 మంది చికిత్స పొందుతున్నారు
చైనా పరిహారం చెల్లించాలని అమెరికన్ రాష్ట్రం దావా
ఫొటో సోర్స్, Getty Images
చైనా ప్రభుత్వం, అక్కడి పాలక కమ్యూనిస్టు పార్టీ ప్రపంచాన్ని కావాలనే తప్పుదోవ పట్టించి కోవిడ్-19 సంక్షోభానికి కారణమయ్యాయంటూ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం దావా వేసింది.
కరోనావైరస్ కారణంగా మిస్సోరిలో జరిగిన ప్రాణ నష్టం, పౌరులకు ఎదురైన ఇబ్బందులు, ఆర్థిక నష్టం వంటి వాటికి చైనా పరిహారం చెల్లించాలని ఈ దావా కోరుతోంది.
చైనా తన చర్యలకు బాధ్యత వహించాలే చేయాల్సిందేనని మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ ష్మిట్ అన్నారు.
‘‘కోవిడ్-19 ప్రమాదం గురించి, అది ప్రబలే తీవ్రత గురించి ప్రపంచానికి చైనా ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. ఈ ప్రమాదాన్ని శంకించి ముందుగానే గొంతెత్తిన విజిల్ బ్లోయర్లను అణచివేసింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఏమీ చేయలేదు’’ అని చెప్పారు.
అయితే, ఈ సంక్షోభం విషయంలో తాము సరిగ్గానే వ్యవహరిచామని చైనా వాదిస్తోంది.
మిస్సోరి వేసిన దావాకు న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అమెరికా చట్టాల శిక్ష పరిధిలోకి విదేశీ ప్రభుత్వాలు రావు.
కరవు కోరలు చాస్తోంది: ఐరాస హెచ్చరిక
కరోనావైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరవు ఏర్పడొచ్చని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) హెడ్ డేవిడ్ బీస్లీ హెచ్చరించారు.
దీన్ని తప్పించాలంటే తక్షణ చర్యలు అవసరమని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య 13.5 కోట్ల నుంచి 25 కోట్లకు పెరగవచ్చని ఒక నివేదిక పేర్కొంది.
సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పుల ప్రభావం ఎదుర్కొంటున్న పది దేశాల్లో కరవు ముప్పు ఎక్కువగా ఉందని డబ్ల్యూఎఫ్‌పీ అంటోంది.
యెమెన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, అఫ్గానిస్తాన్, వెనెజ్వెలా, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, నైజీరియా, హైతీ దేశాల్లో సమస్య ఎక్కువగా ఉందని గ్లోబల్ రిపర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ నాలుగో వార్షిక నివేదిక తెలిపింది.
ఫొటో సోర్స్, Reuters
60 రోజులపాటు గ్రీన్ కార్డులు బంద్ - డోనల్డ్ ట్రంప్
ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోకి వలసలపై తాము విధిస్తున్న నిషేధం 60 రోజులపాటు కొనసాగుతుందని, శాశ్వత నివాస అనుమతి (గ్రీన్ కార్డు) ఆశిస్తున్నవారికి మాత్రమే వర్తిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లను ఆదుకునేందుకు దేశంలోకి వలసలను నిషేధిస్తామని ఇదివరకు ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో చాలా మంది అయోమయానికి గురయ్యారు.
అయితే, తాత్కాలిక వీసాలపై ఉద్యోగాలు చేసుకునే విదేశీయులకు ఈ నిషేధం వర్తించదని ట్రంప్ స్పష్టత ఇచ్చారు.
ఆదేశం సిద్ధమవుతోందని, బుధవారం సంతకం కోసం తన వద్దకు రావొచ్చని ట్రంప్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందన్నదాన్ని బట్టి, నిషేధాన్ని మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు.
‘‘వైరస్‌పై పోరాటంలో సహచర పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో మంది అమెరికన్లు తమ ఉద్యోగాలు త్యాగం చేశారు. వారి స్థానంలో కొత్తగా వచ్చిన వలసదారులు ఉద్యోగాలు పొందితే, వారికి అన్యాయం జరిగినట్లే. అమెరికా కార్మికులను మేం కాపాడుకోవాలనుకుంటున్నాం. మున్ముందు వారి విషయంలో మరింత రక్షణాత్మకంగా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ఆయన విమర్శకులు అంటున్నారు.
ఇటు చైనాతో వాణిజ్య యుద్ధం సాగుతున్న సమయంలో కరోనావైరస్ వ్యాపించిందని ట్రంప్ అన్నారు.
చైనాపై తనలా మొండి వైఖరి ఎవరూ చూపించలేదని చెప్పారు.
‘‘ఒక్కసారిగా ఈ అదృశ్య శత్రువు ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదు. కానీ, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలుసనే అనుకుంటున్నా. దీని గురించి మనం మాట్లాడుకుంటాం. చాలా మాట్లాడుకుంటామేమో’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం
ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు
• ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 25 లక్షలు దాటింది.
• అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతించే గ్రీన్ కార్డుల జారీని 60 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. కానీ, అవేంటన్నదానిపై స్పష్టత లేదు.
• ఇటలీలో వరుసగా రెండో రోజూ కరోనావైరస్ కొత్త కేసులు తగ్గాయి. ఆ దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1.07 లక్షలకుపైగా మంది కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 4 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇస్తామని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని ఆ దేశ ప్రధాని చెప్పారు.
• బ్రిటన్‌లో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకూ 823 మంది చనిపోయారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గురువారం మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించబోతున్నారు.