You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. ఇప్పటివరకు 1,71,810 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985, మృతుల సంఖ్య 603కు చేరింది.

లైవ్ కవరేజీ

  1. ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కోవిడ్-19

    ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కోవిడ్-19 నిర్ధరణ అయింది. వాళ్ళందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. ఫీల్డులో పని చేస్తున్న రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు 171 మంది రక్త నమూనాలను పరీక్షించిన తరువాత ఈ విషయం వెల్లడైంది.

    కోవిడ్-19 వ్యాధి సోకిన జర్నలిస్టులో చాలా మంది అసింప్టోమాటిక్ అంటే లక్షణాలు పైకి కనిపించని వారేనని బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

    జర్నలిస్టులు కోవిడ్-19 వ్యాధికి గురవడంపై ముంబయి ప్రెస్ క్లబ్ ఆందోళన వ్యక్తం చేసింది.కోవిడ్ అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు విధి నిర్వహణను కూాడా అత్యవసర సేవలుగా గుర్తంచి, బీమా సౌకర్యాన్ని వారికి కూడా వర్తింప చేయాలని ముంబయి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది.

    దీనిపై ముఖ్యమంత్రి ఉధవ్ ఠాక్రే వెంటనే స్పందించాలని ముంబయి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్బీర్ సింగ్ ట్విటర్ ద్వారా కోరారు.

    టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ పరిణామంపై స్పందించారు. ముంబయి జర్నలిస్టులు కరోనావైరస్‌కు గురికావడం అత్యంత దురదృష్టకరమని, కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తలను మా అందరికీ అందిస్తున్న జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కుటుంబ సభ్యుల క్షేమాన్ని చూసుకోవాలని కోరారు.

  2. డబ్ల్యూహెచ్ఓకు చైనీస్ బిలియనీర్ జాక్ మా తోడ్పాటు

    కరోనావైరస్‌పై పోరాటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు పది కోట్ల మాస్కులు, పది లక్షల ఎన్95 మాస్కులు, పది లక్షల టెస్టింగ్ కిట్లు దానం చేయనున్నట్లు చైనీస్ బిలియనీర్, అలీబాబా ఈకామర్స్ సంస్థ వ్యవస్థపాకుడు జాక్ మా ప్రకటించారు.

    బాగా అవసరం ఉన్నవారికి వీటిని అందించనున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు.

    కరోనావైరస్ సవాలును అధిగమించాలంటే ఐకమత్యం, పరస్పర విశ్వాసంతో అందరూ వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని జాక్ మా అభిప్రాయపడ్డారు.

    ఇదివరకు 54 ఆఫ్రికన్ దేశాలకు ఆయన టెస్టింగ్ కిట్లు, పీపీఈ సామగ్రి దానం చేశారు.

  3. భారత్‌లో 18,601 మందికి వైరస్... ఒకే రోజులో 1336 కొత్త కేసులు

    గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,336 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, 47 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 18,601కి చేరుకుంది.

    ఈ మొత్తం కేసుల్లో ఇప్పటివరకు 3,252 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 590 మంది చనిపోయారు.

    ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో 4,666 మంది వైరస్ బాధితులున్నారు. 232 మంది చనిపోయారు. 572 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    దిల్లీలో కరోనా రోగుల సంఖ్య 2,081కు చేరుకుంది. వీరిలో 431 మంది కోలుకున్నారు. 47 మంది చనిపోయారు.

    దేశంలో మూడో స్థానలో ఉన్న గుజరాత్‌లో 1,939 కేసులు నమోదయ్యాయి. వీరిలో 131 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 71 మంది మరణించారు.

    తమిళనాడులో 1,520 మందికి వైరస్ సోకింది. 457 మంది కోలుకున్నారు. 17 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,485కు చేరుకుంది. 127 మంది కోలుకున్నారు. 74 మందిని వైరస్ పొట్టన పెట్టుకుంది.

    మొదటి కోవిడ్-19 కేసును రిపోర్ట్ చేసిన కేరళ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 408 మంది వైరస్ బాధితులున్నారు. 291 మందికి వ్యాధి నయమైంది. ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.

    తెలంగాణలోని 873 మంది కరోనావైరస్తో బాధపడుతున్నారు. 190 మంది కోలుకున్నారు. 23 మంది చనిపోయారు.

    ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 722 మందికి వైరస్ సోకింది. 92 మంది కోవిడ్ నుంచి కోలుకన్నారు. మృతుల సంఖ్య 20.

  4. అమెరికాలోకి వలసలపై తాత్కాలిక నిషేధం

    కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్న ప్రస్తుత సందర్భంలో మన GREAT అమెరికా పౌరుల ఉద్యోగాలు కాపాడాల్సిన అవసరం ఉందని, అందుకోసం అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా రద్దు చేసే ఉత్తర్వులపై తాను సంతకం చేయబోతున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

    అయితే, ఈ ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

  5. ప్రపంచ దేశాల్లో కరోనావైరస్

    జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ అందించిన తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఉదయానికి మొత్తం 24,7,841 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యదికంగా 7,86,638 కేసులు నమోదయ్యాయి. వివిధ దేశాల్లో కరోనా ఇన్పెక్షన్‌కు గురైన వారి వివరాలు:

    1. అమెరికా: 7,86,638

    2. స్పెయిన్: 2,00,210

    3. ఇటలీ: 1,81,228

    4. ఫ్రాన్స్: 1,56,480

    5. జర్మనీ: 1,47,065

    6. బ్రిటన్: 1,25,856

    7. టర్కీ: 90,980

    8. చైనా: 83,826

    9. ఇరాన్: 83,505

    10. రష్యా: 47,121

  6. రాష్ట్రపతి భవన్‌లో కోవిడ్-19 కేసు

    భారత రాష్ట్రపతి భవన్‌లో ఒక వ్యక్తికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    దాంతో, అక్కడున్న మొత్తం 125 కుటుంబాలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం వారికి పరీక్షలు నిర్వహిస్తారు.

  7. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి హారతి పట్టిన పోలీసులు

    మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన ప్రజలకు పోలీసులు హారతి పట్టారు. లాక్‌డౌన్ సమయంలో బయటకు రావద్దని ప్రజలకు వారు అలా హారతి పట్టి మరీ విజ్ఞప్తి చేశారు.

    ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

  8. బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    ఇవీ ఇప్పటివరకున్న ముఖ్యాంశాలు:

    - ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలకు విస్తరించిన కరోనావైరస్ ఇప్పటికే 1.70 లక్షల మంది ప్రాణాలు తీసింది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 24.75 లక్షలు దాటింది.

    - భారతదేశంలో మొత్తంగా 17,656 మందికి కరోనావైరస్ సోకింది. ఇప్పటివరకు 559 మంది చనిపోయారు. 2,842 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    - ఇటలీలో కొత్త కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టడం ఒక సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.

    - తెలంగాణలో సోమవారం ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 23కి పెరిగింది.. పాజిటివ్ కేసుల సంఖ్య 872కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 722, మృతుల సంఖ్య 20.

    - నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారు తప్పనిసరిగా తమ నివాస ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని తెలంగాణ డీజీపీ ఆదేశించారు. ప్రజలు మూడు కిలోమీటర్లు దాటి వెళ్ళకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.