గత 24 గంటల్లో భారతదేశంలో అత్యధికంగా 1,553 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
దీనితో ఇప్పటివరకు భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 17 వేలకు పెరిగింది. మృతుల సంఖ్య 543కు చేరుకుంది.
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ మొత్తం కేసులలో 2,547 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. 543 మంది చనిపోయారు. ఇంకా, 14,175 మంది యాక్టివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. గత 24 గంటల్లోనే 36 మంది మృతి చెందారు.
దేశంలో కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో 4,203 కేసులు నమోదుకాగా, 507 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 223 మంది చనిపోయారు.
ఆ తరువాతి స్థానంలో ఉన్న దిల్లీలో 2,003 కేసులు నమోదయ్యాయి. వారిలో 72 మంది కోలుకున్నారు. 45 మంది చనిపోయారు.
రాజస్థాన్‌లో 1,478, తమిళనాడులో 1,477 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 14 మంది, తమిళనాడులో 15 మంది వైరస్ దెబ్బకు ప్రాణాలు విడిచారు.
మధ్యప్రదేశ్‌లో 1,407 కేసులు నమోదయ్యాయి. 127 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకున్నారు. 70 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా కోవిడ్ బాధితుల సంఖ్య వేయి దాటింది.
దేశంలో మొదటి కోవిడ్ కేసును గుర్తించిన కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 402 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.