You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. ఇప్పటివరకు 1,71,810 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985, మృతుల సంఖ్య 603కు చేరింది.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్‌ LIVE అప్‌డేట్స్

    బీబీసీ తెలుగు ప్రతిరోజూ కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీని నిర్వహిస్తోంది.

    ఏప్రిల్ 21 లైవ్ అప్‌డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

  2. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు దాటిన కేసులు, భారత్‌లో 19 వేలకు చేరువైన పాజిటివ్ కేసుల సంఖ్య

    ప్రపంచవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.

    ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడి 1,71,810 మంది ప్రణాలు కోల్పోయారు. 6,59,732 మంది పూర్తిగా కోలుకున్నారు.

    • భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 18,985కు చేరగా, మృతుల సంఖ్య 603కు పెరిగింది. ఇప్పటి వరకు 3,259 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15,122 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
    • అమెరికాలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7,88,920కి చేరింది. 42,458 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 14,604 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • అమెరికా తర్వాత స్పెయిన్‌లో అత్యధికంగా 2,04,178 కేసులు నమోదయ్యాయి. 21,282 మంది మరణించారు.
    • ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య 1,81,228కి చేరగా, 24,114 మంది చనిపోయారు.
    • ఫ్రాన్స్‌లో 1,56,495 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 20,294కు పెరిగింది.
  3. మహారాష్ట్రలో ఒక్క రోజే 552 కొత్త కేసులు, 19 మంది మృతి

    మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.

    దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5218కి చేరింది. మృతుల సంఖ్య 251కి పెరిగింది.

    ఇవాళ ఒక్క రోజే 150 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 722కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

  4. బ్రిటన్‌లో ఒకే రోజు 828 మంది మృతి

    బ్రిటన్‌లో 24 గంటల్లో 828 మంది కోవిడ్-19తో చనిపోయారు. దాంతో, మొత్తం మృతుల సంఖ్య 17,337కు చేరింది.

    గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,301 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

    దాంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 29 వేలు దాటింది.

  5. తెలంగాణలో మరో 56 కేసులు, ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 26 కొత్త కేసులు

    తెలంగాణలో మంగళవారం కొత్తగా 56 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కు చేరింది.

    ఇప్పటివరకూ రాష్ట్రంలో 23 మంది మృతిచెందారు. ఇవాళ మరణాలు నమోదు కాలేదు.

    ఈ రోజు ఆస్పత్రుల నుంచి 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో, ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 194కు చేరింది.

    ప్రస్తుతం 711 మంది చికిత్స పొందుతున్నారు.

    ఇవాళ సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి.

  6. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు చేరువలో కరోనా కేసులు

    జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సేకరించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 24,94,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,71,152 మరణించారు.

  7. ఆహార కొరత ఉన్న వారి సంఖ్య రెట్టింపు కావచ్చు-ఐక్యరాజ్యసమితి

    కరోనావైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం కొరత ఎదుర్కుంటున్న వారి సంఖ్య రెంట్టింపు కావచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం హెచ్చరించింది.

    2019లో 13.5 కోట్ల మంది తిండి లేక అలమటించగా, 2020లో ఆ సంఖ్య 13 కోట్లకు పైగా పెరిగి 26.5కుచేరుకోవచ్చని చెప్పింది. కోవిడ్-19వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రభావమే దీనికి ప్రధాన కారణం అని చెప్పింది.

    ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం, దాని సహచరులు ప్రపంచ ఆహార సంక్షోభంపై ఒక కొత్త నివేదిక ఇవ్వడంతో ఈ హెచ్చరిక జారీ చేశారు.

    ఆహార సంక్షోభంపై విడుదల చేసిన నాలుగో వార్షిక నివేదికలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించానికి ముందు ఆహారం కొరత తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు.

  8. ఇంగ్లండ్‌లో ఒకే రోజు 778 మంది మృతి

    గత 24 గంటల్లో ఇంగ్లండ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 778 మంది కరోన పాజిటివ్ రోగులు మృతిచెందినట్లు ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.

    వీటితో కలిపి దేశంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 15,607కి చేరింది.

  9. పాకిస్తాన్‌లో 9,500 దాటిన కరోనా కేసులు

    పాకిస్తాన్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 9500 దాటింది.

    కోవిడ్-19 వల్ల 197 మంది చనిపోగా, ఇప్పటివరకూ 2101 మంది డిశ్చార్జ్ అయ్యారు.

  10. భారత్‌లో 600 దాటిన కరోనా మరణాలు, దేశంలో 19 వేలకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

    కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19 వేలకు చేరువలో ఉంది.

    దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,985కు చేరింది. మృతుల సంఖ్య 603కు చేరింది.

    ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుల సంఖ్య 3,259కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్-19 యాక్టివ్ కేసులు 15,122 ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

  11. రెండ్రోజులు భారత్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ పరీక్షలు ఉండవు-ICMR

    దేశంలో మరో రెండు రోజుల వరకూ ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు చేయరని ఐసీఎంఆర్, ఆరోగ్య శాఖ సంయుక్త సమావేశంలో చెప్పారు.

    "వివిధ రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్ట్కిట్లతో చేస్తున్న పరీక్షల్లో ఫలితాలు రకరకాలుగా వస్తున్నాయి. అలా రాకూడదు. అందుకే ఐసీఎంఆర్ తమ బృందాలను అక్కడకు పంపిస్తోంది. రెండు రోజులు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఉపయోగించకుండా ఉండాలని కూడా రాష్ట్రాలకు సూచించాం" అని ఐసీఎంఆర్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ చెప్పారు.

    పూర్తిగా పరిశోధనల తర్వాత ఐసీఎంఆర్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ మార్గదర్శకాలు జారీ చేస్తుందని చెప్పారు.

  12. లాటిన్ అమెరికా అప్‌డేట్- మాస్కుల కొరతపై పెరూలో ఆందోళనలు

    కరోనావైరస్ వల్ల లాటిన్ అమెరికా దేశాల్లో పరిస్థితి:

    • పెరూలో వైద్యసిబ్బంది వైద్య పరికరాల కొరత గురించి ఆందోళనలకు దిగారు. తమకు సింగిల్ యూజ్ మాస్క్‌ ను మళ్లీఉపయోగించాల్సి వస్తోందని చెబుతున్నారు.జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వివరాల ప్రకారం పెరూలో బ్రెజిల్ తర్వాత అత్యధికంగా 16 వేల పాజిటివ్ కేసులు ఉన్నాయి.
    • చిలీలో రెండు వారాల నుంచి ఇరుక్కుపోయిన బొలీవియా తమ వేలాది పౌరులను దేశానికి రావడానికి అనుమతి ఇచ్చింది. రెండు దేశాల సరిహద్దులుతెరిచి 450 బొలీవియా పౌరుల రాకపోకలకు అనుమతిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. బొలీవియా తమ దేశంలో వచ్చేవారు క్వారంటీన్‌లో ఉండడానికి షెల్టర్ హోమ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది.
    • కొలంబియా బొగొటా దగ్గర ప్రాంతాల్లో క్వారంటీన్‌లో ఉన్నవారు వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. అధికారులు భోజనం పార్శిళ్లు కూడా తమ దగ్గరకు చేర్చలేనంత అసమర్థంగా ఉందని ఆరోపిస్తున్నారు.
  13. కరోనాతో పోరాటంలో సహకరించండి-మమతా బెనర్జీ

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్‌కతాలోని రాజాబజార్‌లో పర్యటించారని ఏఎన్ఐ చెప్పింది.

    వాహనంలోనే ఉండి, అందరూ ఇళ్లలోనే ఉండాలని, కరోనావైరస్‌తో చేస్తున్న పోరాటంలో సహకరించాలని ప్రజలను కోరారు.

  14. ఒడిషాకు దిల్లీ నుంచి పీపీఈ కిట్లు

    దిల్లీ నుంచి ఒడిషాకు ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక విమానంలో మొత్తం 459 ప్యాకెట్ల పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు), శానిటైజర్లు పంపించారని ఏఎన్ఐ చెప్పింది.

    ఇవి భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపింది.

  15. కరోనా, అత్యవసర వైద్య సేవలపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు

    కోవిడ్-19పై దృష్టిపెట్టిన కేంద్రం, హెచ్ఐవీ, డయాలసిస్, క్యాన్సర్ లాంటి మిగతా అత్యవసర సేవలు కూడా అందించాలని అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ఏఎన్ఐ చెప్పింది.

    అదే సమయంలో వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పామని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ ఆగర్వాల్ చెప్పారని తెలిపింది.

  16. మెల్లమెల్లగా లాక్‌డౌన్ తొలగించాలి-ప్రపంచ ఆరోగ్య సంస్థ

    కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోడానికి అమలు చేస్తున్న ఆంక్షలను, లాక్‌డౌన్‌ను మెల్లమెల్లగా తొలగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

    చాలా దేశాలు తమ దగ్గర లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తేయాలని ఆలోచిస్తున్న సమయంలో డబ్ల్యుహెచ్ఓ ఈ హెచ్చరికలు చేసింది.

    మంగళవారం హడావుడిగా సరైన సమయానికి ముందే లాక్‌డౌన్ తొలగిస్తే అది కరోనా మరింత వ్యాపించడానికి కారణం కావచ్చని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.

    "కనీసం ఎదైనా చికిత్స వెతికే వరకూ దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యం కాదు. లాక్‌డౌన్ మనకు 'న్యూ నార్మల్' కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి" డబ్ల్యుహెచ్ఓ రీజనల్ డైరెక్టర్(వెస్ట్రన్-పసిఫిక్) తాకేషీ కసాయీ అన్నారు.

    ఏయే ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తేయాలని అనుకుంటున్నాయో, అవి దానిని మెల్లమెల్లగా చేయాలి. పరిస్థితిపై నిరంతరం నిఘా పెట్టాలి అని సూచించారు..

  17. కరోనా సంక్షోభ సమయంలో ఎంపీలో క్యాబినెట్ విస్తరణ

    కరోనా సంక్షోభ సమయంలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ క్యాబినెట్ విస్తరించారు.

    మంగళవారం మధ్యాహ్నం భోపాల్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

  18. ఇండోనేసియాలో రంజాన్ ప్రయాణాలపై నిషేధం

    ఇండోనేషియాలో కరోనావైరస్ వ్యాప్తి అడ్డుకోడానికి దేశ అధ్యక్షుడు జోకో విడోడో రంజాన్ నెలలో ప్రజల రాకపోకలు నిషేధించారు.

    అయితే ప్రభుత్వం చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు.

    ఇండోనేసియాలో దాదాపు 10 లక్షల మంది రంజాన్ సమయంలో నగరాల నుంచి తమ గ్రామాలకు వెళ్తుంటారు. దీనిపై ఇప్పుడు నిషేధం విధించారు.

    ఇండోనేషియా అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం. ఇక్కడ రంజాన్‌ నెలలో ప్రత్యేక సామూహిక కార్యక్రమాలు జరుగుతాయి. వాటిపై కూడా ప్రభుత్వం నిషేధించింది.

  19. దిల్లీ-గాజియాబాద్ సరిహద్దులు పూర్తిగా సీల్

    దిల్లీ-గాజియాబాద్ సరిహద్దుల్లో వాహనాలు క్యూ కట్టాయి. ఈ సరిహద్దులను పూర్తిగా సీల్ చేశారు. కేవలం అవసరమైన సేవలు అందించేవారు, చట్టబద్ధమైన పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

  20. ఎమ్మెల్యే రోజాకు పూలతో స్వాగతంపై విమర్శలు

    చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తీరుపై విమర్శలు వస్తున్నాయి.

    ఆమె తన పుత్తూరు నియోజకవర్గంలోని సుందరయ్య కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికిబోరు వేయించారు. సోమవారం దానిని ప్రారంభించిన సమయంలో ఎమ్మెల్యేను ఘనంగా పూలతో స్వాగతం పలికారు.

    లాక్‌డౌన్ సమయంలో ఎమ్మెల్యే రోజాకు ఇలా పూలతోస్వాగతం పలకడాన్ని కొందరు తప్పుబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిని విమర్శించారు.

    అయితే, ఎమ్మెల్యే మీద అభిమానంతో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంపై విమర్శలు తగదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని అంటున్నారు.