You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: భారత్‌లో 14,792కి చేరిన కోవిడ్-19 కేసులు; 488 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా 22,40,191 మంది కరోనావైరస్ బారినపడ్డారు. 1,53,822 మంది ప్రాణాలు విడిచారు. 5,68,343 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య 7 లక్షలకు సమీపంలో ఉంది. ఇప్పటివరకు 36,773 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వుహాన్‌లో ఒక్కసారిగా మరణాల సంఖ్యలో 50శాతం పెరుగుదల నమోదైంది. దేశం మొత్తంలో 4,636 మంది చనిపోయారు.
లైవ్ కవరేజీ
ప్రపంచవ్యాప్తంగా 1,56,140.. భారత్‌లో 488.. తెలంగాణలో 18.. ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది మృతి
* ప్రపంచవ్యాప్తంగా 22,74,800 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 1,56,140 మంది మరణించారు.(భారత కాలమానం ప్రకారం 18.04.2020 రాత్రి 10 గంటల వరకు)
* భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,792కి పెరిగింది. మృతుల సంఖ్య 488కి పెరిగింది.
* తెలంగాణలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది. మొత్తం మృతులు 18మంది.
* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 603కి చేరింది. 16 మంది మరణించారు.
తెలంగాణలో 809కి చేరిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది.
శనివారం కొత్తగా మరణాలు నమోదు కాలేదు, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌లు లేవు.
ఇప్పటివరకు మొత్తంగా 186 మంది కోలుకోగా 18 మంది మరణించారు. ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులున్నాయి.
శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 31, గద్వాల జిల్లాలో 7, సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.
స్పెయిన్‌లో 20 వేలు దాటిన మృతుల సంఖ్య
స్పెయిన్‌లో కోవిడ్ మృతుల సంఖ్య 20 వేలు దాటిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
ఇప్పటివరకు 20,043 మంది మరణించారని తెలిపారు. మొత్తం 1,91,726 మందికి వైరస్ సోకిందని.. అయితే, వైరస్ సోకుతున్న రేటు నెమ్మదించిందని చెప్పారు.
ఏపీలో కొత్తగా 31 పాజిటివ్ కేసులు.. మొత్తం 603
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో 31 కేసులు పాజిటివ్‌గా తేలాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 603కి చేరింది. వీరిలో 42 మంది డిశ్చార్జి కాగా 16 మంది మరణించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 545.
గత 24 గంటల్లో తూర్పుగోదావరిలో 2, కృష్ణాజిల్లాలో 17, కర్నూలులో 6, నెల్లూరులో 3, ప్రకాశంలో 2, పశ్చిమగోదావరిలో ఒక కేసు నమోదయ్యాయి.
భారత్‌లో 14,792 పాజిటివ్ కేసులు.. 488 మరణాలు
భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 14,792కి పెరిగింది. మృతుల సంఖ్య 488కి పెరిగింది.
2015 మంది కోలుకుని డిశ్చార్జయ్యారని.. ప్రస్తుతం 12,289 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో 79 శాతం, ఏపీలో 61 శాతం మర్కజ్‌తో సంబంధమున్న కేసులే: కేంద్రం
దేశంలో గత 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు, 43 మరణాలు నమోదయ్యాయని. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,378కి మృతుల సంఖ్య 480కి పెరిగిందని కేంద్రం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
మొత్తం కేసుల్లో 29.8 శాతం అంటే, 4,291 నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంతో సంబంధం ఉన్నవేనన్నారు. ఇవి 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాపించాయన్నారు.
తమిళనాడులో 84 శాతం, దిల్లీలో 63 శాతం, తెలంగాణలో 79 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 61 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 59 శాతం మర్కజ్ కేసులేనని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1992 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
మొత్తం కేసుల్లో కోలుకున్నవారి శాతం 13.85. 23 రాష్ట్రాల్లోని 47 జిల్లాలో గత 28 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదని చెప్పారు. మరో 45 జిల్లాల్లో గత 14 రోజుల్లోగా పాజిటివ్ కేసులు లేవన్నారు.
వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్- వంద మంది ప్రముఖ కళాకారుల లైవ్ షో ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వంద మంది కళాకారులు ఈరోజు తమతమ ఇళ్ల నుంచే లైవ్ షోలో పాల్గొంటున్నారు.
వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్ పేరిట నిర్వహిస్తున్న ఈ లైవ్ షోలో బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలతో పాటు టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలీష్ తదితరులు పాల్గొంటున్నారు.
ఎనిమిది గంటలపాటు జరిగే ఈ షోను గ్లోబల్ సిటిజన్ మూమెంట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) నిర్వహిస్తున్నాయి.
ప్రముఖ గాయని లేడీ గాగా దీనికి సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు.
భారతదేశంలో ఈరోజు.. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
కంటైన్‌మెంట్ జోన్‌లో కూరగాయలు అమ్ముతున్న మహిళపై కేసు
ముంబయిలో కరోనావైరస్ కంటైన్‌మెంట్ ప్రాంతంగా గుర్తించిన మన్‌ఖుర్ద్‌లో కూరగాయలు అమ్మే మహిళకు, కానిస్టేబుల్‌కు మధ్య శుక్రవారం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో కూరగాయలు అమ్మకూడదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కేసు కూడా నమోదు చేశారని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
బ్రిటన్‌లో పీపీఈ కిట్ల కొరత.. వాడిన గౌన్లనే మళ్లీ వాడమంటున్న ప్రభుత్వం
బ్రిటన్‌లో కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉపయోగించే గౌన్లు, ఇతర పీపీఈ కిట్ల కొరత ఏర్పడింది. దీంతో, ఒకసారి వాడిన వాటిని మళ్లీ వాడాలని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజాగా విడుదల చేసిన ఈ మార్గదర్శకాలపై డాక్టర్లు, వైద్య సిబ్బంది యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఏ మార్పు అయినా సైన్స్ ఆధారంగా జరగాలే తప్ప లభ్యతను బట్టి కాదని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. డాక్టర్లతో సంప్రదింపులు జరపకుండా ఈ మార్గదర్శకాలు జారీ చేశారని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలిపింది.
కాగా, ఈ వారాంతానికి లండన్‌లో పీపీఈ కిట్ల కొరత సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, కొన్ని వారాల కిందటే పీపీఈ కిట్ల కోసం చైనాకు ఆర్డర్ ఇచ్చామని, అవి వచ్చేందుకు సమయం పడుతోందని ఎన్‌హెచ్ఎస్ ప్రొవైడర్ల ఛైర్మన్ క్రిస్ హాంప్సన్ తెలిపారు.
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేసే డాక్టర్లు వైద్య సిబ్బంది పూర్తిస్థాయి రక్షణ కల్పించే గౌన్లను ధరించాల్సి ఉంటుంది.
"నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్దరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
“దేశమంతా లాక్‌డౌన్ అమలులో ఉంది. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కానీ, నా హౌస్‌మేట్ అవేవీ పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఆయన అర్ధరాత్రి ఇద్దరు మహిళలను వెంట తీసుకొని మా ఫ్లాట్‌కు వచ్చారు" అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
గుజరాత్: 12 గంటల్లోనే 176 కరోనా కేసులు
గుజరాత్ రాష్ట్రంలో ఒక్కసారిగా కోవిడ్-19 కేసులు పెరిగాయి.
గత 12 గంటల్లోనే 176 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 143 కేసులు ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే నమోదుకావడం గమనార్హం. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి ఏడుగురు చనిపోయారు.
గుజరాత్‌లో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1278కి చేరింది. 48 చనిపోయారు.
దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378.. గత 24 గంటల్లో 991 కేసులు, 43 మరణాలు
భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
ఇందులో 11,906 యాక్టివ్ కేసులు కాగా, 1992 మంది కోలుకున్నారు. 480 మంది చనిపోయారు.
గత 24 గంటల్లో 991 కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి.
ఏపీలో 603 కోవిడ్ కేసులు.. కరోనా లక్షణాలున్నవారు, రెడ్ జోన్లలో ఉన్నవారికి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 31 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 603కి చేరుకుంది. వీరిలో 42 మంది కోలుకున్నారు. 15 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 546.
కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.కోవిడ్-19 పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది.
ఇంటింటి సర్వేలో వైరస్ లక్షణాలను గుర్తించిన వారికి, రెడ్ జోన్లలో నివసిస్తున్న వారికి మొదటి విడతగా ఇంటి వద్దే పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం తెలిపింది.
కాగా, కరోనావైరస్‌కు చికిత్స అందించేందుకు గాను ఆసుపత్రుల్లో పనిచేసేందుకు అర్హత కలిగిన డాక్టర్లు, స్పెషలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వాళ్లు dme.ap.nic.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది.
చిత్తూరులో కేసులు 28 - జిల్లా వైద్యాధికారి వివరణ
చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 28 అని, అందులో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 27 మాత్రమేనని జిల్లా వైద్యాధికారి బీబీసీకి తెలిపారు.
రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్‌లో మొత్తం కేసులు 30, అందులో ఒకరు డిశ్చార్జి కాగా.. యాక్టివ్ కేసులు 29 అని పేర్కొన్నారని, ఈ సమాచారం తప్పని వెల్లడించారు.
ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు.
కళ్లెదుటే వరి పంట కనిపిస్తున్నా.. కోతల్లేవు, అమ్మకాలూ లేవు
ఒకపక్క కోతల సమయం, మరో పక్క కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్.. ఈ పరిస్థితులు వ్యవసాయదారులను క్రమంగా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. రబీ పంట కళ్ల ముందు కనిపిస్తున్నా, దాన్ని ఎలా అమ్మి సొమ్ము చేసుకోవాలో రైతులకు అర్థం కావడం లేదు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అందరికీ సాయంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో అది జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
21 మంది నేవీ సిబ్బందికి కోవిడ్-19
ముంబయిలోని నౌకాదళ ప్రాంగణంలో పనిచేస్తున్న 21 మంది సిబ్బందికి కోవిడ్-19 వ్యాధి సోకిందని భారతీయ నౌకాదళం ప్రకటించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
వీరిలో 20 మంది ఐఎన్ఎస్ అంగ్రే నావికులు. వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, అయితే ఏప్రిల్ 7వ తేదీన కరోనావైరస్ సోకినట్లు నిర్థరణ అయిన నావికుడి ద్వారా వీరికి వైరస్ సోకిందని ఇండియన్ నేవీ ప్రకటించింది.
అయితే, నౌకలు, సబ్‌మెరైన్లలోని వారెవరికీ ఈ వైరస్ సోకలేదని నేవీ తెలిపింది.
వైరస్ సోకినవారిని కలిసిన వారందరికీ పరీక్షలు జరిపామని, మార్గనిర్దేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.
లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ట్రంప్ ట్వీట్లు.. ఎత్తేయాలంటూ పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ని వ్యతిరేకిస్తూ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్లు చేశారు. ఆయా రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నవారికి మద్దతుగానే తాను ఈ ట్వీట్లు చేశానని ట్రంప్ సమర్ధించుకున్నారు.
మిన్నెసోట, మిచిగన్, వర్జీనియా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పేరిట అమలు చేస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని ఆయన అన్నారు.
అంతకు ముందు ‘‘లిబరేట్ మిన్నెసోట’’, ‘‘లిబరేట్ మిచిగన్’’, ‘‘లిబరేట్ వర్జీనియా’’ అంటూ ఆయన వరుసగా ట్వీట్లు చేశారు.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలంటూ అమలు చేస్తున్న పలు నిబంధనలను అవసరమని వైద్యాధికారులు అంటున్నారు.
అయితే, ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నిబంధనలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయని, అకారణంగా రాకపోకల్ని నియంత్రిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ పతనానికీ దారితీస్తున్నాయని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు.
తక్షణం లాక్‌డౌన్ ఎత్తేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
మిచిగన్, ఓహియో, నార్త్ కరోలినా, మిన్నెసోట, ఉటా, వర్జీనియా, కెంటకీల్లో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
కాగా, శుక్రవారం ట్రంప్ ట్వీట్లు చేసిన రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష డెమొక్రాట్లు పరిపాలిస్తున్న రాష్ట్రాలే. ట్రంప్ నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న ఓహియో, ఉటా రాష్ట్రాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
విస్కాన్సిన్, ఓరేగాన్, మేరీలాండ్, ఇడహొ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో కూడా నిరసనలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
వర్జీనియాలో నిరసనకారులు కొన్ని డజన్ల మంది మాత్రమే ఉండగా, మిచిగన్‌లో మాత్రం వేలల్లో హాజరయ్యారు.
కాగా, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను పునఃప్రారంభించేందుకు అమెరికా సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక రంగాన్ని, సామాజిక జీవనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మూడు దశల్లో లాక్‌డౌన్‌ను సడలించనున్నారు. ఒక్కో దశ 14 రోజులు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.
అమెరికాలో ఇప్పటి వరకూ దాదాపు 37 వేల మరణాలు నమోదు కాగా, కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది.
కరోనావైరస్‌పై పోరాటానికి పాకిస్తాన్‌కు రూ.64.26 కోట్లు – అమెరికా
కరోనావైరస్‌పై పోరాటానికి పాకిస్తాన్‌కు సుమారు 8.4 మిలియన్ డాలర్లు (రూ.64.26 కోట్లు) సహాయం చేస్తామని అమెరికా ప్రకటించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి పాల్ జాన్స్ శుక్రవారం ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.. తాజా ఆర్థిక సహాయంతో కరోనావైరస్‌పై పోరాడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కూడా జతకలిశామని, దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకుంటామని, ఇది సోకిన వారికి చేయూతనందిస్తామని వెల్లడించారు.
ఈ నిధులతో పాకిస్తాన్‌లో కోవిడ్-19 పరీక్షలు చేసేందుకు ల్యాబొరేటరీలను పెంచుతారు. అలాగే, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారని ఈ కథనంలో పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో ప్రస్తుతానికి 7025 కేసులు నమోదయ్యాయి. ఇందులో 135 మంది చనిపోయారు.
ఇల్లు దాటి బయటకు రావొద్దు అంటున్న మధ్యప్రదేశ్ ‘యముడు’
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఒక పోలీసు కానిస్టేబుల్ యముడి వేషం వేసుకుని కరోనావైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజలంతా తమతమ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన కోరుతున్నారు.
రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ కోసం 180 కోట్ల రూపాయిల విరాళాలు సేకరించిన 99 సంవత్సరాల మాజీ సైనికుడిని "వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్" గా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రశంసించారు.
కెప్టెన్ టామ్ మూర్ 100వ పుట్టిన రోజుకు ముందు ఆయన గార్డెన్ విస్తీర్ణం ఎంత ఉందో దాని కన్నా వంద రెట్లు ఎక్కువ దూరం నడిచి కేవలం 1000 పౌండ్లు అంటే (సుమారు రూ.96000) మాత్రమే సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 30 ఆయన పుట్టిన రోజు.
కానీ ఆయన ప్రారంభించిన ‘జస్ట్ గివింగ్’ పేజీకి ఇప్పటికే 8,90,000 మంది విరాళాలు అందచేశారు. ఆయన్ను వీరుడిగా సత్కరించాలని ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఆనర్స్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.