You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 1,62,070.. భారత్‌లో 519 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 23 లక్షలు దాటింది. లక్షా 60వేల మందికి పైగా దీని బారినపడి మరణించారు. 5.92 లక్షలమంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే అమెరికాలో మాత్రం వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకూ 7.32 లక్షలమందికి ఈ వైరస్ సోకగా 38వేలకు పైగా ప్రజలు ప్రాణాలు విడిచారు.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచవ్యాప్తంగా 1,62,070.. భారత్‌లో 519 మంది మృతి

    ప్రపంచవ్యాప్తంగా 23,67,758 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 1,62,070 మంది మృతిచెందారు.

    * భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,116కి పెరిగింది. వీరిలో 2,302 మంది కోలుకోగా 519 మంది మృతిచెందారు. ప్రస్తుతం 13,295 మంది చికిత్స పొందుతున్నారు.

    * తెలంగాణలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు 21 మంది మరణించారు.. 186 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

    * ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుం 565 మందికి చికిత్స అందిస్తున్నారు.

    * తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించారు.

  2. తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

    తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

    ఏప్రిల్ 20 తరువాత సడలింపు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ, తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని కేసీఆర్ చెప్పారు.

    తెలంగాణలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి.. ఇంతవరకు 21 మంది మరణించారు.. 186 మంది కోలుకుని డిశ్చార్జయ్యారని చెప్పారు. ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

    చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా ఏమీ లేదని చెప్పారు. 33 జిల్లాల్లో 4 జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదన్నారు. దేశంలో కేసుల రెట్టింపు సమయం 8 రోజులు ఉండగా తెలంగాణలో అది 10 రోజులుగా ఉంది. మరణాల రేటు జాతీయ స్థాయిలో 3.22 శాతం ఉండగా తెలంగాణలో 2.44 శాతం ఉంది. దేశంలో సగటున ప్రతి 10 లక్షల మందిలో 254 మందిని పరీక్షిస్తుండగా తెలంగాణలో 375 మందిని పరీక్షిస్తున్నామని చెప్పారు.

    ప్రపంచలో 42 దేశాలు సంపూర్ణంగా లాక్‌డౌన్‌లో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వుహాన్ 72 రోజులు, ఐర్లాండ్ 67, ఫ్రాన్స్ 55,ఆస్ట్రేలియా 54, మలేసియా, లిథువేనియా 43, పెరూ 42 రోజులు లాక్ డౌన్లో ఉన్నాయన్నారు. మన దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ ఉన్నా ఏప్రిల్ 20 తరువాత సడలింపు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ, తెలంగాణలో మాత్రం సడలింపు ఇవ్వబోమని కేసీఆర్ చెప్పారు.

    ప్రస్తుతం ఏ నిబంధనలున్నాయో, ఎలాంటి ఆంక్షలున్నాయో అవన్నీ కొనసాగుతాయని చెప్పారు.

    స్థానిక పరిస్థితులను బట్టి తమ మార్గదర్శకాలకు మించి ఏ రాష్ట్రమైనా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పింది.. ఆ ప్రకారమే తెలంగాణలో సడలింపులు ఇవ్వరాదని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.

  3. కోవిడ్ టెస్టుల విషయంలో ఏపీది రెండో స్థానం: ముఖ్యమంత్రి కార్యాలయం

    ఆంధ్రప్రదేశ్‌లో వైద్యులు రోజుకు 5,508 కోవిడ్-19 టెస్టులు చేసి రికార్డు సృష్టించారని.. ప్రతి 10 లక్షల మందిలో 19 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం వెల్లడించింది.

  4. భారత్‌లో 16 వేలు దాటిన కరోనా కేసులు.. మృతులు 519

    భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,116కి పెరిగింది.

    వీరిలో 2,302 మంది కోలుకోగా 519 మంది మృతిచెందారు. ప్రస్తుతం 13,295 మంది చికిత్స పొందుతున్నారు.

  5. కోవిడ్-19 మతం, జాతి, వర్ణం, కులం, వర్గం, భాష, ఎల్లలు ఏమీ చూడకుండా దాడి చేస్తుంది: మోదీ

    ‘‘కోవిడ్-19 దాడి చేయడానికి ముందు మతం, జాతి, వర్ణ, కుల, వర్గ, భాష, సరిహద్దులు ఏమీ చూడదు. కోవిడ్‌పై పోరాటంలో మనం ఐక్యత, సోదరభావానికి ప్రాధాన్యమివ్వాలి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

  6. బ్రెజిల్‌లో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

    లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా బ్రెజిల్‌లోనూ నిరసనలు తెలుపుతున్నారు.

    బ్రెజిల్ నగరాల్లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆంక్షలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.

    బ్రెజిల్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వేలాది మంది కార్లతో వీధుల్లోకి వచ్చారు.

    బ్రెజిల్ దేశాధ్యక్షుడు బోల్సనార్ ఇంతకుముందు కరోనాను చాలా సాధారణ ఫ్లూ అంటూ కొట్టిపారేశారు.

    దక్షిణ అమెరికాలో అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్నది బ్రెజిల్‌లోనే.. 37 వేలకు పైగా కేసులున్నాయక్కడ.

    ఇప్పటికే 2 వేల మందికిపైగా మరణించారు.

  7. 14.91 శాతం కరోనా రోగులు కోలుకున్నారు: కేంద్రం

    దేశంలో ఇప్పటివరకు కరోనా సోకినవారిలో 2,231 మందికి నయమైందని.. వారంతా కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారని.. కోలుకుంటున్నవారి శాతం 14.91గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.

    దేశంలో కోవిడ్-19 కోసం 755 డెడికేటెడ్ ఆసుపత్రులు, 1389 డెడికేటెడ్ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయన్నారు.

    గత 24 గంటల్లో కొత్తగా 1,334 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 15,712కి చేరిందన్నారు. గత 24 గంటల్లో 27 మరణాలు నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య 507కి చేరిందని చెప్పారు.

    లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీచేసిందని.. వారు ఇప్పుడున్న చోట నుంచి రాష్ట్రాలు దాటేందుకు అనుమతి లేదని చెప్పారు. క్యాంపులో ఉన్నవారి వివరాలు, వారు చేసే పనుల వివరాలు నమోదు చేసి.. అవకాశాలుంటే క్యాంపుల సమీపంలో పనులు చేయించుకోవాలని సూచించిందన్నారు. వారందరికీ ఆహారం, రవాణా ఏర్పాట్లు చేస్తూ సామాజిక దూరం పాటిస్తూ పనులు చేయించాలన్నారు.

    దేశంలో ఇంతవరకు 3,86,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. శనివారం 37,173 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. శనివారం నాటి పరీక్షల్లో 29,287 ఐసీఎంఆర్ ల్యాబ్‌లలో చేయగా 7,866 ప్రయివేట్ ల్యాబ్‌లలో చేశారని ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు.

  8. ప్రసవం కోసం ఆసుపత్రి వెతుకుతూ 7 కిలోమీటర్లు నడిచిన గర్భిణి.. చివరకు డెంటల్ హాస్పిటల్‌లో కాన్పు

    కర్ణాటకలో బెంగళూరు సమీపంలో ఒక గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రిని వెతుకుతూ సుమారు 7 కిలోమీటర్లు నడిచారు.

    చివరకు బెంగళూరులో ఒక డెంటల్ ఆసుపత్రి తెరిచి ఉండడంతో అక్కడికి వెళ్లగా అక్కడ ఉన్న దంతవైద్యురాలు ఆమెకు కాన్పు జరిపారు.

    ఆ తరువాత సమీపంలో ప్రసూతి సదుపాయం ఉన్న ఆసుపత్రికి ఆమెను పంపించారు.

    తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని దంతవైద్యురాలు రమ చెప్పారు.

    ట్వీట్‌లో.. వైద్యురాలు బిడ్డను ఎత్తుకొన్న చిత్రం చూడొచ్చు.

  9. మీడియాతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే

    మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే కొత్తగా 328 కరోనా పాజిటివ్ కేసులు.

    ఒక్క ముంబైలోనే 185.

    మొత్తం కేసుల సంఖ్య 3,651.

    రేపటి నుంచి పరిమిత స్థాయిలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తాం.

    రెడ్ జోన్‌లలో ఆంక్షలు కొనసాగుతాయి.

    రెడ్ జోన్లలో న్యూస్ పేపర్ల బట్వాడా నిషేధం.

    ముంబై, పూణెలలో న్యూస్ పేపర్లు డెలివరీపై నిషేధం.

    గ్రీన్, ఆరెంజ్ జోన్లలలో గూడ్స్ డెలివరీకి ఓకే.

    రాష్ట్ర సరిహద్దుల మూసివేత కొనసాగుతుంది.

    ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గుతోంది.

  10. కరోనావైరస్:చైనా వ్యవహరించిన తీరుపై విచారణ జరపాల్సిందే-ఆస్ట్రేలియా

    కోవిడ్-19 విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.

    వైరస్ ఎక్కడ పుట్టింది..? అది ప్రపంచ దేశాలకు ఎలా వ్యాపించింది ? తదితర విషయాలన్నింటిపైనా స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆ దేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో చైనా అంత పారదర్శకంగా వ్యవహరించినట్టు కనిపించడం లేదని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైజ్ పేన్ వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించడం చాలా ముఖ్యమని ఏబీసీ టెలివిజన్‌కి చెప్పినట్టు రాయిటర్స్ పేర్కొంది.

  11. మే 3 వరకు లాక్ డౌన్‌లో ఎలాంటి మినహాయింపులు ఉండవు-మీడియాతో దిల్లీ సీఎం కేజ్రీవాల్

    ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మే3 వరకు దిల్లీలో లాక్ డౌన్ కఠినంగా కొనసాగుతుందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు.

    నిన్న నమోదైన 186 కేసుల్లో ఏ ఒక్కరికీ వ్యాధి లక్షణాలు కూడా కనిపించలేదన్నారు.

    వారికి వైరస్ సోకిందన్న విషయం కూడా తెలియదని.. ఇది ఆందోళన కల్గించే పరిణామమని ఆయన అన్నారు.

    వారం రోజుల తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.

  12. మే 3 వరకు ఆన్‌లైన్లో అత్యవసరం కానీ వస్తువుల అమ్మకాలు నిషేధం

    దేశంలో లాక్ డౌన్ కొనసాగేంతవరకు అంటే మే 3 వరకు ఆన్ లైన్లో అత్యవసరం కానీ వస్తువులు లభించవు. ఈ మేరకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ కంపెనీల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  13. ఏపీలో 24 గంటల్లో 44 పాజిటివ్ కేసులు నమోదు

    ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 26 కేసులు నమోదయ్యాయి. వారిలో దిల్లీ నుంచి వచ్చిన వారే 16 మంది ఉండగా వాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుం 565 మందికి చికిత్స అందిస్తున్నారు.

  14. కరోనావైరస్: అమెరికా అధ్యక్ష ఎన్నికలను డోనల్డ్ ట్రంప్ వాయిదా వేస్తారా?

    కరోనావైరస్ మహమ్మారితో అమెరికా ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న ఈ సంవత్సరంలో దేశ ప్రజాస్వామ్య ప్రక్రియ మీద కూడా పెను ప్రభావం చూపుతోంది.ప్రస్తుతం మొత్తం 15 రాష్ట్రాలు అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక ప్రైమరీలను జూన్ వరకూ వాయిదా వేశాయి. దీంతో అసలు నవంబర్‌లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడతాయేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి.

  15. దిల్లీలో నిన్న ఒక్క రోజే 186 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు

    శనివారం నమోదైన 186 కొత్త కేసులతో కలపి ఇప్పటి వరకు మొత్తం 1893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సంత్యేంద్ర జైన్ వెల్లడించారు. కొత్తగా 42వేల రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని వారం రోజుల వ్యవధిలో 42 వేల మందికి పరీక్షలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

  16. దిల్లీలో ఇద్దరు వైద్యులు ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్

    దిల్లీలోని లేడీ హార్డింజ్ ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులకు, ఆరుగురు నర్సులకు కోవిడ్-19 సోకినట్టు ఏఎన్ఐ తెలిపింది. వారందర్ని క్వారంటైన్‌కు తరలించినట్టు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఈ మధ్య కాలంలో వారు ఎవరెవర్ని కలిశారో గుర్తిస్తున్నామని తెలిపాయి.

  17. రాజస్థాన్‌లో 1395కి చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య

    గత 24 గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1395కి చేరింది.

  18. కోతకొచ్చిన మామిడి కాసుల్ని రాలుస్తుందా?

    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. కరోనావైరస్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వారిని అప్పుల్లో ముంచేస్తోంది. చాలా ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడి ఉన్నప్పటికీ తగిన రవాణా, మార్కెట్ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  19. భారత్‌లో 507కి చేరిన కరోనా మృతుల సంఖ్య

    భారత్‌లో ఈ ఉదయం 8 గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం కరోనావైరస్ మృతుల సంఖ్య 507కి చేరినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 1334 కేసులు నమోదు కాగా 27 మంది మరణించినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 15,712కి చేరింది. ఇప్పటి వరకు 2230 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

  20. దక్షిణ కొరియాలో 2 నెలల తర్వాత తొలిసారిగా 8 మాత్రమే కొత్త కేసు కేసులు నమోదు

    కరోనావైరస్‌ను కట్టడి చేయడంలో విజయవంతంగా వ్యవహరిస్తున్న దక్షిణ కొరియా తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 8 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయని ప్రకటించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో కేసుల సంఖ్య 10,661కి చేరగా 234 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు చైనాలోనూ మార్చి 17 తర్వాత తొలిసారిగా 16 కేసులు మాత్రమే నమోదయ్యాయి.