You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: తెలంగాణలో 66 కొత్త కేసులతో 766కు పెరిగిన కోవిడ్ బాధితులు

తెలంగాణలో ఇప్పటివరకు కోవిడ్ వ్యాధి బారిన పడి 18 మంది చనిపోయారు. 186 మంది కోలుకున్నారు. అయితే, శుక్రవారం ఒక్కరోజే 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబయిలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ మహానగరంలో 2,120 మందికి వైరస్ సోకింది, 121 మంది చనిపోయారు.

లైవ్ కవరేజీ

  1. లాక్ డౌన్ తీవ్ర మానసిక ఒత్తిడిని కల్గిస్తుందన్న రాయల్ కపుల్

    కరోనావైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతారని అటువంటి వారి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా ముఖ్యమని డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అభిప్రాయపడ్డారు.

    ప్రజలకు ఎక్కడ సహాయం లభిస్తుందన్న విషయం తెలియాల్సినవసరం ఇప్పుడే ఎక్కువ ఉందని ప్రిన్స్ విలియమ్స్ అన్నారు. కరోనావైరస్ సోకిన వారికి సాంత్వన కల్గించడంలో ఎన్‌హెచ్ఎస్ ఉద్యోగులు తమ శక్తి కొద్దీ శ్రమిస్తున్నారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు.

    తన తండ్రి ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ కి వైరస్ సోకిందని తెలియగానే చాలా ఆందోళన చెందానని అన్నారు. లాక్ డౌన్ సమయంలో శారీరక శ్రమపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరమని కేథరిన్ అభిప్రాయపడ్డారు.

    మనలో ఏ ఒక్కరూ సూపర్ హ్యూమన్స్‌ కాదని ఈ సమయంలో తలెత్తే భావోద్రేకాలను నియంత్రించుకునేందుకు కొంత సమయం పడుతుందని విలియమ్స్ వ్యాఖ్యానించారు. కొంత కాలం తర్వాత అంతా సర్దుకుంటుందని అన్నారు.

  2. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 38 కోవిడ్-19 కేసులు నమోదు

    ఏపీలో కొత్త‌గా 38 కేసులు న‌మోద‌య్యాయి. దాంతో మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 572కి చేరింది.

    ఇప్ప‌టి వ‌ర‌కూ 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 523గా ఉంది. క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లో మొత్తం 126 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి.

    క‌డ‌ప జిల్లాలో 13 మంది, అనంత‌పురంలో ఇద్ద‌రు డిశ్చార్జ్ అయ్యారు.

  3. క్షేమంగా భూమికి చేరుకున్న వ్యోమగాములు

    అంతరిక్షం నుంచి ముగ్గురు వ్యోమగాములు క్షేమంగా తిరిగి భూమికి చేరుకున్నట్లు నాసా ప్రకటించింది. కజికిస్తాన్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10.46 గంటలకు చేరుకున్నారని తెలిపింది.

  4. దిల్లీలో 1640కి చేరిన కోవిడ్-19 కేసులు

    దిల్లీలో కొత్తగా 62 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారని ఏఎన్ఐతో అన్నారు. మరో 34 మంది ఐసీయూలో ఉండగా ఆరుగురు వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు.

  5. రెండో విడత ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్, మీడియాతో రిజ్వర్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్

    ఈ సంక్షోభ సమయంలో బ్యాంకుల పని తీరు ప్రశంసనీయమి భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. శక్తికాంత దాస్ ఇంకా ఏమన్నారంటే...

    ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయి.

    ఈ పరిస్థితుల్లో కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.9% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ప్రకటించడం శుభ పరిణామం.

    2021-22 నాటికి 7.1% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఐఎంఎఫ్ తెలిపింది.

    ఫారిన్ ఎక్సేంజి నిల్వల విషయంలో ఢోకా లేదు

    బ్యాంకుల్లో తగినంత ద్రవ్య నిల్వలు ఉన్నాయి.

    దేశంలో 91% ఏటీఎంలు పని చేస్తున్నాయి.

    జీ-20 దేశాల్లో భారత వృద్ధి రేటు అత్యుత్తమం.

    లాక్ డౌన్ తర్వాత రూ.1.2లక్షల కోట్లు విడుదల చేశాం.

    ద్రవ్య లభ్యత కోసం మరిన్ని చర్యలు.

    చిన్న తరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు.

    మైక్రో ఫైనాన్స్ కోసం రూ. 50వేల కోట్లు.

    నాబార్డుకు రూ.25వేల కోట్లు

    జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ. 10వేల కోట్లు

    రివర్స్ రేపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు

    4% నుంచి 3.75%కి చేరనున్న రివర్స్ రేపో రేటు

  6. మరి కాసేపట్లో భూమికి తిరిగిన రానున్న వ్యోమగాములు

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ముగ్గురు వ్యోమగాములుమరి కొద్ది సేపట్లో భూమిపై దిగనున్నారు.

    రష్యాకు చెందిన ఓలెగ్ స్క్రిపోచ్‌కా, అమెరికాకు చెందిన జెస్సికా మెయిర్‌ 2019 సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. మరో అమెరికన్ ఆండ్రూ మోర్గాన్ 2019 జూలైలో వెళ్లారు. వారు వెళ్లే నాటికి భూమిపై కోవిడ్-19 సంక్షోభం మొదలు కాలేదు.

    అంతరిక్షం నుంచి భూమి ఎప్పటిలాగే అద్భుతంగా కనిపిస్తుంది. కానీ మేం వెళ్లిన తర్వాత వచ్చిన మార్పులన్నింటినీ ఒకేసారి నమ్మడం చాలా కష్టమని అమెరికాకు చెందిన మోర్గాన్ కొద్దిసేపటి క్రితం వీడియో కాల్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

  7. రాజస్థాన్‌లో కొత్తగా 38 పాజిటివ్ కేసులు

    రాజస్థాన్‌లో ఇవాళ కొత్తగా 38 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1169కి చేరింది.

  8. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ.2వేల జరిమానా

    కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ఎక్కడబడితే అక్కడ ఉమ్మడాన్ని నిషేధించింది. ఉమ్మడం కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న వైద్య నిపుణుల హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

    మరోవైపు ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై నిషేధం ఉంది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ కోవిడ్-19 సంక్షోభం తర్వాత వివిధ రాష్ట్రాలు కూడా ఈ దిశగా దృష్టి సారించాయి. ఇప్పటికే దిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానాను రూ. 2వేలకు,ముంబైలో రూ.1000కు పెంచారు.

  9. శ్రీకాళహస్తిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు

    చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య పదికి చేరింది. బాధితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు.

  10. దక్షిణ కొరియాలో తిరిగి ప్రారంభం కానున్న యాపిల్ స్టోర్

    దక్షిణ కొరియాలో ఉన్న ఏకైక స్టోర్‌ను శనివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్టు యాపిల్ సంస్థ వెల్లడించింది. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో దక్షిణ కొరియా తీసుకున్న చర్యలే తమ నిర్ణయానికి కారణమని తెలిపింది.

    ప్రస్తుతానికి అమ్మకాలపై మాత్రమే దృష్టి పెడతామని స్పష్టం చేసింది. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో చైనాలో రెండు నెలల షట్ డౌన్ తర్వాత మార్చి నెలలో తిరిగి తమ దుకాణాలను ప్రారంభించింది యాపిల్ సంస్థ. ఆ తరువాత కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యింది.

  11. భారత్‌లో 13వేలు దాటిన ఇన్ఫెక్షన్లు

    భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 13387కు చేరింది.

    ఇందులో 11201 యాక్టివ్ కేసులున్నాయి. 1749 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 437 మంది మరణించారు.

    గత 24 గంటల్లో 1007 కేసులు నమోదు కాగా, 23 మంది మరణించారు.

  12. రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేయడంపై ప్రణాళిక విడుదల చేసిన డోనల్డ్ ట్రంప్

    అమెరికాను తిరిగి పట్టాలపైకి ఎక్కించడమే తాము చేయాల్సిన తదుపరి యుద్ధమని వివిధ రాష్ట్రాల గవర్నర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

    మొత్తం 3 విడతలుగా లాక్ డౌన్‌ను ఎత్తేయాలని సూచించారు. అయితే ఆయన ప్రణాళికపై కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, వైద్య నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  13. ఆస్ట్రేలియాలో ఏడాది పాటు ఆంక్షలు కొనసాగే అవకాశం

    కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో కొన్ని ఆంక్షల్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని ఆస్ట్రేలియా భావిస్తున్నట్టు రాయిటర్స్ తెలిపింది. పాఠశాలలు రోస్టర్ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.

  14. కృష్ణా జిల్లాలో 60 మందికి క్వారంటైన్‌ నుంచి విముక్తి

    ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గన్నవరం ఎన్టీ రామారావు వెటర్నరీ సైన్స్ కాలేజీ క్వారంటైన్ కేంద్రం నుంచి 60 మందిని ఇళ్లకు పంపినట్టు అధికారులు వెల్లడించారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    కోవిడ్-19 పరీక్షల్లో రెండు సార్లు నెగిటివ్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం వారందరూ హౌస్ క్వారంటైన్‌లో ఉండనున్నారు.

    ప్రస్తుతం గన్నవరంలోని క్వారంటైన్ కేంద్రంలో ఇంకా ఏడుగురు మాత్రమే ఉన్నారు.

    ఇప్పటివరకూ ఏపీలో 534 కేసులు నమోదు కాగా, 14 మంది మరణించారు. 500 యాక్టివ్ కేసులున్నాయి.

  15. చైనా చెబుతున్న గణాంకాలు నమ్మదగినవేనా?, బీబీసీ ప్రతినిధి రోబిన్ బ్రాంట్ విశ్లేషణ

    ప్రపంచం నమ్మదగిన అధికారిక గణాంకాలను వెల్లడించడంలో, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించిన విషయాలలో చైనాకు చెడ్డ పేరు ఉంది.

    చాలా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల పనితీరు గురించి వెల్లడించే త్రైమాసిక గణాంకాలలో కచ్చితత్వం పాటిస్తాయి. కానీ, ఈ కమ్యూనిస్టు దేశంలో అలా లేదు.

    కరోనా వ్యాప్తికి ముందు, 2020లో దాదాపు 6 శాతం వృద్ధి సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఏళ్లుగా దాదాపు ప్రతిసారీ ఏమాత్రం వ్యత్యాసం లేకుండా తన అంచనాలను చేరుకుంటున్నట్లు చెబుతోంది.

    కానీ, చైనా అంకెల గారడీ చేస్తోందని, వాళ్లు చెబుతున్నంతగా ఆ దేశ వృద్ధి లేదని విదేశాలకు చెందిన కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు.

  16. 10గంటలకు రిజ్వర్ బ్యాంక్ గవర్నర్ మీడియా సమావేశం

    ఉదయం పది గంటలకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడనున్నారు.

  17. కరోనావైరస్: కోవిడ్-19 దెబ్బకు 7% తగ్గిన చైనా జీడీపీ, చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ దెబ్బ

    కరోనావైరస్ దెబ్బ చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపింది.

    ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సుమారు 6.8% తగ్గినట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

    దాదాపు 3 దశాబ్దాల తర్వాత చైనాలో ఈ స్థాయిలో జీడీపీ పడిపోవడం ఇదే మొదటిసారి.

  18. సింగపూర్‌లో ఒక్కసారిగా పెరిగిన ఇన్ఫెక్షన్లు, కొత్త కేసుల్లో 90శాతం విదేశీ భవన నిర్మాణ కార్మికులే

    సింగపూర్‌లో ఒక్కరోజులోనే ఇన్ఫెక్షన్లు రెట్టింపయ్యాయి. కొత్తగా 728 మందికి పాజిటివ్ అని నిర్ధరణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4427కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 90శాతం విదేశాల నుంచి డార్మిటరీల్లో ఉంటున్న వర్కర్లకు సంబంధించినవే. ఈ డార్మిటరీల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

    దక్షిణాసియా వంటి అనేక ప్రాంతాల నుంచి దాదాపు 3 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇక్కడకు వచ్చి ఉన్నారు. వారంతా పెద్ద పెద్ద డార్మిటరీల్లో నివసిస్తారు. సాధారణంగా ఈ డార్మిటరీల్లో సరైన సౌకర్యాలుండవు. సామాజిక దూరం పాటించడం దాదాపు అసాధ్యం.

    టెస్టింగ్ సంఖ్యను పెంచితే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూడొచ్చు.

    వైరస్ ప్రబలిన తొలి నాళ్లలో కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి, వ్యాప్తిని అరికట్టడంతో సింగపూర్ అనుసరించిన విధానాన్ని అందరూ ప్రశంసించారు.

    ప్రస్తుతం ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడంతో కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు వస్తున్నాయి. దీంతో వారిని కొత్త నివాసాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.

  19. న్యూజీలాండ్‌లో మరో ఇద్దరు మృతి

    న్యూజీలాండ్‌లో కరనావైరస్‌తో మరో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 11మంది మరణించారు. వీరిలో ఏడుగురు ఒకే ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.

    దేశంలో మొత్తం 1409 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 800కు పైగా రోగులు కోలుకున్నారు.

    ఈరోజు కేవలం 8 కొత్త కేసులు వెలుగుచూశాయి.

  20. ప్లాస్మా థెరపీ కొత్తదేం కాదు, మ్యాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా

    ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు వచ్చిన కొత్త విధానమేమీ కాదని, దాన్ని 2003లో సార్స్ వ్యాధి ప్రబలినప్పుడు కూడా ఉపయోగించామని మ్యాక్స్ హెల్త్‌కేర్ వైద్య నిపుణుడు, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా తెలిపారు.

    అనేక రకాల మహమ్మారులు ప్రబలినప్పుడు దీన్ని గతంలో కూడా వినియోగించామని ఆయనన్నారు. 2003లో సార్స్, 1980లో స్పానిష్ ఫ్లూలు ప్రబలినప్పుడు కూడా ఈ పద్ధతిలో చికిత్స జరిగిందని గుర్తుచేశారు. ఓ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేనప్పుడు ప్లాస్మా థెరపీని ప్రయత్నించవచ్చని ఆయనన్నారు.

    “కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి తీసుకున్న ప్లాస్మాను తీవ్రంగా జబ్బుపడిన రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అలా ఆ రోగి శరీరంలోకి చేరుకున్న యాంటీబాడీలు వైరస్ లోడ్‌ను, వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు దోహదపడతాయి” అని డాక్టర్ సందీప్ వెల్లడించారు.