పాకిస్తాన్ వల్లే గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కేసులు పెరిగాయి, ఆరోపించిన హక్కుల కార్యకర్త
ఇరాన్ నుంచి వచ్చిన కరోనావైరస్ రోగులను పాకిస్తాన్ తమ ప్రాంతానికి పంపించడం వల్లే తమ ప్రాంతంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని గిల్గిత్ బాల్టిస్తాన్‌కు చెందిన ఓ సీనియర్ కార్యకర్త ఆరోపించారు.
పాక్ పరిపాలనలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఇప్పటి వరకూ 215 కేసులు నమోదయ్యాయి. మరింత మందికి పరీక్షలు నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కేసులన్నీ కూడా ఇరాన్ నుంచి ఇక్కడకు వచ్చినవారి ద్వారా వెలుగుచూసినవే.
“అనుమానిత రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఇక్కడ లేవు. కానీ పాకిస్తాన్ ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఇరాన్ నుంచి వచ్చిన యాత్రికుల బృందాన్ని ఇక్కడకు అనుమతించేసింది. ఇదే గిల్గిత్ అధికారులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని పెంచింది” అని వాషింగ్టన్ నుంచి వచ్చి, ఇక్కడే ఉంటున్న గిల్గిత్ బాల్టిస్టాన్‌కు చెందిన కార్యకర్త సెంజ్ హెచ్ సెరింగ్ ఏఎన్ఐకు తెలిపారు.
పాక్ పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన సౌకర్యాలు లేవు.
మార్చి 23న ఒసామా రియాజ్ అనే ఓ యువ వైద్యుడు కోవిడ్-19 కారణంగా మృతిచెందాడు. ఇరాన్ నుంచి టఫ్తాన్ మీదుగా ఇక్కడకు వచ్చిన అనుమానిత కరోనావైరస్ రోగికి చికిత్స అందిస్తుండగా ఆ వైద్యునికి కూడా వైరస్ సోకింది. సరైన రక్షణ సౌకర్యాలు లేకుండానే రోగులకు చికిత్స అందించడం వల్లే అతడికి కూడా ఆ మహమ్మారి సోకి, మరణించాడు.
ఫిబ్రవరిలో ఇరాన్‌తో తమకున్న 960 కి.మీ. సరిహద్దును మూసివేయాలని పాకిస్తాన్ నిర్ణయించింది. కానీ, తమ ప్రజలు ఆ దేశానికి తీర్థయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోలేకపోయింది. కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి.
పాకిస్తాన్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంలో విఫలమైందని, దాని ఫలితమే కేసుల సంఖ్యలో పెరుగుదల అని సెంజ్ ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ముందుగానే స్పందించి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని ప్రశంసించారు.