You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆ తరువాత దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని అన్నారు. నిజాముద్దీన్ లేకుంటే దర్జాగా ఉండేవాళ్ళం.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సీఎం కేసీఆర్, తెలంగాణలో ఈరోజు కొత్తగా 16 పాజిటివ్ కేసులు. ఇద్దరు మృతి. 503కు పెరిగిన మొత్తం కోవిడ్ బాధితులు.

    తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

    శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

    ఏప్రిల్ 30 తరువాత పరిస్థితిని బట్టి దశలవారీగా లాక్‌డౌన్ తొలగిస్తూ పోతామని సీఎం అన్నారు.

    రాష్ట్రంలో ఈరోజు మరో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పిన కేసీఆర్, మొత్తం కేసుల సంఖ్య 503కు చేరుకుందని తెలిపారు.

    ఇప్పటివరకు, 96 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య మొత్తంగా 14కు చేరింది.

    1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. అయిచే. పదవ తరగతి పరీక్షల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

    వ్యవసాయంతో పాటు అన్ని రకాల ఆహార ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు, కాయగూరల విక్రయాలను లాక్ డౌన్ నుంచి మినహాయించామని అన్నారు. అయితే, అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు.

    దీనితోపాటు, రాష్ట్రాల రుణాలపై కేంద్రం డిఫర్మెంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రానికి ఈ సమయంలో 4 వేల కోట్ల రూపాయలు రావాలి, కానీ వంద కోట్లే వచ్చాయన్నారు.ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.

    "అప్పులు కడితే, తినడానికి ఉండదు. కేంద్రం సానుుకలూంగా ఉంటుందని నమ్ముతున్నా.దేశ లాక్ డౌన్ విషయంలో ప్రధానమంత్రి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు.అన్ని రాష్ట్రాలు కలసి పనిచేశాయి కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది.ఇంకో పది పదిహేను రోజులు ఇలాగే ఉంటే దేశం బాగుంటుంది" అని కేసీఆర్ అన్నారు.

    ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారు:

    * జబ్బు వచ్చిన వాడు ఇతరులకు అంటించే పాపం చేయడు. కానీ, జబ్బు వచ్చిందని తెలియక అంతా బాగుందని తిరుగుతాడు. వేరేవాళ్ళకు అంటిస్తాడు. నిజాముద్దీన్ పోయినోళ్ళు ఎవరు, వారి చుట్టాలెవరు.. ఎక్కడెక్కడ తిరిగారన్నది... రోకలి బండ తలకు చుట్టమన్నట్లే ఉంది.

    చెప్పినట్లు వినకపోతే పోలీసులు కొడతారు. ఏం చేస్తారు... చెప్పండి? ఎవరూ బయటకు పోవద్దు.

    నూనెలు వంటి నిత్యావసరాలు కల్తీ చేస్తే పీడీ యాక్టు కింద రెండేళ్ళు లోపలేస్తాం.

    మాస్కులు ఎవరికి వారు ఇంట్లో తయారు చేసుకోవాలి. దస్తీలు, బట్ట కర్చీఫ్ కట్టుకోవాలి. నామోషీ అక్కర్లేదు. కోట్లాది మందికి మాస్కులు అందవు.

    లిక్కర్‌క నో చాన్స్... డిమాండ్ చేస్తే అది పిచ్చితనమవుతుంది.

    ప్రైవేటు సంస్థలతో టెస్టులు చేయించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వేయి టెస్టులు చేయగలదు. పాజిటివ్ వస్తే నోటిఫైడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి.

    ఇండొనేషియా నుంచి వచ్చిన వారు బ్రెడ్, చికెన్, ఐపాడ్లు, ల్యాప్ టాప్లు అన్నీ అడిగారు. ఇచ్చాం.

    ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరి ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తంది.

    నిజాముద్దీన్ లేకపోతే దర్జాగా ఉండేవాళ్ళం.

  2. భారత్‌లో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించే అవకాశం

    దేశంలోని 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నాలుగు గంటల పాటు నిర్వహించిన వీడియో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందన్న సంకేతలిచ్చారు.

    సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులందరూ కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ కొనసాగించడమే మేలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    నిజానికి, వచ్చే మంగళవారంతో దేశంలో లాక్ డౌన్ ముగిసిపోవాలి. కానీ, అది కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి.

    ప్రధానితో వీడియో సమావేశం అనంతరం మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు ఏప్రిల్ 30 వరకు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

    దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అయితే, మరో అడుగు ముందుకు వేసి లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ కూడా చేశారు. లాక్ డౌన్ పొడిగించకపోతే ఇప్పటివరకూ చేసిందంతా వృథా అయిపోతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ, "కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాం. ప్రధాని తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి సహకారం అందిస్తాం" అని అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ పోరాటంలో టీమ్ వర్క్ చాలా ముఖ్యమని అన్నారు. "కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందకు తీసుకుంటున్న చర్యల ప్రభావాన్ని అంచనా వేయడానికి రాబోయే 3-4 వారాలు చాలా కీలకం" అని మోదీ చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది మీద జరిగే దాడులను తీవ్రంగా పరిగణించాలని కూడా ప్రధాని సూచించారు.

  3. 'టీ కోవిడ్-19' యాప్ విడుదల చేసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు 'టీ కోవిడ్-19' మొబైల్ యాప్‌ విడుదల చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    తెలంగాణలో కరోనావైరస్‌క సంబంధించిన సమాచారం అంతా ఈ యాప్‌లో చూసుకోవచ్చు. ఫేక్ న్యూస్ పెరగకుండా చూడడంలో ఈ యాప్ తోడ్పడుతుంది.

    ఆరోగ్య శాఖ నిపుణులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ఆరోగ్య - ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఏడబ్ల్యూఎస్‌,సిస్కో, క్వాంటెలా అనే హైదరాబాద్‌లోని స్టార్టప్‌తో కలసి ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

    "ఈ ఒక్క యాప్‌తో కరోనావైరస్‌పై అధికారిక సమాచారాన్ని, వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల్ని, ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని రకాల సేవల వివరాల్ని తెలుసుకోవచ్చు" అని కేటీఆర్ అన్నారు.

    ఈ యాప్ ద్వారా ప్రజల స్వీయ-నిర్ధరణ పరీక్షలు చేసుకుని, తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని కూడా మంత్రి వివరించారు.

    అంతేకాకుండా, ఇంటి వద్ద నుంచే వైద్య నిపుణుల సేవలు అందించే 'కాల్ హెల్త్' టెలిమెడిసిన్ యాప్‌ను దీనితో అనుసంధానించారు.

    "కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో తయారు చేసిన ఈ యాప్ ద్వారా పౌరులందరూ తమ సాధికారిక సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు" అని క్వాంటెలా వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీ అన్నారు.

  4. 'లాక్‌డౌన్ లేకపోతే దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షల్లో ఉండేది'

    లాక్‌డౌన్ సత్ఫలితాలనిస్తోందని భారత ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లవ్ అగర్వాల్ అన్నారు.

    కరోనాకేసుల వ్యాప్తిని నిరోధించడంలో లాక్‌డౌన్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

    లాక్‌డౌన్ కనుక లేకపోయి ఉంటే దేశవ్యాప్తంగా కరోనావైరస్ సంక్రమించిన కేసుల సంఖ్య 8 లక్షలు దాటి ఉండేదని అగర్వాల్ చెప్పారు.

    విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, "దీనిపై ఐసీఎంఆర్ ఎలాంటి పరిశోధనలు చేయలేదు. కానీ, దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న రేటును విశ్లేషించాం. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించాం. మార్చి 22 నుంచి దేశం లాక్‌డౌన్‌లోఉంది. ఈ చర్యలేవీ తీసుకోకపోయి ఉంటే, దేశంలో కరోనా కేసుల వ్యాప్తి వేగం 41 శాతం పెరిగేది. అప్పుడు వైరస్ సోకిన వారి సంఖ్య 8.2 లక్షలకు చేరుకుని ఉండేది" అని వివరించారు.

    వైరస్ వ్యాప్తి కోసం చేపట్టిన చర్యలు సమర్థమైనవని రుజువు అవుతున్నాయన్న అగర్వాల్, "గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,035 కేసులు నమోదయ్యాయి. మొత్తం కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 7,447కు చేరుకుంది" అని చెప్పారు.

    భారతదేశంలో గత 24 గంటల్లో 40 మంది కోవిడ్ వ్యాధితో చనిపోయారు. వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 239 మంది చనిపోయారు. అయితే, 642 మందికి పూర్తిగా వ్యాధి నుంచి కోలుకున్నారని అగర్వాల్ తెలిపారు.

    ఆయన చెప్పిన వివరాల ప్రకారం దేశంలో 586 ప్రత్యేక ఆస్పత్రులు కరోనా రోగుల కోసం అందుబాటులో ఉన్నాయి. వాటిలో లక్షకు పైగా ఐసోలేషన్ పడకలు ఉన్నాయి. పీపీఈ కిట్ల, వెంటిలేటర్లు, ఇతర సామగ్రిని అవసరాన్ని బట్టి రాష్ట్రాలకు సరఫరా చేయగలమని కేంద్రం భరోసా ఇస్తోంది.

  5. 17 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది.

    ఇప్పటివరకూ 1,02,867 మంది మరణించారు.

    3,77,434 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలు, ప్రాంతాలు కరోనావైరస్ బారిన పడ్డాయి.

    అమెరికా ఈ వైరస్ ధాటికి అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకూ ఈ ఒక్క దేశంలోనే 5 లక్షల కేసులు నమోదుకాగా, 18,700 మందికి పైగా ప్రజలు మరణించారు.

    బాధితుల సంఖ్య పరంగా అమెరికా తర్వాత స్థానంలో స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, చైనాలున్నాయి.

    స్పెయిన్‌లో 16వేల మంది మరణించగా, ఇటలీలో 18,800కు పైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

    వైరస్ ప్రారంభమైన చైలో ఇప్పటివరకూ 83 వేల కేసులు నమోదుకాగా, 3,300 మంది మరణించారు.

  6. లాక్‌డౌన్‌పై ‘బీబీసీ తెలుగు’ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ

  7. లాక్‌డౌన్ పొడిగింపు యోచనలో కేంద్రం

    అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మంత్రిని కోరాయని.. వారి వినతులను కేంద్రం పరిగణనలోకి తీసుకునే యోచనలో ఉందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

  8. సుప్రీంకోర్టు వేసవి సెలవులు రద్దు చేయాలి: బార్ అసోసియేషన్

    లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన పరిమితుల వల్ల కోల్పోయిన సుప్రీంకోర్టు పని సమయాన్ని భర్తీ చేయడానికి గాను ఈ ఏడాది వేసవి సెలవులు రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, ఇతర సిటింగ్ జడ్జిలను కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

  9. కాంటాక్ట్ ట్రేసింగ్‌కు కలసికట్టుగా పనిచేస్తున్న గూగుల్, యాపిల్

    కరోనావైరస్ సోకినవారితో ప్రత్యక్షంగా మెలగినవారిని గుర్తించి అప్రమత్తం చేసే ఒక టెక్నాలజీని యాపిల్, గూగుల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.

    స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ సంకేతాల సహాయంతో ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీ పనిచేస్తుంది. బ్లూటూత్ సంకేతాల ఆధారంగా ఆ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వ్యక్తి ఇంకెవరైనా కోవిడ్-19 బాధితులకు సమీపంగా మెలగారా అన్నది గుర్తిస్తారు.

    అలా గుర్తించి ఆ స్మార్ట్‌ఫోన్ యజమానికి సందేశం పంపిస్తారు. ఈ క్రమంలో జీపీఎస్ లొకేషన్ కానీ, వ్యక్తిగత డాటా కానీ గూగుల్, యాపిల్ సంస్థలు రికార్డు చేయబోవు.

  10. ఏపీలో 400 దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 37 కొత్త కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటిపోయింది.

    గత 24 గంటల్లో 909 మంది కోవిడ్-19 పరీక్షలు చేయగా అందులో 37 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణయింది.

    శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు గుంటూరు జిల్లాలో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదైంది.

    ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 402 పాజిటివ్ కేసులు నిర్ధరణ కాగా అందులో 11 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ఆరుగురు మరణించారు.

  11. చిన్నారుల సోషల్ డిస్టెన్సింగ్

    కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సోషల్ డిస్టెన్సింగే సరైన పద్ధతని ప్రపంచమంతా చెబుతున్న వేళ చిన్నారులు కూడా ఇలా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారంటూ, వారిని మెచ్చుకుంటూ సైబరాబాద్ పోలీసులు ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు.

  12. మహారాష్ట్రలో మరో 92 పాజిటివ్ కేసులు

    మహారాష్ట్రలో మరో 92 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 1666కు చేరుకుంది.

  13. లాక్ డౌన్ మరో 15 రోజులు పొడిగించండి: మోదీతో ముఖ్యమంత్రులు

    ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పరిస్థితులపై సమీక్షించారు.

    ఈ సమావేశంలో మోదీ తన ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించారు. ముఖ్యమంత్రులంతా కూడా మాస్కులు వేసుకునే సమావేశంలో పాల్గొన్నారు.

    కనీసం ఈనెల చివరి వరకైనా లాక్ డౌన్‌ను పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

    ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను త్వరగా సరఫరా చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్‌ను కనీసం మరో పదిహేను రోజులపాటు పొడిగించాలని కోరారు. ప్రస్తుత సమయంల ో పేదలను, రైతులను ఆదుకోవాల్సి ఉందని సూచించారు.

  14. బ్రెజిల్‌లో 1000 దాటిన మరణాలు

    దక్షిణార్థ గోళంలో కరోనావైరస్ మృతుల సంఖ్య 1000 దాటిన మొదటి దేశంగా బ్రెజిల్ నిలిచింది.

    ఈ దేశంలో ఇప్పటి వరకూ 1068 మంది మరణించగా 19,789 కేసులు నమోదయ్యాయి.

    చాలా రాష్ట్రాల గవర్నర్లు క్వారంటైన్ నిబంధనలను విధించి, అనుసరిస్తుంటే, అధ్యక్షుడు జైర్ బోల్సనారో మాత్రం వాటిని ప్రశ్నిస్తున్నారు.

    “ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ పరిధిని దాటిపోతుందని, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో దీన్ని అదుపుచేయడం కష్టమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటం వంటివి చాలా కష్టం” అని బీబీసీ సౌత్ అమెరికా ప్రతినిధి కేటీ వాట్సన్ అన్నారు.

    బ్రెజిల్‌లోని ఆదిమ తెగలు కొన్ని ఈ మహమ్మారి కారణంగా అంతరించిపోతాయనే భయాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడేందుకు వారికి ఎక్కువగా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  15. భారత్‌: గత 24 గంటల్లో 1035 కేసులు, 40 మరణాలు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 1035 కొత్త కోవిడ్-19 కేసులు నిర్థరణయ్యాయి. ఇప్పటివరకూ భారత్‌లో ఒకరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

    కోవిడ్-19 కారణంగా 40 మంది మరణించారు.

    ఇప్పటి వరకూ 7447 కేసులు పాజిటివ్ అని నిర్థరణ కాగా, 239 మంది చనిపోయారు. 643 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    ప్రస్తుతం 6565 యాక్టివ్ కేసులున్నాయి.

  16. దిల్లీలో మరో ఆరు కంటైన్‌మెంట్ జోన్లు, మొత్తం 30 జోన్ల గుర్తింపు

    దేశ రాజధాని దిల్లీలో మరో ఆరు ప్రదేశాలను కరోనావైరస్ కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రభుత్వం గుర్తించింది.

    దీంతో ఈ ప్రాంతాల సంఖ్య మొత్తం 30కి చేరింది.

    నబీ కరీం, ఈ-పాకెట్ జీటీబీ ఎన్‌క్లేవ్, జకీర్ నగర్‌లోని స్ట్రీట్ నెంబర్ 18 నుంచి 22 వరకు, అబూబకర్ మసీదు సమీపంలోని ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.

  17. అమెరికాలో 5లక్షల మంది బాధితులు, ఒక్కరోజే 2100 మందికి పైగా మృతి

    అమెరికాలో గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 2,108 మంది మరణించారు.

    కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఓ దేశంలో ఒక్కరోజులో 2000కు పైగా ప్రజలు మరణించడం ఇదే మొదటిసారి అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

    ప్రస్తుతం అమెరికాలో 5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులో నమోదయ్యాయి.

    ఇదే కొనసాగితే త్వరలోనే మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న ఇటలీని అమెరికా దాటేస్తుంది.

    కానీ, అమెరికా వ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వైట్ హౌస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ బృందం చెబుతోంది.

    “మహమ్మారి వ్యాప్తి నియంత్రణలోకి వస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది” అని డాక్టర్ డెబోరా బిర్క్స్ అన్నారు.

  18. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం.

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన తాజా వార్తా విశేషాలు...

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సృష్టించిన విలయానికి ఇప్పటివరకూ 1,02,525 మంది మృతి చెందారు. 16,91,719మంది బాధితులయ్యారు.

    అమెరికాలో బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటివరకూ అక్కడ 18,586 మంది మరణించారు.

    భారత్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య 206కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 16 కేసులు, తెలంగాణలో మరో 16 కేసులు నమోదయ్యాయి.

    లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సమర్థంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేస్తున్నందు వల్లే కరోనా మహమ్మారి ఇతర దేశాల మాదిరిగా భారత్‌లో వేగంగా విస్తరించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.