You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచమంతటా 18 లక్షలు, భారత్‌లో 8,400 దాటిన కోవిడ్ కేసులు,

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 1 లక్ష 10 వేలు దాటింది. భారత్‌లో 273 మంది చనిపోయారు. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 531కి చేరింది. ఏపీలో 15 కొత్త కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్య 420కి పెరిగింది.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్: బీబీసీ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌లో ముఖ్యాంశాలు

    ఆదివారం రాత్రి 10 గంటల సమయానికి జాన్‌హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 18 లక్షలు, మృతుల సంఖ్య 1,10,000 దాటింది. అత్యధికంగా అమెరికాలో 5,30,000 కేసులు నమోదు కాగా స్పెయిన్‌లో 1,66,000 కేసులు, ఇటలీలో 1,52,000 కేసులు ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో 20,646 మంది మరణించగా ఇటలీలో 19,468, స్పెయిన్‌లో 16,972 మంది మరణించారు. బ్రిటన్‌లో 10,612 మంది మరణించారు.

    * భారత్‌లో కేసుల సంఖ్య 8,447కి పెరిగిందని, మృతుల సంఖ్య 273కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    * తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 531కి చేరింది. వీరిలో 103 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 16 మంది మృతిచెందారు. ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఆదివారం ఇద్దరు మృతిచెందగా, ఏడుగురు డిశ్చార్జయ్యారు.

    * ఏపీలో ఆదివారం కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 420కి చేరింది.

    * బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

    * చత్తీస్‌గడ్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు 33 మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు అనుమతి లభించడంతో వారంతా బస్సులో ప్రయాణమయ్యారు.

  2. తెలంగాణలో 513కి చేరిన పాజిటివ్ కేసులు.. 16 మరణాలు

    తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 531కి చేరింది.

    వీరిలో 103 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 16 మంది మృతిచెందారు.

    ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఆదివారం ఇద్దరు మృతిచెందగా, ఏడుగురు డిశ్చార్జయ్యారు.

  3. లాక్‌డౌన్ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు ఎలా ఉన్నాయంటే..

    లాక్‌డౌన్ కారణంగా జనం ఇంటిపట్టునే ఉండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో డ్రోన్ కెమేరాలతో తీసిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.

  4. ఇటలీ నుంచి వచ్చి చత్తీస్‌గఢ్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు లైన్ క్లియర్

    ఇటలీ నుంచి వస్తూ చత్తీస్‌గఢ్‌‌లో చిక్కుకుపోయిన 33 మంది తెలుగు విద్యార్థులు ఏపీలోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.

    ఇటలీ నుంచి దిల్లీ వచ్చాక హరియాణాలోని కేంద్రంలో 14 రోజుల క్వారంటీన్ పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తుండగా వీరిని చత్తీస్‌గఢ్‌లోని నిలిపివేశారు.

    లాక్‌డౌన్ కారణంగా అప్పటి నుంచి వీరు చత్తీస్‌గఢ్‌లోనే చిక్కుకుపోయారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

    వీరు రాయ్‌పూర్, జగదల్‌పూర్ మీదుగా సోమవారానికి విశాఖపట్నం చేరుకోనున్నారు.

  5. ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్న నాయకులు, ఎన్జీవోలపై చర్యలు తీసుకోండి: తమిళనాడు ముఖ్యమంత్రి

    కరోనావైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ అమలు చేస్తుంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు ఆహారం, నిత్యవసరాల పంపిణీ పేరుతో జనాలు గుమిగూడడానికి కారణమవుతున్నారని.. అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారులను ఆదేశించారు.

    ఈ మేరకు ఆయన కలెక్టర్లు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

  6. దుండగుల దాడిలో చేయి తెగిపోయిన పంజాబ్ పోలీసుకు శస్త్రచికిత్స.. చేతిని మళ్లీ అతికించిన వైద్యులు

    లాక్‌డౌన్ వేళ వాహనాలను నియంత్రిస్తుండగా దుండగుల దాడిలో చేయి తెగిపోయిన పంజాబ్‌లోని ఏఎస్‌ఐ హర్జీత్ సింగ్‌కు మళ్లీ ఆ చేతిని అతికించడానికి ఏడున్నర గంటల పాటు శస్త్రచికిత్స చేశారని.. శస్త్రచికిత్స విజయవంతమైందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.

    ఈ మేరకు ఆయన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

  7. వైద్యసిబ్బందికి ధన్యావాదాలు చెప్పిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశ నేషనల్ హెల్త్ సర్వీసెస్ సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

    హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ వీడియో పోస్ట్ చేశారు. కరోనావైరస్ సోకడంతో వారం కిందట ఆయన ఐసీయూలో చేరారు.

    తన ప్రాణాన్ని కాపాడారంటూ వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ ‘‘మీ రుణం ఎలా తీర్చుకోవాలనేది చెప్పడానికి మాటలు దొరకడం లేదు’’ అన్నారు.

    సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటిస్తున్నందుకు దేశ ప్రజలకూ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  8. ఏపీలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు.. మొత్తం 420

    ఏపీలో నిన్న రాత్రి నుంచి ఈరోజు సాయంత్రం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరులో 7, నెల్లూరు లో 4, కర్నూల్ లో 2, చిత్తూరు మరియు కడప జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి.

    కొత్తగా నమోదైన 15 కేసులతో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి పెరిగింది

  9. ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    కోవిడ్-19 బారినపడి ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ డిశ్చార్జయ్యారు.

    గత ఆదివారం నుంచి ఆయన సెయింట్ థామస్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

    డిశ్చార్జయిన తరువాత ఆయన బకింగ్‌హామ్‌షైర్ నివాసంలో ఉండి విశ్రాంతి తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

    అప్పుడే విధుల్లో చేరొద్దన్న వైద్యుల సూచనను ఆయన పాటిస్తారని.. వెంటనే తన విధులు మొదలుపెట్టబోరని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు.

  10. ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ దాఖలును ఖండించిన పాత్రికేయులు

    ‘ది వైర్’ వార్తావెబ్‌సైట్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్దార్థ వరదరాజన్‌పై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిపెద్దసంఖ్యలో పాత్రికేయులు ఖండించారు.

    ఇది కండబలంతో మీడియాను బెదిరించే యత్నమే తప్ప ఇంకేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు. ‘‘దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న సమయంలో మార్చి 25న శ్రీరామ నవవి సందర్భంగా అయోధ్యలో ఒక మత కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారంటూ ‘ది వైర్’ రాయడంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తుందన్న ఆరోపణతో ఆ వెబ్‌సైట్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్ధ వరదరాజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైర్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లోని ఒక వాక్యంలో ఆచార్య పరమహంస్ చేసిన వ్యాఖ్యను యూపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యగా తప్పుగా రాశారు. అయితే, దానిని గుర్తించిన తరువాత ఆ వెబ్‌సైట్ సవరించి వివరణ కూడా ప్రచురించింది. కానీ, దాన్ని అక్కడితో ఆపకుండా ఫైజాబాద్ జిల్లాలో ‘ది వైర్’పై ఏప్రిల్ 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వెంటనే యూపీ పోలీసులు సిద్దార్ధ వరదరాజన్ ఇంటికొచ్చి ఏప్రిల్ 14న హాజరుకావాలని నోటీసులిచ్చి వెళ్లారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న వేళ ఇలా హాజరుకమ్మని చెప్పడం యూపీ ప్రభుత్వం, వారి పోలీసుల ఏకపక్ష, ప్రతీకార ధోరణిని చెబుతున్నాయి. మీడియాకు చెందినవారిపై ఇలాంటి రాజకీయ ప్రేరేపిత వేధింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

    ఈ ప్రకటనపై సుమారు 200 మంది పాత్రికేయులు సంతకాలు చేశారు.

  11. భారత్‌లో 24 గంటల్లో 31 మరణాలు, 918 కొత్త కేసులు

    భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 918 మందికి కరోనావైరస్ సోకడంతో కేసుల సంఖ్య 8,447కి పెరిగింది.

    గత 24 గంటల్లో 31 మంది మరణించడంతో మృతుల సంఖ్య 273కి చేరింది.

    764 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 7,409 యాక్టివ్ కేసులున్నాయి.

  12. 13 దేశాలకు భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు: కేంద్రం

    హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కావాలని కొన్ని దేశాలు భారత్‌ను కోరాయని, దేశీయ అవసరాలను అంచనావేసి, అందుకు తగ్గ అదనపు నిల్వలు ఉంచి, ఆపైన ఉన్న మిగులు మాత్రలను 13 దేశాలకు పంపించేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి కేఎస్ ధాత్వలియా వెల్లడించారు.

  13. 15 రోజుల్లో 8 రెట్లు కేసులు పెరిగాయి.. అయినా సిద్ధంగా ఉన్నాం: లవ్ అగర్వాల్

    కరోనావైరస్ వల్ల కేసులు పెరిగినా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

    ఏప్రిల్ 9 నాటికి కరోనా రోగుల కోసం 1100 పడకలు అవసరం కాగా అప్పటికి దేశంలో 85 వేల పడకలు సిద్ధంగా ఉండేవని.. ఆదివారం 1671 పడకలు అవసరం కాగా కోవిడ్-19 రోగుల కోసమే ప్రత్యేకంగా కేటాయించిన ఆసుపత్రుల్లో 1,05,000 పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

    మార్చి 29 నాటికి భారత్‌లో 979 పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం కేసుల సంఖ్య 8,356కి పెరిగిందని.. వీరిలో 20 శాతం మందిని ఐసీయూలో ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    ఆదివారం గణాంకాల ప్రకారం 1671 మంది రోగులు క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు.

  14. లాక్‌డౌన్‌ ఉల్లంఘించినందుకు కారు ఆపిన ఏఎస్ఐ చేతిని నరికేసిన దుండగులు, పంజాబ్‌లోని పాటియాలాలో దారుణం

    పంజాబ్‌లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కారులో వెళ్తున్న కొందరిని ఆపిని పోలీసు అధికారి చేతిని ఆ కారులోని దుండగులు నరికివేశారు.

    పాటియాలా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏఎస్ఐ చేతిని దుండగులు నరికివేశారు.. దాడిలో మరో ఇద్దరు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు.

    దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేయి కోల్పోయిన ఏఎస్ఐ పేరు హర్జీత్ సింగ్ అని పంజాబ్ డీజీపీ తెలిపారు.

  15. ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు చొప్పున మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు, 16 కోట్ల మాస్కులు సిద్ధం చేసి తొందరగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశం

    కోవిడ్-19 నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి.. ఒక్కొక్కరికీ 3 చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులను వీలైనంత తొందరగా పంపిణీకి చేయాలని సూచించారు.

    రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు చెప్పారు. ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు మొత్తం 32,349 మందిని రిఫర్‌చేయగా అందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యాధికారులు నిర్ధరించారని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పగా.. ఆయన మొత్తం మొత్తం 32,349 మందికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు.

    వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. ఇలాంటివారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు.

    ఇంతవరకు నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు.

    ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 417 కేసులు నమోదు కాగా అందులో దిల్లీ వెళ్లినవారు 199, వారి ద్వారా సోకినవారు 161 మంది ఉన్నారని చెప్పారు.

  16. కరోనావైరస్: ప్రపంచ నాయకత్వం అమెరికా నుంచి చైనా చేతుల్లోకి వెళ్తోందా?, ఫెర్నాండో దువార్తే, బీబీసీ ప్రతినిధి

    కరోనావైరస్ వల్ల అమెరికా, చైనా మధ్య దౌత్య ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ఆడమన్నట్లు ఆడుతోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఇది మరింత ఎక్కువైంది. అమెరికా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓకు ఇస్తున్న నిధులను ఆపేయాలని కూడా ఆలోచిస్తోంది.

    ఇవి మాత్రమే కాదు, కరోనావైరస్ వల్ల దౌత్యపరంగా తలెత్తిన ఉద్రిక్తతలకు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

    ఇటలీలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండడంతో వైద్య వనరులు అందించి సాయం చేయమని ఆ ప్రభుత్వం మిగతా దేశాలను వేడుకుంది. కానీ ఇటలీ పక్కనే ఉన్న రెండు పెద్ద దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ తమ దేశం నుంచి అలాంటి ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించాయి.

    జర్మనీపై ఇటలీ ప్రజలకు మరో విషయంలో కూడా కోపం వచ్చింది. కరోనా మహమ్మారికి అత్యంత ప్రభావితమైన దేశాలకు సాయం అందించేలా విరాళాలు సేకరించి ఒక ఫండ్ ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పుడు, జర్మనీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన దేశాలతో చేతులు కలిపింది.

    “విశ్వ మహమ్మారి ప్రబలిన ఈ సంక్షోభ సమయంలో ఖాళీ అయిన అమెరికా దౌత్య స్థానాన్ని భర్తీ చేయాలని చైనా ఇప్పుడు తెలివిగా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2016లో పదవిలోకి వచ్చినప్పటి నుంచి 'అమెరికా ఫస్ట్' అనే విధానంలో వెళ్తుండడం వల్లే ఇలా జరిగింది. అయినా, అమెరికా తీరు ఎవరితోనూ సఖ్యంగా ఉన్నట్టు కనిపించడం లేదు. చైనాతో ఉద్రిక్తతలే కాకుండా, పాత మిత్రదేశం జర్మనీలో ఒక కంపెనీ తయారు చేయబోతున్న కోవిడ్-19 టీకా ప్రత్యేక హక్కులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన ట్రంప్... ఆ దేశానికి చాలా కోపం కూడా తెప్పించారు. ఇటీవల మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయకపోతే అమెరికా ప్రతిగా స్పందిస్తుందంటూ భారత్‌ను హెచ్చరించారు. ఎందుకంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కోవిడ్-19 చికిత్సకు కూడా పరీక్షిస్తున్నారు” అంటారు పాక్స్ టెకమ్ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గేసూ ఆంతోనియో బాయెజ.

  17. మరణాల సంఖ్యలో ఇటలీని దాటేసిన అమెరికా

    కరోనావైరస్ మరణాల విషయంలో అమెరికా ఇటలీని కూడా దాటేసింది. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 మరణాలు నమోదైన దేశంగా మారింది.

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం కరోనావైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 20,604 మంది ప్రాణాలు వదిలారు.

    ఏ దేశంలోనూ లేనట్లుగా అమెరికాలో ఒకే రోజు 2వేల మంది కోవిడ్-19కు బలయ్యారు.

  18. బోరిస్ జాన్సన్: వైద్య సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటా

    కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకిన నాకు చికిత్సచేసి, కాపాడిన వైద్య సిబ్బందికి నా జీవితాంతం రుణపడి ఉంటానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

    55 ఏళ్ల బోరిస్ జాన్సన్ తనకు వైద్య సేవలందించిన లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుని ప్రస్తుతం సాధారణ వార్డులో ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

    ఆదివారం నాటికి బ్రిటన్‌లో కరోనావైరస్ మరణాలు 10000 దాటతాయని అంచనా. ప్రస్తుతం బ్రిటన్‌లో 9,892 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 వేల మంది కోవిడ్-19 బారినపడ్డారు.

    శనివారం ఒక్కరోజే అత్యధికంగా 917 మంది చనిపోయారు.

    ఈస్టర్ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రావద్దని, ఎవరి ఇళ్లలో వారే ఉండాలని అధికారులు, మంత్రులు విజ్ఞప్తి చేశారు.

  19. దిల్లీలో 1000 దాటిన ఇన్ఫెక్షన్లు

    భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 8356కు చేరింది. 273 మంది ప్రాణాలు విడిచారు.

    గత 24 గంటల్లోనే 909 కేసులు నమోదయ్యాయని, 34 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

    ఇప్పటివరకూ 716మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    మహారాష్ట్ర, దిల్లీల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 1761 మంది కరోనావైరస్ బారినపడగా దిల్లీలో శనివారం నాటికి 903మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆదివారం ఉదయం నాటికి ఈ సంఖ్య 1069కి చేరింది.

    తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో కూడా వైరస్ బాధితులు ఎక్కువగానే ఉన్నారు.

    తమిళనాడులో 969, రాజస్తాన్‌లో 700, మధ్యప్రదేశ్‌లో 532, తెలంగాణలో 503 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.