కోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం వైఎస్.జగన్ సమీక్ష
కోవిడ్-19 నివారణా చర్యలపై సీఎం వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు.
రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని అధికారులు విశ్లేషించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు అందించారు. సోమవారం సాయంత్రం 6 గంటనుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్ పరీక్షలు నిర్వహించామని, ఒక పాజిటివ్ కేసు నమోదైందని సీఎంకు తెలిపారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్నారు.
ఈరోజు ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం 997 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
వీరితో కాంటాక్ట్ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వారిలో 84 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
విదేశాలనుంచి వచ్చిన 205 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిత కాంటాక్ట్ అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.
కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపించిన 134 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి నెగటివ్ వచ్చింది.
సమీక్ష సమావేశంలో హాట్‌స్పాట్లు, కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారు, ర్యాండమ్ పరీక్షలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
కుటుంబ సర్వేద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో ఎవరైనా బాధపడుతుంటే వారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్నవారికి వసతులను పెంచడంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని సూచించారు.