You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 4 వేలు దాటిన కోవిడ్ బాధితులు, 24 గంటల్లోనే 693 కొత్త కేసులు... 109 మృతులు

భారతదేశంలో 4 వేలు కరోనావైరస్ బాధితులు. 109 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సోకిన వారిలో 1,445 మంది దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నవారితో సంబంధం ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. టోక్యోలో త్వరలో ఎమర్జెన్సీ, కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమవుతున్న జపాన్

    రాజధాని టోక్యో నగరంలో ఎమర్జెన్సీ విధించడానికి జపాన్ సిద్ధమవుతోంది.

    ఈ నిర్ణయాన్ని రేపు మంగళవారమే అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని ప్రధానమంత్రి షింజో ఆబే అన్నారు.

    వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావాన్ని తట్టుకునేందుకు భారీ ఆర్థిక ఉద్దీపనను కూడా ఆయన ప్రకటించారు.

    ఇతర దేశాలతో పోల్చితే జపాన్‌లో కరోనా కేసులు తక్కువే ఉన్నాయి. కానీ, అలక్ష్యం చేస్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అతిపెద్ద నగరమైన టోక్యోలో వైరస్ విస్తరించడం మొదలు పెడితే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంటుంది.

    జపాన్‌లో ఇప్పుడు కరోనా కేసులు 1,000 దాటాయి. 85 మంది చనిపోయారు.

    అత్యవసర పరిస్థితి దాదాపు నెల రోజులు ఉంటుందని, ఇది టోక్యోతో పాటు ఒసాకా నగరానికీ వర్తిస్తుందని షింజో ఆబే అన్నారు.

  2. ‘వేల మరణాలు ఆపడం కోసం, ఒకర్ని కొట్టినా తప్పు లేదు’, క్వారంటీన్ ఉల్లంఘించిన పౌరుడిని కొట్టిన పోలీసుకు రివార్డు ప్రకటించిన చెచెన్యా నేత

    వేల మందిని ఖననం చేసేకంటే ఒక్కరిని కొట్టడానికే ఇష్టపడతానని చెచెన్యా నేత రంజాన్ కదీరోవ్ అన్నారు.

    కరోనావైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    చెచెన్యాలోని అర్గున్ పట్టణంలో స్థానిక క్వారంటీన్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఓ పౌరుడిని పోలీసు కొట్టడంతో కదీరోవో ఆ పోలీసును అభినందించడమే కాకుండా రివార్డు ఇస్తానని కూడా ప్రకటించారు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ‘వేల మందిని సమాధి చేసే పరిస్థితి తెచ్చుకోవడం కన్నా ఒకరిని కొట్టడమే మేలని అంటాను’ అని పోస్ట్ చేశారు.

    రష్యా ప్రాంతంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి ఏకంగా కర్ఫ్యూ విధించినది చెచెన్యాలోనే. అక్కడ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ ఉంది.

    కాగా గతవారం కదిరోవ్ చెచెన్యా భూసరిహద్దులన్నీ మూసేస్తామని ప్రకటించారు. కానీ, రష్యా ప్రధాని దానికి అభ్యంతరం చెబుతూ రష్యాలోని ప్రాంతీయ నేతలకు సరిహద్దులు మూసివేసేందుకు అధికారం లేదని చెప్పారు.

  3. కరోనా కాలంలో కళాఖండాలకు కొత్త కళ

    కరోనావైరస్ కారణంగా ప్రపంచం భౌతికంగా స్తంభించిపోయినా సృజన మాత్రం నిరాటంకంగా వెల్లివిరుస్తూనే ఉంది.

    లాక్‌డౌన్, ఐసోలేషన్, క్వారంటీన్ వంటివి కళకు, సృజనకు అడ్డు కాదని నిరూపిస్తున్నారు ఎంతోమంది. రష్యాకు చెందిన ఐసోలేషన్ అనే ఒక ఫేస్‌బుక్ గ్రూప్ ఈ క్లిష్ట సమయంలో ఒక గొప్పపని చేపట్టింది.

    ఈ గ్రూప్ సభ్యులు అద్భుత కళాఖండాలను పునఃసృష్టిస్తున్నారు. జాన్ ఎవరెట్ మిల్లాయిస్ చేతి నుంచి జాలువారిన విఖ్యాత చిత్రరాజం ‘ఒఫీలియా’ను వారు కొత్తగా మలచారు.

    ఒఫిలీయా చిత్రంలో ఓ యువతి నది నీళ్లలో పడుకుని ఉంటుంది.. వీరు దాన్ని చుట్టూ ఉల్లిపాయలు, ఆహారం పొట్లాలు ఉంచి మధ్యలో బాత్ టబ్‌లో యువతి పడుకున్నట్లుగా సరదాగా మార్చారు. వీ

    రు పునఃసృష్టించిన ఒఫీలియాలో ఎల్ గ్రెకో అనే మహిళ ముఖానికి మాస్క్ పెట్టుకుని కనిపిస్తుంది.

    ఇక అమెరికాలో క్వారంటీన్‌లో భాగంగా ఓ ఇంట్లో ఉంటున్న నలుగురు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కోవిడ్ క్లాసిక్స్’ పేరుతో ఇలాంటి చాలెంజే విసిరారు. వారు రెనె మాగ్రిట్ వేసిన ‘ది సన్ ఆఫ్ మేన్’ సహా ఎన్నో అద్భుత చిత్రాలను పునఃసృష్టించారు.

  4. ఆంధ్రప్రదేశ్‌లో 300 దాటిన కరోనావైరస్ కేసులు, కొత్తగా 37 పాజిటివ్ కేసులు, కర్నూలులో నిన్న 52... ఇవాళ మరో 18 కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 303కు చేరింది.

    సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన కోవిడ్ ఫలితాల్లో కొత్తగా 37 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ తెలిపింది.

    కర్నూలులో 18, నెల్లూరులో 8, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒకటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

  5. ప్రస్తుతం మేం పోలీసులపై దాడులు చేయం: మావోయిస్టులు, మల్కన్‌గిరి-కొరాపుట్-విశాఖ డివిజన్ కమిటీ నిర్ణయం

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ నేపథ్యంలో తాము కానీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కానీ పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని మావోయిస్టు పార్టీ ‘మల్కన్‌గిరి, కొరాపుట్, విశాఖ డివిజన్ కమిటీ’ కార్యదర్శి కైలాసం ప్రకటించారు. అయితే, పోలీసుల వైపు నుంచి తమపై ఎలాంటి కార్యాచరణ ఉన్నా తాము ప్రతిఘటించక తప్పదని హెచ్చరిస్తూ.. తమ ప్రతిపాదనపై ప్రభుత్వం తన వైఖరిని 5 రోజుల్లో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పేరిట విడుదలైన ప్రకటనలో కైలాసం.. కరోనావైరస్ ప్రభావం వల్ల, లాక్ డౌన్ వల్ల అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, రోజు కూలీలు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వాలు వారిని ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.

  6. భారతదేశంలో గత 24 గంటల్లో 693 కొత్త కేసులు, వైరస్ సోకిన వారి సంఖ్య 4 వేలు దాటింది. 109 మంది చనిపోయారు.

    భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి చేసిన సమాచారం ప్రకారం గత 24 గంటల్లో 693 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,067కు చేరింది.

    ఈ మొత్తం కేసుల్లో 1,445 కేసులు దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించివేనని తేలింది.

    వైరస్ సోకిన వారిలో 76 శాతం మంది పురుషులు. 24 శాతం మంది మహిళలు. చనిపోయిన వారిలో 73 శాతం మంది పురుషులు, 27 శాతం మంది మహిళలు.

    దేశంలో ఇప్పటివరకు 109 కరోనా మరణాలు సంభవించాయి. వారిలో 63 శాతం మంది 60 ఏళ్ళ పైబడిన వారని ఆరోగ్య శాఖ తెలిపింది.

  7. కోవిడ్-19పై పోరాటానికి భారత్‌కు అమెరికా రూ.22 కోట్ల సహాయం

    కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి సహాయంగా 29,00,000 డాలర్లు(సుమారు రూ.22 కోట్లు) నిధిని అమెరికా ప్రకటించింది.

    ఈ సహాయనిధి విపత్తు నిరోధక చర్యల కోసమని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ తెలిపారు.

  8. ఎంపీల జీతభత్యాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత విధిస్తూ కేంద్రం ఆర్డినెన్స్.. మంత్రిమండలి ఆమోదం

    పార్లమెంటు సభ్యుల జీతాలు, భత్యాలు, పెన్షన్లను ఏడాది పాటు 30 శాతం తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం పలికింది.

    ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

  9. తబ్లిగీ జమాత్‌కు వెళ్లి కరోనా పాజిటివ్‌గా తేలినవారిపై కేసులు: అస్సాం మంత్రి

    దిల్లీలో తబ్లిగీ జమాత్‌కు వెళ్లొచ్చి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణయినవారిపై ఇక నుంచి కేసులు పెడతామని అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

    అస్సాం నుంచి ఈ జమాత్‌కు వెళ్లిన 831 మంది పేర్లు తమ వద్ద ఉన్నాయని.. ఇప్పటివరకు 491 మందిని గుర్తించి వారికి పరీక్షలు చేయించామని.. మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు.

    మసీదు కమిటీలు సహకరించి మిగతా వారి సమాచారం అందించాలని హిమంత కోరారు.

  10. కరోనావైరస్‌తో మరణిస్తే దహనం చేయాలా? ఖననం చేయాలా?

    భారత్‌లో కరోనావైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర.. దేశంలో కరోనా మరణాలు అక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ముంబయి పాలక సంస్థ తాజాగా ఒక ఉత్తర్వును జారీ చేసింది. కోవిడ్-19 సోకి చనిపోయిన వ్యక్తి ఏ మతం వారైనా సరే, శవాన్ని ఖననం చేయవద్దని, తప్పనిసరిగా దహనం చేయాలని అందులో సూచించారు.

    దాంతో, కరోనావైరస్ సంక్షోభం కాస్తా మతపరమైన మలుపు తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకున్న అధికారులు, సవరణలు చేసి మళ్లీ విడుదల చేశారు.

    ఇంతకీ.. కోవిడ్ -19 బారినపడి ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు ఎలా చేయాలి?

    వారి శవాలను ఖననం చేస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందా?

    మృతదేహాలను దహనం చేస్తే ఈ వైరస్ పూర్తిగా నాశనమవుతుందా?

    ఇతర దేశాల్లో ఎలా చేస్తున్నారు?

    అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి?

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏం చెబుతోంది?

  11. ఇటలీలో తగ్గుతున్న ఉద్ధృతి

    ప్రపంచంలోనే కరోనావైరస్ వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయిన ఇటలీలో మృతుల సంఖ్య 15,887కి చేరింది.

    ఆదివారం మరణాలు కాస్త తగ్గడంతో వైరస్ తీవ్రతా తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.

  12. క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు లోటు రాకూడదు: జగన్

    ఆంధ్ర ప్రదేశ్‌లో కోవిడ్‌–19 పరిస్థితిపై సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

    రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 కేసులు దిల్లీకి వెళ్లి వచ్చినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు సీఎంకు వివరించారు. దిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.

    తర్వాత ఇంటింటి సర్వేద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. దీనికి తగినట్లుగా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని తెలిపారు.

    రెడ్‌జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ కూడా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

    సరిపడా టెస్టు కిట్లు తెప్పించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటూ రాకూడదని స్పష్టం చేశారు. ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు.

    కరోనా వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమాటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఇతరత్రా రూపంలో నూటికి నూరుపాళ్లు సహకారం అందిస్తానని అధికారులకు స్పష్టంచేశారు.

    1092కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై దృషి పెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

    మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

  13. లాక్ డౌన్ల కారణంగా పెరుగుతున్న గృహహింస: ఐరాస

    లాక్ డౌన్ల కారణంగా గత కొద్ది వారాలుగా ప్రపంచవ్యాప్తంగా గృహహింస పెరుగుతోందని, ప్రపంచ దేశాలు దీనిపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా దేశాలమధ్య జరుగుతున్న హింసను కరోనావైరస్ కారణంగా ఆపాలని ఆయన కొద్దిరోజుల కిందట కోరారు.

    హింస ఎప్పుడూ యుద్ధభూమిపైనే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

    "ఎంతోమంది మహిళలకు, ఆడపిల్లలకు ఎక్కువ ముప్పు వారి సొంత ఇళ్లలోనే ఉంటుంది" అని ఆయన అన్నారు.

    ఈ లాక్‌ డౌన్లు మొదలైనప్పటినుంచి లెబనాన్, మలేషియా వంటి దేశాల్లోని గృహహింస హెల్ప్ లైన్లకు వచ్చే కాల్స్ గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండింతలు పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. చైనాలో అయితే అది మూడింతలు అయ్యింది. ఆస్ట్రేలియాలో అయితే గృహహింస సాయం గురించి గూగుల్‌లో గత ఐదేళ్ళలోనే అత్యధికంగా వెతుకుతున్నారు.

    పోలీసులు, వైద్య సిబ్బంది కరోనా వల్ల తీరిక లేకుండా పని చెయ్యడం వల్ల ఇతర సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారని ఆంటోనియో గుటెరస్ అన్నారు.

  14. దేశ సేవ పట్ల మనకున్న అంకితభావమే మనకు మార్గాన్ని చూపిస్తుంది: నరేంద్ర మోదీ, బీజేపీ 40వ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగం

    "భారతీయ జనతా పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవం అత్యంత క్లిష్టమైన దశలో వచ్చింది. ప్రస్తుతం మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం అత్యంత క్లిష్టమైన సవాలును ఎదుర్కొంటోంది. మానవ జీవితం సంక్షోభంలో పడింది. ఇలాంటి సంక్షోభ సమయంలో దేశ సేవ పట్ల మనకున్న అంకితభావమే మనకు మార్గాన్ని చూపిస్తుంది" అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

    బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన వీడియో ద్వారా సందేశం వినిపించారు.

    మోదీ ఏమన్నారంటే...

    కోవిడ్-19ను ఎదుర్కోవడానికి భారత్ చేపట్టిన చర్యలను భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొనియాడింది. అన్ని దేశాలు సమైక్యంగా దీనిపై పోరాటం చేయాలి. అందుకే, సార్క్ దేశాల బృందంలో, జీ20 బృందంలో భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది.

    కరోనా కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచాయి. మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకుని, సరైన సమయంలో చర్యలు చేపట్టిన కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఆచరణలో పెట్టడానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాం.

    భారత్ లాంటి పెద్ద దేశంలో లాక్ డౌన్ సమయంలో ప్రజల స్పందన అనూహ్యం. ఇంతటి నిబద్ధతతో దీన్ని పాటిస్తారని ఎవరూ ఊహించి ఉండరు.

    కరోనావైరస్‌ పోరు సుదీర్ఘకాలం సాగుతుంది. ఇందులో విశ్రాంతికి, అలసటకు తావు లేదు. మనం విజయం సాధించాలి. ప్రస్తుతం దేశం ముందున్న లక్ష్యం ఒక్కటే.. కరోనాపై యుద్ధంలో గెలుపు సాధించడం.

    130 కోట్ల భారతీయుల ఐక్యతను ఆదివారం రాత్రి 9 గంటలకు చూశాం. అన్ని వర్గాల ప్రజలు దివ్వెలతో సంఘీభావం తెలిపారు.

    ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే యాప్ తయారుచేసింది. దీని గురించి అందరికీ తెలియచేయండి. ప్రతి వ్యక్తీ మరో 40 మంది దీన్ని ఇన్‌స్టాల్ చేసుకునేలా చూడాలి. తమ చుట్టూ ఉన్న కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇది అవసరం.

    మీరెప్పుడు బయటకు వెళ్లినా మీ ముఖాన్ని కప్పుకుని ఉంచుకోండి. మీ ఇంట్లో ఉన్నా సరే ఇలా ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తం పాటించాల్సిన నియమం ఒకటే... సామాజిక దూరం.

    గతంలో యుద్ధాలు జరిగినప్పుడు మన తల్లులు, అక్కాచెల్లెళ్లు తమ నగలను దేశానికి అందించేవారు. ప్రస్తుత పరిస్థితి కూడా యుద్ధానికి ఏమాత్రం తీసిపోదు. ఇది మానవజాతిని కాపాడేందుకు జరుగుతున్న యుద్ధం. ప్రతి బీజేపీ కార్యకర్త పీఎం కేర్స్ నిధికి విరాళం అందించాలి. మరో 40 మంది అందించేలా చూడాలి.

  15. సింగపూర్లో 20,000 మంది విదేశీ వర్కర్ల క్వారంటైన్

    20,000 మంది విదేశీ వర్కర్లను వారి డార్మిటరీల్లోనే 14 రోజులపాటు ఉండమని సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది.

    దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ఒక దానిలో 13000 మంది వర్కర్లుండగా, వారిలో 63 మందికి కోవిడ్-19 సోకింది.

    మరో దానిలో 6800 మంది ఉండగా, 28 కేసులు నమోదయ్యాయి.

    సాధారణంగా దక్షిణాసియా నుంచి భవన నిర్మాణ పనులకోసం సింగపూర్ వెళ్లినవారికే ఈ డార్మిటరీలే నివాసాలు.

    ప్రస్తుతం వీరందరికీ జీతాలిచ్చి రోజుకి మూడుసార్లు భోజనం పెడుతున్నారు. కానీ, వారు ఉండే ప్రదేశాలు జనాలతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. ఒక్కో గదిలో ఎంతమంది ఉంటారు అన్నది ప్రతి డార్మిటరీకి వేర్వేరుగా ఉంటుంది. 2015లో బీబీసీ ఇటువంటి ఒక కాంప్లెక్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కో గదిలో 12 మంది ఉన్నారు.

    ప్రస్తుతానికి ఈ డార్మిటరీలలో రోజుకి రెండుసార్లు అందరి ఉష్ణోగ్రతలు చెక్ చేసి మాస్కులు, థర్మోమీటర్లు, శానిటైజెర్లు ఇస్తున్నారు.

    సింగపూర్ తగిన సమయంలో స్పందించి, చర్యలు తీసుకున్నప్పటికీ కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నుంచి ఇక్కడ లాక్ డౌన్ అమల్లోకి రానుంది.

    సింగపూర్లో ఇప్పటి వరకు 1300 కేసులు నమోదవగా ఆరుగురు చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 120 కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న లాక్ డౌన్ మాదిరిగా సింగపూర్ ప్రభుత్వం 'సర్క్యూట్ బ్రేకర్' అనే పాలసీని ప్రకటించింది. స్కూళ్ళు, అత్యవసరం కానీ వ్యాపారాలు ఈ వారంలో మూసెయ్యాలని ఆదేశాలు రాగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం అందరికీ సూచించింది.

  16. ఏపీలో మరో 14 కేసులు

    ఆంధ్ర ప్రదేశ్‌లో మరో 14 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 266కు చేరింది.

    విశాఖపట్నం జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరిలో 1 కేసు వెలుగుచూశాయి.

  17. కరోనావైరస్‌‌పై పోరుకు ఐషీల్డ్‌లను ఉత్పత్తి చేస్తున్న యాపిల్

    ఫోన్లకి, కంప్యూటర్లకి ప్రసిద్ధమైన యాపిల్ ఇప్పుడు వైద్య సిబ్బంది తమ ముఖాల్ని రక్షించుకునేందుకు ఐషీల్డ్ అనే పరికరాలను తయారుచేస్తోంది. ఈ విషయాన్ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

    ఐషీల్డ్ డిజైన్ పూర్తై ఇప్పుడు తయారీ ప్రక్రియలో ఉంది. వారానికి పది లక్షలకు పైగా ఐషీల్డులను ఉత్పత్తి చెయ్యడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది.

    ముందుగా ఇవి అమెరికాలోని వైద్య సిబ్బందికి అందించి తరువాత ప్రపంచం మొత్తం పంపిణీ చేయాలన్నది యాపిల్ ఆలోచన. ఇప్పటికే యాపిల్ 2 కోట్ల మాస్కులను ప్రపంచమంతా పంచిపెడుతోంది.

    కరోనావైరస్‌ను ఎదుర్కోడానికి ఇప్పటికే కార్ల కంపెనీల నుంచి ఎలక్ట్రానిక్ కంపెనీల వరకు వారి ఫ్యాక్టరీలను వైద్య పరికరాలను ఉత్పత్తి చెయ్యడానికి వాడుతున్నాయి.

    "ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తున్న ప్రయత్నం. మేం కూడా ప్రభుత్వాలతో రకరకాల స్థాయులలో పనిచేస్తున్నాం. వీటిని అత్యంత అవసరం ఉన్న చోటకు చేర్చడమే మా లక్ష్యం" అని టిమ్ కుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు.

    ఈ ఐషీల్డ్‌లను ఉత్పత్తి చెయ్యడానికి యాపిల్.. ఇంజినీర్లు, డిజైనర్లు, సప్లయర్ల సాయం తీసుకుంటోంది. రెండు నిమిషాలలో అసెంబుల్ చెయ్యగల ఈ ఫేస్ షీల్డుల మొదటి బ్యాచ్‌ను గతవారం కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో కొన్ని ఆసుపత్రులకు చేరవేసినట్టు కుక్ ఈ వీడియోలో తెలిపారు.

    వీటి తయారీలో అమెరికా, చైనా నుంచి తెప్పించిన సామగ్రి వాడారు.

    "యాపిల్ ఈ విధంగా ప్రపంచానికి తన కృతజ్ఞత తెలుపుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని విధాలుగా మేము ఇందులో పాలు పంచుకుంటాం" అని ఆయన అన్నారు.

  18. ఆస్పత్రి నుంచి విడుదలైన గాయని కనికా కపూర్

    ఆరోసారి నిర్వహించిన వైద్య పరీక్షలో కోవిడ్-19 నెగటివ్ అని తేలడంతో గాయని కనికా కపూర్‌ను వైద్యులు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

    కొన్ని రోజులుగా కనికా కపూర్ లఖ్‌నవూ లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు.

    ఆమెకు ఐదుసార్లు కోవిడ్-19 పరీక్ష నిర్వహించగా ఐదుసార్లూ పాజిటివ్ అని తేలింది. ఆరోసారి నెగటివ్ అని ఫలితం రావడంతో ఆమెను హాస్పటల్ నుంచి విడుదల చేశారు.

  19. భారత్‌లో 4000 దాటిన కోవిడ్-19 కేసులు

    భారత్‌లో కోవిడ్-19 కేసులు 4000 దాటాయి.

    గత 12 గంటల్లో 490 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4067కు చేరింది.

    వీటిలో 3666 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 292 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 109 మంది మరణించారు.

    (ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ)