హాకీ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో భారత్ మహిళల మ్యాచ్ డ్రా
ఈ టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్‌లో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాదులోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు.
యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసుల నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ముడు వలయాల భద్రతా ఏర్పాటు చేశారు.
రూట్ టాప్ భద్రతను పటిష్టం చేశారు సౌత్ జోన్ పోలీసులు. మొత్తం 350 మంది పోలీసులతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రత ఏర్పాటుచేశారు.
యోగి ఈరోజు ఉదయం 7.30 గంటలకు హెచ్ఐసీసీ నుంచి బయలుదేరి, భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించారు.
యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బండి సంజయ్, లక్ష్మణ్ కూడా విచ్చేశారు.
హైదరాబాదులో యశ్వంత్ సిన్హా ప్రచారం.. మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/FACEBOOK
శనివారం యశ్వంత్ సిన్హా హైదరాబాదులో పర్యటించి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓట్లు అభ్యర్థించారు.
టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలను వేర్వేరుగా కలిశారు. కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతిస్తున్నప్పటికీ, టీఆర్ఎస్ ముందుడంతో కాంగ్రెస్ నాయకులు యశ్వంత్‌ను కలవలేదు.
యశ్వంత్ – టీఆర్ఎస్ సభ్యుల మీటింగులో కేసీఆర్ సుదీర్ఘంగా హిందీలో మాట్లాడారు. కేంద్రం అనేక తప్పులు చేస్తోందంటూ చెప్పిన ఆయన, ప్రధాన మంత్రిని షావుకార్ల సేల్స్ మెన్‌గా పేర్కొన్నారు.
దేశంలో 4500 కే టన్ను బొగ్గు దొరుకుతుండగా, టన్నుకు 35 వేలు పెట్టి విదేశీ బొగ్గు కొనాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అలా కొనకపోతే కోల్ ఇండియా నుంచి బొగ్గు ఇవ్వమన్నట్టు బెదిరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు.
నల్ల ధనం, కరోనా నిర్వహణలో వైఫల్యం వంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు. తన ప్రశ్నల్లో నిజం లేకపోతే ఆదివారం జరిగే బహిరంగ సభలో మోదీ వాటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘హిందువులకు గంగానది పవిత్రమైనది. అందరూ గంగలో అస్థికలు కలుపుతారు. కానీ మోదీ హయాంలో ఏకంగా శవాలనే కలిపేశారు’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కరోనా సమయంలో ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున వేలాది శవాలను ఇసుకలో పైపైన పూడ్చడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ మాటలు చెప్పారు.

ఫొటో సోర్స్, BANDISANJAY/FACEBOOK
కేసీఆర్ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తారో లేదో తెలియదు కానీ, బండి సంజయ్ స్పందించారు.
‘‘హైదరాబాదును డ్రగ్స్ అడ్డాగా మార్చాడు. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదు. రాష్ట్రపతి ఎన్నికలకు ఫ్లెక్సీలు కట్టి, రైతులకు బేడీలు వేసిన మూర్ఖుడు కేసీఆర్. అసలు ఆయనకు తెలంగాణ రావడమే ఇష్టం లేదు. కేసీఆర్ మగోడైతే మోదీ సర్కారును కూల్చాలి" అంటూ ప్రతి సవాల్ విసిరారు బండి సంజయ్.
‘‘నీది గింత పార్టీ. ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతవ్. నీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చేజారొచ్చు. ఉఫ్ మంటే ఊడిపోయే ప్రభుత్వం నీది’’ అన్నారు సంజయ్.
నేడు హైదరాబాదులో బీజేపీ 'విజయ సంకల్ప సభ'

ఫొటో సోర్స్, BJP/TWITTER
ఇవాళ హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. 'విజయ సంకల్ప సభ' పేరుతో సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తోన్న ఈ సభలో నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు.
ఇప్పటికే తెలంగాణ నుంచి జన సమీకరణకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. వర్షం వచ్చినా సభ కొనసాగేలా నీటికి తడవని టెంట్లు ఏర్పాటు చేసింది. మరోవైపు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు కూడా కొనసాగుతాయి.
ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. చివరిగా ప్రతినిధులను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడతారు.
శుక్ర, శనివారాలు వివిధ అనుబంధ సమావేశాలు జరుగగా, ఆదివారం పూర్తిగా జాతీయ కార్యవర్గ సమావేశమే ప్రధాన ఎజెండా కానుంది. ఇవాళ తెలంగాణ సహా పలు రాజకీయ అంశాలపై చర్చించి పార్టీ వైఖరిపై తీర్మానం చేస్తారు.
శనివారం మోదీ సమక్షంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పేరిణి శివతాండం, కోలాటం, లంబాడీ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. నాదస్వర బృందం కూడా ప్రదర్శన ఇచ్చింది.
ఇవాళ తెలంగాణ వంటకాలను సిద్ధం చేసి మోదీకి రుచి చూపించనున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. కరీంనగర్ నుంచి వచ్చిన యాదమ్మ వాటిని సిద్ధం చేస్తారు.

ఫొటో సోర్స్, BJP/TWITTER
నిన్న సమావేశాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. కరోనాను కేంద్రం ఎదుర్కొన్న తీరు, ఇతర సంక్షేమ పథకాల అమలు, విపక్షాల వైఖరి వంటి అంశాలపై చర్చ జరిగింది.
ఈరోజు సమావేశాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీ అధికారంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ విస్తరించాలని అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
శనివారం వసుంధర రాజే ప్రత్యేకంగా తెలంగాణ విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 'టార్గెట్ తెలంగాణ'గా పనిచేస్తామన్న సంకేతం ఇచ్చారు. తెలంగాణలో బూత్‌కు 200 మంది సభ్యులను నమోదు చేసుకుంటామన్నారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మౌర్య.. ఇలా ఎందరో నాయకులు తెలంగాణలో తమ అధికారం ఖాయం అంటూ మాట్లాడారు.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈరోజు బీజేపీలో చేరతారు.
అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే...ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
