నేషనల్ హెరాల్డ్ కేసు: నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న రాహుల్ గాంధీ, నిరసన ర్యాలీలు చేపట్టనున్న కాంగ్రెస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కానున్నారు.
ఈ వ్యవహారంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఆయనను పిలిచారు.
కాంగ్రెస్ పార్టీ సోమవారం తమ పార్టీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించనుంది. ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్లు, తమ రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నాయి.
నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కట్టబెట్టే క్రమంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. తొమ్మిది నెలల క్రితం మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే రాహుల్ గాంధీ, ఈడీ విచారణకు హాజరయ్యే కంటే ముందురోజు ఆదివారం అనేక నగరాల్లో కాంగ్రెస్ పార్టీ, విలేఖరుల సమావేశాలు నిర్వహించింది. బీజేపీ, రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ఆరోపించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ... “నేను ఒక కాంగ్రెస్ సభ్యుడిగా, న్యాయవాదిగా మాట్లాడుతున్నా.మనీలాండరింగ్ కింద రాహుల్ గాంధీకి ఈడీ పంపిన సమన్లు నిరాధారమైనవి’’ అని అన్నారు.
గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు నేషనల్ హెరాల్డ్ కేసును ఉపయోగించుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాయ్‌పూర్‌లో అన్నారు.విపక్షాల నోరు మూయించేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం అని ఆయన అన్నారు.
లక్నోలో విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ... కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీజేపీ నాయకులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.