You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పశ్చిమ బెంగాల్: బీజేపీని ఎదుర్కొని మూడోసారి విజయం సాధించిన తృణమూల్‌ కాంగ్రెస్‌, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓటమి

బీజేపీని ఎదుర్కొని పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. అయితే నందిగ్రామ్‌లో ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. Kerala: పాలక్కాడ్‌లో ఆధిక్యంలో మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్

    కేరళ ఎన్నికల ఫలితాల తాజా ట్రెండ్స్ ప్రకారం పాలక్కాడ్ నియోజకవర్గంలో మెట్రో మ్యాన్, బీజేపీ అభ్యర్థి శ్రీధరన్ ఆధిక్యంలో ఉన్నారని ఏఎన్ఐ చెప్పింది.

  2. అస్సాంలో బీజేపీదే అధికారం: సీఎం సర్బానంద సోనోవాల్

    అస్సాం ఓట్ల లెక్కింపు ఫలితాల సరళిని బట్టి రాష్ట్రంలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయం స్పష్టం అవుతోందని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఏఎన్ఐతో అన్నారు.

  3. తమిళనాడు: స్వల్ప ఆధిక్యంలో డీఎంకే

    తమిళనాట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈసీ ఇప్పటివరకూ 206 స్థానాల్లో పార్టీల బలాబలాలు ప్రకటించింది.

    విపక్ష డీఎంకే 96 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 81 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    పీఎంకే 10 స్థానాల్లో మెజారిటీ ఉండగా, కమల్ హాసన్ ఎండీఎం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  4. West Bengal: ఆధిక్యంలో తృణమూల్ కాంగ్రెస్

    పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 స్థానాలకు 263 స్థానాల్లో ఫలితాల సరళిని ఈసీ విడుదల చేసింది.

    తృణమూల్ 172 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 87 స్థానాల్లో మెజారిటీ సాధించింది.

  5. పశ్చిమ బెంగాల్: పీపీఈ కిట్లతో సిబ్బంది కౌంటింగ్

    4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఓట్ల లెక్కింపు కరోనా మహమ్మారి మధ్య కొనసాగుతోంది.

    కానీ, కౌంటింగ్ సిబ్బందికి కరోనా భయం ఉండడంతోకౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

    సోషల్ డిస్టన్సింగ్, శానిటైజేషన్, రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ రిపోర్ట్ లాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

    కొన్ని కేంద్రాల్లో కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కూడా పీపీఈ కిట్ వేసుకుని ఉండడం కనిపిస్తోంది.

  6. Nandigram: మమతా బెనర్జీ వెనుకంజ

    పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి తృణమూల్ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంటే ముందంజలో ఉన్నారు.

    మొదట టీఎంసీలో మమతా బెనర్జీకి అత్యంత ముఖ్య నేతల్లో ఒకరుగా ఉన్న శుభేందు అధికారి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు.

    ఎన్నికల సంఘం వివరాల ప్రకారం మమతా బెనర్జీ ప్రస్తుతం శుభేందు కంటే 4728 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.

  7. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే హోరాహోరీ

    తమిళనాడులో 234 నియోజవర్గాల్లో 170 స్థానాల్లో పార్టీల బలాబలాలను ఈసీ ప్రకటించింది. డీఎంకే 76 స్థానాల్లో, అన్నాడీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  8. యానాం తొలి రౌండ్ ఫలితాల విడుదల

    యానాంలో తొలి రౌండ్ పలితాలు విడుదలయ్యాయి.

    బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎం రంగస్వామి 138 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఎన్.రంగస్వామికి 1174, స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ అశోక్ 1036 ఓట్లు వచ్చాయి.

  9. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్లోని మొత్తం 292 స్థానాల్లోని 156 నియోజకవర్గాల్లో తృణమూల్ 101, బీజేపీ 53, స్వతంత్రులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.

  10. ఐదు రాష్ట్రాల ఫలితాల కోసం...

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ముందంజలో ఉందో తెలుసుకోడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

  11. తమిళనాడులో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ముందంజ

    తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో పోటీ చేసిన ఆయన తన పోటీదారుల కంటే ముందున్నారు.

    డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా తాను పోటీ చేసిన బోడినాయక్కనూర్‌లో ఆధిక్యంలో ఉన్నారు.

    కోవిల్ పట్టిలో పోటీ చేసిన ఏఎంఎంకే లీడర్ టీటీవీ దినకర్ వెనుకంజలో ఉన్నారు.

  12. పశ్చిమబెంగాల్‌లో రెండు చోట్ల బీజేపీ, ఒక చోట టీఎంసీ ఆధిక్యం

    సీ-ఓటర్ అందించిన వివరాల ప్రకారం పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం రెండు సీట్లలో బీజేపీ, ఒక స్థానంలో టీఎంసీ ముందంజలో ఉన్నాయి.

    2019 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో ప్రభావం చూపిన బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలోనూ గట్టి పోటీ ఇస్తోంది.

  13. కరోనా మహమ్మారి మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

    కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో, ప్రతి రోజూ వేల మంది సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

    మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలకు అనుమతి ఇచ్చిన భారత ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది.

    మద్రాస్ హైకోర్ట్ అయితే, ఎన్నికల సంఘం మీద హత్యారోపణలు నమోదు చేయాలని కూడా వ్యాఖ్యానించింది.

    పశ్చిమ బెంగాల్

    పశ్చిమ బెంగాల్‌లో ఓటింగ్ 8 దశల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ జరిగింది.

    అదికార తృణమూల్, బీజేపీ రాష్ట్రంలో చాలా జోరుగా ప్రచారం నిర్వహించాయి. మమతా బెనర్జీ మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే, బీజేపీ టీఎంసీకి గట్టిపోటీ ఇచ్చింది.

    ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో తుది దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ల్స్ వెల్లడయ్యాయి.

    వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి కావచ్చని అంచనా వేశారు. కానీ బీజేపీ-తృణమూల్ మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంటుందని చెప్పారు.

    ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వామపక్ష-కాంగ్రెస్ కూటమి, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కూటమి సాధారణ స్థానాలతో మూడో స్థానంలో ఉంటుంది.

    బీజేపీ 2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాల్లో 18 ఎంపీ సీట్లు గెలుచుకుంది.

    పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా అంటే 147 సీట్లు అవసరం. అయితే కౌంటింగ్ 292 స్థానాలకు మాత్రమే జరుగుతోంది.

    ముర్షీదాబాద్‌లోని 2 స్థానాల్లో అభ్యర్థుల కరోనాతో చనిపోవడంతో అక్కడ పోలింగ్ ఆపివేశారు.

    రాష్ట్రంలో విజయం మాదేనని తృణమూల్, బీజేపీ రెండూ చెబుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్ తర్వాత అందరి కళ్లూ తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఫలితాల మీద ఉన్నాయి.

    తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం విపక్ష డీఎంకేకు భారీ మెజారిటీ లభించవచ్చని తెలుస్తోంది. కరుణానిధి మరణం తర్వాత 62 ఏళ్ల స్టాలిన్ డీఎంకే అతిపెద్ద నేతగా ఆవిర్భవించారు.

    తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే వెనకబడవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తమిళనాడులో మొదటిసారి దిగ్గజ నేతలైన కరుణానిధి, జయలలిత లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.

    తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన నటుడు కమల్ హాసన్ పార్టీ కూడా ఈసారీ ఎన్నికల్లో బరిలో నిలిచింది.

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్ పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

    అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ కూడా తమ విజయం ఖాయమని ఆత్మవిశ్వాసంతో ఉంది.

    కేరళలో గత 40 ఏళ్లుగా ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారుతూ వస్తోంది.

  14. బీబీసీ ఎన్నికలఫలితాల లైవ్ పేజీకి స్వాగతం. ఈ పేజీ ద్వారా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిని మేం ఎప్పటికప్పుడు మీకు అందించబోతున్నాం.