You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనా లాక్‌డౌన్: ఏపీలో 162, తెలంగాణలో 229కి చేరిన మొత్తం కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు ఓ కొత్త కేసు నమోదైంది. దీంతో కరోనా రోగుల సంఖ్య 162కి చేరింది. నలుగురు ఈ వ్యాధి బారినుంచి కోలుకున్నారు. ఒకరు చనిపోయారు. తెలంగాణలో ఈరోజు కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. 11 మంది చనిపోయారు. 32 మంది కోలుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. రూ. 2 కోట్ల విరాళాలను ట్రాన్స్‌ఫర్ చేసేశాను: పవన్ కల్యాణ్

    తాను ప్రకటించినట్లుగానే రూ.కోటి పీఎం-కేర్స్ నిధికి.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. 50 లక్షల చొప్పున డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

  2. కరోనా, కోవిడ్... రాయపూర్ కవల పిల్లలకు వైరస్ పేర్లు

    ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నగరంలో తాజాగా జన్మించిన కవల పిల్లలకు కరోనావైరస్ పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు. కవలల్లో బాలుడు, బాలిక ఇద్దరూ ఉన్నారు. ఒకరికి కరోనా అని, మరొకరికి కోవిడ్ అని పేరు పెట్టారు.

    ప్రపంచ వ్యాప్తంగా జనజీవనానికి ఎదరవుతున్న ప్రస్తుత కాలంలో అధిగమించిన కష్టాలకు సంకేతంగా తమ పిల్లలకు ఈ పేర్లు పెట్టామని వారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

    ఈ చిన్నారులు మార్చి 26వ తేదీన జన్మించారు. ప్రసవం చాలా కష్టమైందని వారి తల్లి తెలిపారు. ‘‘మేం చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. ఆ రోజును గుర్తుంచుకోవాలని నేను, నా భర్త భావించాం’’ అని ఆమె పేర్కొన్నారు.

    ‘‘ఈ వైరస్ ప్రమాదకరమైనదే. కానీ అది విజృంభించటం వల్ల జనం పరిశుభ్రతను పాటించేలా చేసింది, ఇతర మంచి అలవాట్లు అలవరుచుకునేలా చేసింది. అందుకే మేం ఈ పేర్లు పెట్టాలనుకున్నాం’’ అని వివరించారు.

    ఈ పిల్లలు పుట్టిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారులను కరోనా, కోవిడ్ అని పిలవటం కూడా తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకోవటానికి దోహదపడింది.

  3. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనావైరస్ మరణం

    ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనావైరస్ మరణం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది.

    విజయవాడకు చెందిన ఒక వ్యక్తి కోవిడ్-19 కారణంగా మార్చి 30వ తేదీ సోమవారం చనిపోయినట్లు తెలిపింది.

    ‘‘ఆయన ఆ రోజు ఉదయం 11.30 గంటలకు ఆసుపత్రికి వచ్చి 12.30 గంటలకు చనిపోయారు. ఆయనకు బీపీ, షుగర్, గుండె సమస్యలు ఉన్నాయి. ఆయన కొడుకు మార్చి 17న దిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. ఆయన కొడుకుకు కూడా కరోనావైరస్ సోకినట్లు ఆ మరునాడు అంటే మార్చి 31న నిర్ధారణ అయింది. దిల్లీ వెళ్లిన వచ్చిన ఆయన కుమారుడి ద్వారా ఈ వ్యాధి సోకినట్టు భావిస్తున్నాం’’ అని పేర్కొంది.

    కరోనా బాధితుడు విజయవాడ జనరల్ ఆసుపత్రికి వచ్చిన వెంటనే స్వాబ్ తీసుకుని పరీక్షలకు పంపించామని.. ఈలోపే ఆయన చనిపోయారని చెప్పింది.

    ‘‘విజయవాడ శివారు కుమ్మరిపాలెంలో ఉండే ఆయన దాదాపు 29 మందిని కలిశారు. వారందరినీ క్వారంటైన్ కి పంపించాం. వారి అబ్బాయి వచ్చిన విమానం వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఆయన కోవిడ్ వల్ల చనిపోయారా, మరో కారణమా తెలుసుకోవడంలో ఆలస్యం జరిగింది’’ అని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో వివరించారు.

  4. కరోనాపై పోరాటానికి బాలకృష్ణ రూ. 1.25 కోట్ల విరాళం

    కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్నందమూరి బాలకృష్ణరూ. 1 కోటి 25 లక్షలు విరాళంగా ప్రకటించారు.

    అందులో రూ. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయ నిధికి, రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నారు.

    లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి.కళ్యాణ్‌కు అందించారు.

  5. కరోనావైరస్ మీద పోరాటానికి షారుఖ్ సాయం.. మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలతో కలిసి కృషి

    కరోనావైరస్ మీద పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ రంగంలోకి దిగారు. అందుకోసం పలు చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

    ‘‘కరోనావైరస్ మీద పోరాటం ఎంతో భారీస్థాయి పని. మాకు వీలైనంత వరకూ మా వంతు కృషిని అందించటానికి గల మార్గాల గురించి నేను, నా బృందం చర్చించుకున్నాం. కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించాం. అవి చిన్నపాటి మార్పు తేగలవని మేం ఆశిస్తున్నాం’’ అని ఆయన శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

    ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ.. వైద్య సిబ్బందికి 50,000 వ్యక్తిగత రక్షణ పరికరాలను సరఫరా చేయటానికి షారుఖ్ ఖాన్ కృషి చేస్తారు.

    తాను నివసించే ముంబై నగరంలో 5,500 మందికి పైగా కుటుంబాలకు రోజు వారీ ఆహార అవసరాలను అందిస్తారు. అవసరమైన ఇళ్లు, ఆస్పత్రులకు ఆహారం అందించటానికి ఒక కిచెన్‌ను ఏర్పాటు చేసి రోజుకు 2,000 భోజనాలు తయారు చేస్తారు.

  6. అమెరికా జాజ్ గిటార్ విద్వాంసుడు పిజారెలి మృతి

    అమెరికా జాజ్ గిటార్ కళాకారుడు జాన్ ‘బకీ’ పిజారెలి శుక్రవారం న్యూజెర్సీలోని సాడిల్ రివర్ ప్రాంతంలో గల తన నివాసంలో చనిపోయారు. ఆయన వయసు 94 సంవత్సరాలు.

    పిజారెలి మరణానికి కరోనావైరస్ కారణమని తాము భావిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రికతో చెప్పారు.

    ఎనిమిది దశాబ్దాల పాటు జాజ్ గిటార్ కళాకారుడిగా పిజారెలి శ్రోతలను అలరించారు. న్యూజెర్సీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా ఆయనను చేర్చారు.

    అమెరికాకు చెందిన మరో ఇద్దరు ప్రముఖ సంగీతకళాకారులు జాజ్ పియానిస్ట్ ఎలిస్ మార్సలిస్ జూనియర్ (85), ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ పాప్ బృందం సభ్యుడు ఆడమ్ షెల్సింగర్ (52) కూడా ఈ వారంలో కరోనావైరస్ సంబంధిత అనారోగ్యాలతో చనిపోయారు.

  7. ఆంధ్రప్రదేశ్‌లో మరో 12 కొత్త కేసులు.. మొత్తం కేసుల సంఖ్య 161, కాకినాడలో కరోనాను జయించిన యువకుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

    ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ కొత్తగా 12 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బులిటెన్‌లో తెలిపింది.

    దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 161కి పెరిగింది.

    జిల్లాల వారీగా కేసుల వివరాలు...

    అనంతపురం: 2

    చిత్తూరు: 9

    తూర్పు గోదావరి: 9

    గుంటూరు: 20

    కడప: 19

    కృష్ణా: 23

    కర్నూలు: 1

    నెల్లూరు: 32

    ప్రకాశం: 17

    శ్రీకాకుళం: 0

    విశాఖపట్నం: 14

    విజయనగరం: 0

    తూర్పుగోదావరి: 15

    మొత్తం: 161

    కాకినాడలో కరోనాని జయించిన యువకుడు

    లండన్ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు రెండు వారాల క్రిందట కరోనావైరస్ పొజిటివ్ నిర్ధారణ కావటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు.

    ఆయనకు తాజాగా కరోనావైరస్ నెగిటివ్ రావడంతో హాస్పత్రి నుండి డిచార్జ్ అయ్యారు.

    కరోనావైరస్ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ముందుగా వచ్చి చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని ఆ యువకుడు పేర్కొన్నారు.

    ‘‘నేను అలాగే వైద్యం చేయించుకున్నాను. హాస్పిటల్ లో నాకు మంచి ట్రీట్మెంట్ అందింది. వైరస్ సోకిన వారు సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రిలో చేరితే చిన్న చిన్న లక్షణాలతో బయటపడొచ్చు’’ అని చెప్పారు.

    సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని సూచించారు.

  8. సముద్రం మీద చిక్కుకుపోయిన 30,000 మంది కార్మికులు - ఆహార సరఫరాకూ ప్రమాదం

    కరోనావైరస్ ప్రపంచ ప్రజల మీద దారుణ ప్రభావం చూపుతోంది. నౌకా రవాణా పరిశ్రమలో సముద్రం మీద సంచరిస్తూ పనిచేసే వేలాది మంది కార్మికులు చాలా రోజులుగా సముద్రం మీదే చిక్కుబడి ఉన్నారని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ షిప్పింగ్ చెప్తోంది.

    వైరస్ వ్యాప్తి భయంతో ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవులను మూసివేయటంతో పాటు నౌకల్లో ఉన్న వారు బయటకు రాకుండా నిరోధిస్తున్నారు.

    ‘‘సముద్రం మీద దాదాపు 30,000 మంది నావికులు చిక్కుకుపోయి ఉన్నారు. వారు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. ఇది ఎప్పుడైనా పేలే టైం బాంబ్ వంటిది’’ అని చాంబర్ చైర్మన్ ఎస్బెన్ పాల్సన్ బీబీసీ సింగపూర్ ప్రతినిధి శరణ్‌జిత్ లేల్‌తో చెప్పారు.

    నౌకలను రేవులకు దూరంగా నిలిపివేయటంతో పాటు, రేవుల సరకులను దించటానికి అనుమతించకపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహారం తదితర కీలకమైన వనరుల సరఫరా కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

  9. 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు వెలిగించండి - ప్రధాని నరేంద్ర మోదీ

    ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశంలోని 130 కోట్ల మంది ప్రజలంతా ఇళ్లల్లో విద్యుత్ లైట్లు ఆపేయాలని, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లుపునిచ్చారు.

    కరోనావైరస్ మహమ్మారి ప్రబలుతున్న ఈ చీకటి కాలంలో.. 130 మంది కోట్ల భారతీయుల మహా సంకల్పాన్ని చాటాలని, ఆ చీకటి వైరస్‌కు వెలుగు శక్తిని పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు.

    చీకటి నుంచి వెలుగు దిశగా ప్రయాణానికి చిహ్నంగా.. ‘‘ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు.. ఇళ్లలో లైట్లన్నీ ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించండి’’ అని కోరారు.

    మోదీ శుక్రవారం ఉదయం ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

    వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ సమయంలో దేశ ప్రజలు పాటిస్తున్న క్రమశిక్షణ అసాధారణమైనదని మోదీ అభినందించారు. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

    లాక్‌డౌన్ ముగిసే వరకూ వీధుల్లో తిరగవద్దని మరోసారి విజ్ఙప్తి చేశారు.

  10. భారతదేశానికి 100 కోట్ల డాలర్ల అత్యవసర నిధులు: ప్రపంచ బ్యాంకు ఆమోదం

    కరోనావైరస్ విజృంభణను ఎదుర్కోవటం కోసం భారతదేశానికి 100 కోట్ల డాలర్లు (సుమారు 7,613 కోట్ల రూపాయలు) అత్యవసర నిధుల ప్యాకేజీ అందించటానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.

    వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించటానికి ప్రపంచ బ్యాంకు మొత్తం 25 దేశాలకు దాదాపు 200 కోట్ల డాలర్ల నిధులు అందించనుంది.

    ఈ అత్యవసర ఆర్థిక సాయంలో అత్యధిక భాగం భారతదేశానికి ఇస్తోంది. ‘‘వైరస్ స్క్రీనింగ్‌ను మెరుగుపరచటం, కాంటాక్ట్‌ల ఆచూకీ తెలుసుకోవటం, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాల కొనుగోళ్లు, కొత్త ఐసొలేషన్ వార్డుల ఏర్పాటుకు తోడ్పడటం కోసం’’ ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది.

    దక్షిణాసియాలో.. పాకిస్తాన్‌కు 20 కోట్ల డాలర్లు, అఫ్ఘానిస్తాన్‌కు 10 కోట్ల డాలర్లు, శ్రీలంకకు 12.86 కోట్ల డాలర్లు, మాల్దీవులకు 73 లక్షల డాలర్లు అందించటానికి వరల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది.

  11. గాంధీ ఆసుపత్రిలో మూకుమ్మడిగా నమాజ్ చేసిన కరోనా అనుమానితులు

    కరోనా సోకిందేమోనన్న అనుమానంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌లో ఉంచిన పలువురు ముస్లింలు అంతా కలసి గురువారం నమాజ్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.

    దిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్‌కు తెలంగాణ నుంచి 1200 మంది హాజరయ్యారని, వారిలో 700 మందిని వివిధ ఆసుపత్రుల్లో సెల్ఫ్ క్వారంటైన్‌ చేశారు.

    వీరిలో ఇప్పటికి 50 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయ్యింది.

    కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఇతరులకు ఐదడుగుల దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోంది.