You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: 10 లక్షలకు చేరువలో మొత్తం కేసులు, 50 వేలు దాటిన మృతులు; ఆంధ్ర ప్రదేశ్‌లో 149, తెలంగాణలో 154కు చేరిన కేసులు
ఆంధ్ర ప్రదేశ్‌లో ఈరోజు 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 149కు పెరిగింది. తెలంగాణలో మరో 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, మొత్తం కేసులు 154కు పెరిగాయి.
లైవ్ కవరేజీ
ఏపీలో మరో 6 పాజిటివ్ కేసులు.. మొత్తం 149
ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు 143 కేసులు ఉండగా ఆ తరువాత వచ్చిన ఫలితాలలో మరో 6 కేసులు నిర్ధరణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 149కి చేరింది.
అత్యధికంగా నెల్లూరులో 24 కేసులు, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.
కరోనాపై భారత్ పోరు భేష్: విరాట్ కోహ్లీ
కరోనాను అరికట్టడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కొద్ది మంది మినహా మిగతా అంతా ఫాలో అవుతున్నారన్నారు.
తెలంగాణలో మరో 27 మందికి కరోనా పాజిటివ్.. మొత్తం కేసులు 154
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 27 కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 154కి పెరిగింది.మరోవైపు గురువారం ముగ్గురికి నయం కావడంతో డిశ్చార్జి చేశారు.
దీంతో కోలుకుని డిశ్చార్జయినవారి సంఖ్య 17కి చేరింది. ఇప్పటివరకు 9 మంది మరణించారు. ప్రస్తుతం 128 యాక్టివ్ కేసులున్నాయి.
24 గంటల్లో 235 కేసులు.. భారత్‌లో 2069 కేసులు.. 53 మరణాలు
గత 24 గంటల్లో 235 కేసులు పెరగడంతో భారత్‌లో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2069కి పెరిగింది.
ఇందులో 155 మందికి నయం కాగా , 53 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ తెలిపింది.
తబ్లిగీ జమాత్‌కు హాజరైన 960 మంది విదేశీయుల వీసాలు రద్దు
నిజాముద్దీన్‌లోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్టులో పెట్టి, వారి టూరిస్టు వీసాలను రద్దు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
వారంతా ఫారినర్స్ యాక్ట్-1946, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్-2005ని ఉల్లంఘించారని, వారిపై చర్యలు తీసుకోవాలని దిల్లీ డీజీపీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంతకుముందు సూచించింది.
మర్కజ్ నుంచి వచ్చిన కరోనా రోగులు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు: దిల్లీ ప్రభుత్వం
మర్కజ్(తబ్లీగీ జమాత్ కార్యక్రమం నిర్వహించిన కేంద్రం) నుంచి తరలించిన కోవిడ్-19 రోగులు వారిని ఉంచిన హాస్పిటళ్లలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని..
వారిని అదుపు చేయడం వైద్యులు, సిబ్బందికి సాధ్యం కావడం లేదని వారిని ఉంచిన ఆసుపత్రుల్లో అదనపు బలగాలను మోహరించాలని దిల్లీ పోలీస్ కమిషనర్‌ను దిల్లీ ప్రభుత్వం కోరింది.
లాక్‌డౌన్‌పై సోనియా, అమిత్ షా మాటల యుద్ధం
దేశ ప్రజలు కరోనావైరస్‌తో భయాందోళనల్లో ఉన్న వేళ పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
కేవలం కొద్ది గంటల ముందు సమాచారమిచ్చి లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. లక్షల మంది వలస కార్మికులు విధిలేని పరిస్థితుల్లో కాలి నడకనే సొంతూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు.
సోనియా ఆరోపణలపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ‘‘130 కోట్ల మంది భారతీయులు కలసికట్టుగా కోవిడ్-19పై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తోంది. కరోనా కట్టడికి ప్రధాని మోదీ నాయకత్వాన భారత్ చేపడుతున్న చర్యలకు స్వదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన కీలక సమయంలో ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోండి’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.
ఏపీలో మరో 11 కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం 143
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 143కి చేరింది.
కృష్ణాజిల్లాలో 8 మందికి.. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి ఈ వైరస్ సోకింది.
తమిళనాడులో మరో 75 మందికి కరోనా పాజిటివ్.. అందులో 74 మంది తబ్లిఘీ కార్యక్రమానికి వెళ్లినవారే
తమిళనాడులో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 74 మంది దిల్లీలో తబ్లిఘీ జమాత్ ఈవెంటుకు వెళ్లినవారేనని ఆ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ బీలా రాజేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 309 కరోనా పాజిటివ్ కేసులు తేలగా అందులో 264 మంది తబ్లిఘీ జమాత్ కార్యక్రమానికి వెళ్లినవారేనని చెప్పారామె.
భారత్‌లో 50 మంది వైద్య సిబ్బందికి కరోనా
భారత్‌లో కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 50 మంది కోవిడ్-19 బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
స్పెయిన్‌లో 10 వేలు దాటిన మృతుల సంఖ్య
స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య 10,000 దాటింది. ఒకే రోజు 950 మంది మరణించడంతో ఒక్కసారిగా ఈ సంఖ్య పెరిగిపోయింది.
కరోనావైరస్ విషయంలో ఫత్వా జారీచేసిన మౌలానా
లఖ్‌నవూలోని దారుల్ ఉలూమ్ ఫిరంగి మహల్ ఈ రోజు ఒక ఫత్వా జారీ చేసింది. కరోనావైరస్ సోకినా దాన్ని దాచిపెడితే నేరమని.. అందరూ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ఫత్వా జారీ చేశారు. సొంత జీవితాన్ని ప్రమాదంలో పడేయడంతో పాటు ఇతరుల జీవితాలకూ ప్రమాదకరంగా మారడం ఇస్లాంకి విరుద్ధమని మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహలీ ప్రకటించారు.
టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటీన్‌ల పైనే పూర్తి దృష్టి: మోదీ
రాబోయే కొన్ని వారాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటీన్‌ల పైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
దేశంలో, వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలో కరోనావైరస్ కేసుల పెరుగుదల, నిజాముద్దీన్ మర్కజ్ ద్వారా వైరస్ వ్యాప్తి, సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
అత్యవసర వైద్య పరికరాలు, మందులు, మందుల తయారీకి అవసరమైన సామగ్రిని తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు.
సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్ణణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు.
ధారావిలో కరోనా సోకిన వ్యక్తి మృతి
ముంబయిలోని ధారావి మురికివాడలో కరోనావైరస్ సోకిన 56 ఏళ్ల వ్యక్తి మరణించారు.
బీబీసీ ఈ విషయాన్ని ధ్రువీకరించుకుంది. ధారావిలో ఇదే తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు.
ఆ వ్యక్తి మరణం గురించి కొన్ని ఛానెళ్లలో ఉదయం నుంచే వార్తలు వచ్చాయి.
వారం క్రితం నుంచే దగ్గు, జ్వరంతో ఆ వ్యక్తి బాధపడుతున్నట్లు సమాచారం. బుధవారమే ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
బాధితుడి కుటుంబానికి చెందిన ఏడుగురిని అధికారులు క్వారంటీన్‌లో ఉంచారు. ధారావిలో వాళ్లు నివాసముండే భవనాన్ని సీల్ చేశారు. ఆ భవనంలో మరో మూడు వందల కుటుంబాలు ఉంటున్నాయి.
కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న స్థానిక ముస్లింలు
నిజామాబాద్‌లో ఇంటింటి సర్వేకు వెళ్లిన వైద్య సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది.
ఖిల్లా రోడ్డులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో.. కిలో మీటర్ పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టాలని అధికారులు అదేశాలిచ్చారు.
ఖిల్లా రోడ్డు, బర్కత్‌పురాతో పాటు పలు కాలనీల్లో 103 బృందాల ద్వారా సర్వే చేపట్టగా.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ కోసం సర్వే నిర్వహిస్తున్నారన్న అపోహతో కొందరు స్థానిక ముస్లింలు ప్రక్రియకు అడ్డుపడ్డారు.
సర్వే కోసం వచ్చినవారితో వాగ్వాదానికి దిగి, వాళ్లను వెనక్కిపంపారు. దీంతో ప్రక్రియ ఆగిపోయింది.
దిల్లీలోని తబ్లీగీ జమాత్‌కు వెళ్లిన వారిలో ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో వ్యక్తి మృతి చెందారు.
ఈ నేపథ్యంలోనే అధికారులు హై అలెర్ట్ ప్రకటించి, ఈ సర్వేకు ఆదేశించారు.
ఈ ఘటనపై వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
‘నకిలీ వార్తలను అరికట్టండి’, రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టించి సమస్యలకు కారణమవుతున్న నకిలీ వార్తలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా హోంశాఖ ఈ లేఖ రాసినట్లు భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.
ప్రచారమవుతున్న విషయాల్లో ఏవీ వాస్తవాలో, ఏవి కాదో ప్రజలు నిర్ధారించుకునేందుకు వీలుగా ఓ వెబ్ పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.
రాష్ట్రాలు కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచన చేసినట్లు తెలిపింది.
బ్రిటన్‌లో ఒకే రోజు 563 మంది మృతి... దుర్దినమన్న ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్‌లో కరోనావైరస్ బాధితుల మరణాలు విపరీతంగా పెరిగాయి.
బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 563 మంది చనిపోయారు.
దేశానికి ఇదో దుర్దినమని ప్రధాని బోరిస్ జాన్సన్ వర్ణించారు.
బ్రిటన్‌లో మొత్తంగా ఇప్పటివరకూ 2,352 మంది కరోనావైరస్‌తో మరణించారు.