You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అయోధ్యపై తీర్పు మోదీ ప్రసంగం: ‘కలపడం, కలవడం, కలసికట్టుగా జీవించడం.. ఇదే నవంబర్ 9 సందేశం’

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పింది. ముస్లింలకు అయోధ్యలోనే మరో చోట 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. అసలు వివాదం ఏంటి?

    ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది.

    హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది. ప్రధానంగా ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. అలాగే.. ఇక్కడ మసీదును నిర్మించటానికి అంతకుముందు ఉండిన హిందూ దేవాలయాన్ని కూల్చివేయటం లేదా మార్చివేయటం జరిగిందా అనే అంశం కూడా ఈ కేసులో ఇమిడి ఉంది.

    బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6వ తేదీన ధ్వంసం చేశారు. ఆ ఉదంతం తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది.

    ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు.

    అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.

    ఇటువంటి సున్నితమైన అంశం మీద నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టమో కోర్టు తన ఉత్తర్వులో వివరించింది. ''ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టటానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా లెక్కలేనన్ని మందుపాతరలున్నాయి. దానిని మేం శుభ్రం చేయాల్సి ఉంది'' అని తీర్పు వ్యాఖ్యానించింది.

    అయితే, 2010 నాటి తీర్పుకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అప్పీలు చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు 2011లో సస్పెండ్ చేసింది.

  2. గెలుపోటముల మాటే వద్దు.. శాంతియుతంగా ఉండండి: మోదీ

    ''అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది ఒకరు ఓడినట్లు, ఒకరు గెలిచినట్లు కాదు.

    దేశంలో శాంతి, ఐకమత్యం, సద్భావన అనే మన గొప్ప బలం, సంప్రదాయానికి ప్రాధాన్యమివ్వాలని దేశ ప్రజలను కోరుతున్నాను'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

  3. 40 రోజుల సుదీర్ఘ వాదనలు, అక్టోబరు 16న తన తీర్పున రిజర్వులో ఉంచారు.

    రామజన్మభూమి-అయోధ్య స్థల వివాదం కేసులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తన తీర్పున రిజర్వులో ఉంచింది.

    సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం వాదనలు విన్న రెండో కేసు ఇది. కేశవానంద భారతి కేసులో ఏకంగా 68 రోజుల పాటు వాదనలు విన్నారు.

    దాని తరువాత రామజన్మభూమి-అయోధ్య స్థల వివాదం కేసులోనే సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.

    ఆధార్ రాజ్యాంగబద్ధతపై కేసులో 38 రోజులు వాదనలు కొనసాగడంతో సుప్రీంకోర్టు చరిత్రలో దానికి మూడో స్థానం దక్కింది.

  4. అయోధ్య తీర్పు: రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం తీర్పు కాసేపట్లో.., సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం వాదనలు విన్న రెండో కేసు

    అయోధ్యలోని రామమందిరం, బాబ్రీమసీదు స్థల వివాదం కేసుపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెలువరించనుంది.

    అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ తీర్పు సామాజిక, మత, సాంస్కృతికపరంగా పెను ప్రభావం చూపనుంది.

    ఈ కేసు సున్నితత్వం నేపథ్యంలో మీడియా ఎలా వ్యవహరించాలనే విషయంలోనూ ఇప్పటికే మార్గదర్శకాలు వెలువడ్డాయి.