You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా S-400 Missile System: ఈ విషయంలో టర్కీపై ఆంక్షలు విధించిన అమెరికా.. భారత్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.. ఎందుకు?
- రచయిత, నియాజ్ ఫరూఖి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్‌ను అనుమతించే ప్రత్యేక సవరణను అమెరికా ప్రతినిధుల సభ గతవారం ఆమోదించింది.
రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాల నుంచి ఎలాంటి ఆయుధాలూ కొనుగోలు చేయకుండా ''కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్స్ యాక్ట్ (కాట్సా)’’ను అమెరికా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చట్టానికే సవరణ తీసుకొచ్చారు.
ఈ సవరణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, దీన్ని చాలా కీలకమైన సవరణగా అంతర్జాతీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఎస్-400 ఒక ఉపరితలం నుంచి వాయు తలంలోకి ప్రయోగించగలిగే గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని రష్యా అభివృద్ధి చేసింది. 2018లోనే రష్యా నుంచి 5 బిలియన్ డాలర్లు(రూ.39,903 కోట్ల)తో వీటిని కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ గగనతల రక్షణ వ్యవస్థలు కొనుగోలుచేసే వారిపై కాట్సా కింద అమెరికా ఆంక్షలు విధించే అవకాశముంటుంది.
ఇదే చట్టం కింద నాటో దేశంతోపాటు మిత్రపక్షమైన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది.
భారత్‌కు ఎందుకు మినహాయింపు?
తాజా సవరణ ద్వారా భారత్‌తోపాటు ప్రపంచ దేశాలకు అమెరికా ఓ రాజకీయ సందేశాన్ని ఇవ్వాలని చూస్తోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
భారత్ రక్షణ అవసరాలను తాము అర్థం చేసుకోవడంతోపాటు చైనాను కట్టడి చేయడంలో భారత్ చాలా ముఖ్యమనే సంకేతాలను అమెరికా ఇచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ అంశంపై వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సింగ్ బీబీసీతో మాట్లాడారు.
''భారత్‌కు అమెరికా చాలా విలువనిస్తోంది. టర్కీకి కూడా ఇవ్వనన్ని మినహాయింపులు భారత్‌కు అమెరికా ఇచ్చింది''అని సుశాంత్ అన్నారు.
ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేసినందుకు టర్కీతోపాటు చైనాపైనా అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇటీవల కాలంలో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి. ఒకవేళ ఆంక్షలు విధించాల్సి వస్తే, రెండు దేశాల మధ్య సంబంధాలు గాడితప్పే ముప్పుంది.
ఎస్-400 అంటే ఏమిటి?
- ప్రపంచంలో అత్యంత మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్-400 ఒకటి.
- శత్రువుల క్షిపణి దాడులను ఇవి మెరుగ్గా అడ్డుకోగలవు.
- ఎస్-400ను రోడ్డుపై కూడా తరలించొచ్చు. ఇదొక మొబైల్ సిస్టమ్.
- ఆదేశాలు అందిన ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈ గగనతల రక్షణ వ్యవస్థను రంగంలోకి దించొచ్చు.
- విమానాలు, క్రూయీజ్, బాలిస్టిక్ క్షిపణులతోపాటు హైపర్‌సోనిక్ ఆయుధాలను ఇది అడ్డుకోగలదు.
భారత్‌కు ప్రాధాన్యం..
అమెరికాకు భారత్ ముఖ్యమైన ఆర్థిక, రక్షణ భాగస్వామిగా రక్షణ వ్యవహారాల నిపుణుడు రాహుల్ బేదీ చెప్పారు. ''భారత్ విషయంలో అమెరికా మేలైన మార్గాన్ని ఎంచుకుంది''అని ఆయన అన్నారు.
''భారత రక్షణ సామర్థ్యం ఎస్-400తో మెరుగుపడుతుంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దుల్లో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నప్పుడు ఈ గగనతల రక్షణ వ్యవస్థలు చాలా ఉపయోగపడతాయి. మరోవైపు చైనా ప్రాబల్యాన్ని అమెరికా ముప్పుగా భావిస్తోంది. భారత్‌కు మినహాయింపులు ఇవ్వడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి''అని ఆయన వివరించారు.
చైనాకు అడ్డుకట్ట వేయాలని అమెరికా భావిస్తోంది. ఈ విషయంలో భారత్ చాలా ఉపయోగపడుతుందని నిపుణులు కూడా అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ భారత్‌ను కోల్పోకూడదని అమెరికా భావిస్తున్నట్లు సుశాంత్ సింగ్ వివరించారు.
''ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యుక్రెయిన్‌పై దాడి విషయంలో పశ్చిమ దేశాలు రష్యాను తప్పుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుకు భారత్‌కు అమెరికా మినహాయింపులు ఇచ్చింది''అని రాహుల్ అన్నారు.
''రష్యా అనేది అమెరికాకు ఒక మోస్తరు శత్రువు లాంటి దేశం. కానీ, చైనా మాత్రం బద్ధశత్రువు. చైనాకు అడ్డుకట్టవేడయంలో భారత్ భౌగోళికంగా ఉపయోగపడుతుంది''అని ఆయన వివరించారు.
ప్రస్తుత క్యాట్సా సవరణపై ఇంకా అమెరికా అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంది. ఒకవేళ దీని కింద ఆంక్షలు విధించుంటే అమెరికా, భారత్ రెండు దేశాలకూ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా మారేవి.
ప్రస్తుత మినహాయింపులకు అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల నుంచీ మద్దతు లభించింది. అంటే భారత రక్షణ అవసరాలకు వారు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అమెరికా రాజకీయ వ్యూహంగా చూడాలని సుశాంత్ సింగ్ చెప్పారు.
అమెరికా విశ్వాసం
యుక్రెయిన్‌లో యుద్ధం నడుమ అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొటున్న నేపథ్యంలో భారత్‌కు క్యాట్సా నుంచి అమెరికా మినహాయింపులు ఇస్తోంది.
ఈ సంక్షోభంలో భారత్ పూర్తిగా పశ్చిమ దేశాల పక్షం వహించలేదు. ఇలాంటి సమయంలో అమెరికా తీసుకున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు అజయ్ శుక్లా చెప్పారు.
''అమెరికా-భారత్ సంబంధాలకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు''అని ఆయన అన్నారు.
అయితే, ఈ రోజోరేపో అమెరికా మినహాయింపులు ఇవ్వకతప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని మరికొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రష్యా-భారత్ సంబంధాలు కూడా అంతే దృఢమైనవని వారు విశ్లేషిస్తున్నారు.
ఇక్కడ దాదాపు 60 నుంచి 70 శాతం రక్షణ సామగ్రిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారత సాయుధ బలగాలు భారీగా రష్యాపై ఆధారపడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను రష్యా నుంచి దూరం చేయడం అంత తేలికకాదని నిపుణులు అంటున్నారు.
టర్కీపై ఎందుకు?
ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్‌కు మినహాయింపు ఇస్తున్న అమెరికా.. ఇదే విషయంపై టర్కీ మీద ఆంక్షలు విధించింది.
అమెరికా నుంచి ఎఫ్-35 ఫైటర్ జెట్లు కొనుగోలు చేస్తున్నప్పుడే.. రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలపైనా టర్కీ చర్చలు మొదలుపెట్టింది. అందుకే టర్కీకి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని శుక్లా అన్నారు. ''ఎందుకంటే ఎఫ్-35 యుద్ధ విమానాల టెక్నాలజీని ఎస్-400 సాయంతో డీకోడ్ చేయొచ్చు''అని ఆయన అన్నారు.
భారత్ విషయంలో అలాంటి ఆందోళనలేమీ లేవని నిపుణులు అంటున్నారు.
''ఎస్-400ను భారత్ ఎందుకు కొనుగోలు చేస్తుందో అమెరికాకు పూర్తి అవగాహన ఉంది. అదే సమయంలో అమెరికా పరిజ్ఞానం రష్యా చేతుల్లోకి వెళ్లకుండా ఏం చేయాలో వారికి తెలుసు''అని శుక్లా వ్యాఖ్యానించారు.
భారత్‌కు ఎంతవరకు ఉపయోగం?
ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రక్షణ వ్యవస్థల్లో ఒకటని చెప్పొచ్చు. మరి వీటి సాయంతో భారత్ సరిహద్దుల్లో పరిస్థితి మెరుగుపడుతుందా?
ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
''చైనా విషయంలో ఇవి అంత మెరుగ్గా ఉపయోగపడకపోవచ్చు''అని సుశాంత్ సింగ్ అన్నారు. ''కానీ, పాకిస్తాన్ విషయంలో చాలా మెరుగ్గా పనిచేస్తాయి''అని ఆయన చెప్పారు.
కానీ, అమెరికా, భారత్‌లు ఎక్కువగా ఆందోళన చెందేది చైనా కోసమేనని ఆయనతోపాటు రాహుల్ కూడా అంగీకరించారు.
''కొత్త గగనతల రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు పెద్దగా మారకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కశ్మీర్‌పైనే వివాదముంది. అది కూడా ఏళ్లనాటి వివాదం. కానీ, చైనా సరిహద్దుల్లో పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యే ముప్పుంది''అని రాహుల్ చెప్పారు.
ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను రష్యా నుంచి చైనా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇలాంటి ఐదు వ్యవస్థలను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఒకటి మాత్రమే ఇప్పటివరకు భారత్‌కు చేరింది. దీన్ని పశ్చిమ సరిహద్దుల్లో మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం వల్ల మిగతా వ్యవస్థల రాక ఆలస్యం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
''గత జూన్‌లోనే మనకు ఈ రక్షణ వ్యవస్థలు అందాలి. కానీ, ఇప్పటివరకు వాటిపై సమాచారం లేదు''అని బేదీ అన్నారు.
నిజానికి ఈ గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతవరకు ఉపయోగపడతాయో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. అయితే, వీటి కొనుగోలులో అవరోధాలను భారత్ విజయవంతంగా దాటగలిగింది.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌కు ప్రధాన మంత్రి అవుతారా?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)