You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిల్బరా: ఈ రంగురంగుల అందమైన లోకం భూప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదా?
- రచయిత, డాన్ అవిలా
- హోదా, బీబీసీ ట్రావెల్
- ప్రచురణ
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బరా ప్రాంతం దాదాపు 360 కోట్ల సంవత్సరాల పురాతన జీవులు తిరుగాడిన ప్రాంతంగా గుర్తించారు. ఆస్ట్రేలియాలోని అతి పురాతన ఆదిమ జాతియులకు పిల్బరా పరిచయమేనని ఇటీవలి సైన్స్ పరిశోధనలు ధ్రువీకరించాయి.
పిల్బరా 360 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడటం ప్రారంభించింది. పశ్చిమ తీరం నుండి ఉత్తర భూభాగపు సరిహద్దు వరకు విస్తరించి ఉన్న ఈ ముదురు ఎరుపు రంగు నేలల ప్రాంతం అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు.
చాలామందికి దీని గురించి తెలియదు. మొదటిసారి ఈ ప్రదేశానికి వెళ్లిన వారికి అంతరిక్షంలో ఒంటరిగా ఉన్నామన్న భావన కలుగుతుంది. గ్రేట్ బ్రిటన్ సైజులో ఉన్నా, ఇక్కడి జనాభా మాత్రం కేవలం 61,000. ఇది భూమి మీద అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలలో ఒకటి.
పిల్బరా లో విస్తారంగా కనిపించే రాళ్లు ఇనుప ధాతువుతో ఉంటాయి. ఇవి ఆక్సిజన్, జీవం పుట్టుకకు ముందే ఏర్పడినవని చెబుతారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన భూనిక్షేపాలకు ఇవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా ఇలాంటి భూ నిక్షేపాలు దాదాపు ఇదే సమయంలో ఏర్పడినా, ఇవి మాత్రం అనేక వాతావరణ చర్యల తర్వాత కూడా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి.
''దీని ప్రత్యేకత కేవలం వయసు ఒక్కటే కాదు. దాని పరిరక్షణ గుణం కూడా ఎంతో ప్రత్యేకం" అని సంవత్సరాల తరబడి పిల్బరా పై పరిశోధన చేస్తున్న మార్టిన్ వాన్ క్రానెండాంక్ అన్నారు. ఆయన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో జియాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
భూమి మీద అతి పురాతన జీవం
పిల్బారా శిలలు చాలా పురాతనమైనవి. వాటి లోపల మాత్రం ఎలాంటి జంతు అవశేషాలు లేవు. ఇప్పటి వరకు అతి పురాతనమైన జంతువుల అవశేషాలుగా చెప్పే స్ట్రోమాటోలైట్‌లు ఆ రాళ్ల పైభాగంలోనే కనుగొన్నారు.
1980లో, పిల్బరాలోని మార్బుల్ బార్ ప్రాంతంలో 345 కోట్ల సంవత్సరాల పురాతనమైన స్ట్రోమాటోలైట్‌లను గుర్తించారు. ఈ సైనోబాక్టీరియా కమ్యూనిటీ సూక్ష్మజీవులు భూమిపై జీవానికి అనుకూల పరిస్థితులు లేని సమయంలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో ఉబ్బెత్తుగా ఉండే రీఫ్ లాంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి.
పిల్బరాకు దక్షిణంగా షార్క్ బే సమీపంలోని హామ్లిన్ పూల్ వద్ద, ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన స్ట్రోమటోలైట్ల వ్యవస్థ ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది. ఇది హైపర్‌సలైన్ బే లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. భూమిపై జీవించి ఉన్న సముద్రపు స్ట్రోమాటోలైట్‌లు ఉన్న రెండు ప్రాంతాలలో ఇది ఒకటి.
రెడ్ ప్లానెట్ అన్వేషణ
2019లో నాసా శాస్త్రవేత్తలు వాన్ క్రానెండాంక్ తో కలిసి పిల్బరాలో పరిశోధనలు నిర్వహించారు. అంగారక గ్రహానికి వెళ్లడానికి అవసరమైన అవగాహన కోసం వారు ఇక్కడికి వచ్చారు. "వారిలో చాలా మంది పురాతన జీవానికి సంబంధించిన సాక్ష్యాలను వ్యక్తిగతంగా చూడలేదు. వారు అంగారక గ్రహానికి వెళ్తున్నది కూడా అందుకోసమే" అని వాన్ క్రానెన్‌డోంక్ చెప్పారు.
"ఇక్కడి అనుభవం వారికి బాగా ఉపయోగపడుతుంది. స్ట్రోమాటోలైట్‌ల వివరాలు, ఆకృతిని చూడటం, అర్థం చేసుకోవడం వల్ల మార్స్ మీద వారి పరిశోధనలకు ప్రయోజనకరంగా ఉంది. వారు దీని నుంచి అవగాహన పొందుతారు" అన్నారాయన.
"ఆ శిలల కూర్పు, పిల్బరాలోని ఇనుప ధాతువు అద్భుతంగా ఉంటుంది. అచ్చం అంగారక గ్రహాన్ని పోలి ఉంటుంది" అని వాన్ క్రానెండాంక్ చెప్పారు.
భూలోక సంభ్రమం
పిల్బరా అద్భుతంగా, మరుపురాని లోకంలా ఉంటుంది. కానీ, ఇక్కడి వెళ్లడానికి ముందు సరిగా సిద్దం కాకపోతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఈ ప్రాంతం చూడటానికి ఎడారిలా కనిపిస్తున్నప్పటికీ, లోపల అది ప్రపంచంలోని అత్యంత అందమైన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి.
బిలియన్ల సంవత్సరాల పాటు భూమి కోత కారణంగా ఏర్పడిన కరిజిని నేషనల్ పార్క్ అందమైన మరో ప్రపంచంలా ఉంటుంది. జలపాతాలు, స్ఫటిక లాంటి స్వచ్ఛమైన నీటి ధారలు అక్కడ రాళ్ల మధ్య నుంచి పారుతుంటాయి.
సందర్శకుల దృష్టిలో ఇది ఇది భూగర్భ నీటి చెలిమెలు, దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఉన్న వన్యప్రాణులు, చల్లని కొలనుల స్వర్గధామం. శాస్త్రవేత్తలకు మాత్రం కరిజిని నేషనల్ పార్క్ అంతులేని పరిశోధనలకు సమాధానం చెప్పే నెలవు. "ఇది ఒక అందమైన లోకం. ఈ కనుమలు మిమ్మల్ని కాలపు పొరలను తెరిచి చూడమని పిలుస్తుంటాయి" అని వాన్ క్రానెండాంక్ చెప్పారు.
ఇక్కడ ప్రవహించే జలపాతాలు, నీటి గుంటలు, ఒయాసిస్‌లు బయటికి కనిపించే పిల్బరా కు భిన్నంగా ఉండి విస్మయాన్ని కలిగిస్తాయి. పురాతన కాలంలో నిర్మించుకున్న రహస్య ఈత కొలనులాంటి స్పాపూల్ కు హేమర్ల్సీ జలపాతం నుంచి నిత్యం నీరు వస్తూ ఉంటుంది. బాత్ టబ్ లా కనిపించే ఈ పూల్ రకరకాల రంగులతో, మృదువైన నున్నని రాతి ఉపరితలంతో ఉంటుంది.
ఆస్ట్రేలియాలో రహస్య ప్రపంచం
జాతీయ ఉద్యానవనంలో ఉన్న ఏకైక వసతి స్థానిక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కరిజిని ఎకో రిట్రీట్. అక్కడ చల్లని వేకువ జామున వీచే గాలి అంతులేని శక్తిని ఇస్తుంది. రాత్రిపూట ఆకాశం నిర్మలంగా, స్పష్టంగా కనిపిస్తుంది. వెన్నెల లేనప్పుడు అక్కడ చుక్కలను లెక్కపెట్టవచ్చు. పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడంతో పాలపుంత సుందరంగా కనిపిస్తుంది.
"కరిజిని ఒక ప్రత్యేకమైన, ఐకానిక్ ఆస్ట్రేలియన్ టూరిస్ట్ ప్లేస్" అని దాని సహ-యజమాని మార్నీషీల్డ్స్ అన్నారు. "అద్భుతమైన ఈ ప్రాంతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారికి తెలిసినప్పటికీ, ఇది ఇప్పటికీ ఆస్ట్రేలియా అద్భుతమైన రహస్య ప్రాంతాలలో ఒకటి" అన్నారాయన.
వైరుధ్యాల పుట్ట
''పిల్బరా నుంచి ఇక్కడికి వచ్చిన వారికి ఈ వాతావరణం, జంతుజాలం, పచ్చదనం చూస్తే ఎడారి నుంచి అందమైన ప్రకృతిలోకి జారిన అనుభవం కలుగుతుంది'' అని కరిజిని గైడ్ పీట్ వెస్ట్ అన్నారు.
"పిల్బరాలో అతిపెద్ద చెట్లు మెలలూకాస్ వంటి వృక్షజాలం చాలా భిన్నంగా ఉంటుంది. ఇవి వాగుల అంచున ఉంటాయి. ఉపరితలం నుంచి కనిపించవు. వాగులలో పడవలలో వెళ్తున్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఇవి కాక ఫెర్న్ మొక్కలు, నాచు లాంటివి కూడా ఉంటాయి. మొత్తం మీద ఈ వాగులు చాలా భిన్నంగా ఉంటాయి'' అని పీట్ వెస్ట్ వివరించారు.
వాగులో నిరంతరం నీరు ప్రవహించడం వల్ల ఇక్కడ సూక్ష్మ జీవులతోపాటు, చేపలు, గబ్బిలాలు దాని నుంచి లబ్ధి పొందుతుంటాయి. ఈ పరిస్థితులు అనేక మాంసాహార జీవులకు సౌకర్యంగా ఉంటాయి. ఎడారి డ్రాగన్‌లు, కొండ చిలువలు , 5 మీటర్ల పొడవైన పాములు చూసే వారిని ఆశ్చర్య పరుస్తాయి.
మహిళలకు ప్రత్యేకం
స్థానికులకు కరిజిని ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రం. ఈ పార్క్‌లోని కొన్ని ప్రదేశాలను మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. మరికొన్ని పురుషులకు ప్రత్యేకంగా ఉంటాయి.
"ఉదాహరణకు, స్త్రీలు సంతానం కావాలని కోరుకోవడానికి ఓ ప్రాంతానికి, కవలల కోసం మరో ప్రాంతానికి వెళతారు" అని పిల్బరాలో స్థానికులతో జీవనాన్ని అధ్యయనం చేస్తున్న ఆంత్రొపాలజిస్ట్ డాక్టర్ అమండా హారిస్ వెల్లడించారు.
విశ్రాంతి క్షేత్రం
30,000 నుంచి 40,000 సంవత్సరాల నుండి బంజిమా ప్రజలు, వారి పూర్వీకులు కరిజిమా ( స్థానిక ఆదిమ భాషలో "కొండ ప్రాంతం" అని అర్ధం) ను సమావేశాలకు, విశ్రాంతికి ఉపయోగించే వారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
" ఇక్కడి తెగ ప్రజలు కలిసి కూర్చునే, వ్యాపారాలు నిర్వహించుకునే, పెళ్లిళ్లు, సంబరాలు చేసుకునే ప్రాంతంగా కరిజిని ఈనాటికీ కొనసాగుతోంది" అని వెస్ట్ అన్నారు.
మౌంట్ బ్రూస్ పశ్చిమ ఆస్ట్రేలియాలో రెండో అతి ఎత్తయిన శిఖరం. ఇది కరిజిని ప్రాంతపు ప్రారంభంలో ఉంటుంది. ఈ పర్వతం ఆదిమ వాసులకు ఒక పవిత్ర ప్రదేశం. బంజిమా తెగలో ఇది కేవలం పురుషులు మాత్రమే వెళ్లదగిన ప్రాంతం. ఈ తెగకు చెందిన కొందరు మహిళలు అటువైపు చూడటానికి కూడా నిరాకరించారు. అయితే, సందర్శకులు దీనిని ఫొటోలు తీయడానికి, ఎక్కడానికి ఎలాంటి నిషేధాలు లేవు.
పూర్వీకుల జ్ఞానం
పిల్బరా భూమి ఆవిర్భావ కాలంనాటి అనేక రహస్యాలను, మొట్టమొదటి జీవుల విశేషాలను అందిస్తోంది. అయితే, ఇక్కడ జీవం ఎప్పటి నుంచి ఉందన్న విషయం శాస్త్రవేత్తలను ఆశ్చర్య పరుస్తుండగా, స్థానిక తెగల వారు మాత్రం తమకు ఆ విషయాలు ఎప్పుడో తెలుసని చెబుతారు.
''ఇక్కడ జీవం ఉంది కాబట్టి, అది ఎప్పుడు మొదలైందో కూడా మాకు తెలుసు'' అని స్థానిక యిండ్‌జిబరండీ అండ్ ఎన్‌గర్లుమా తెగ నాయకుడు క్లింటన్ వాకర్ అన్నారు. ఆయన స్థానిక గైడ్‌గా కూడా పని చేస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, వాకర్ పిల్బరా లోని బుర్రప్ ద్వీపకల్పంలో నీరు తక్కువగా ఉండే లోటైడ్ సమయంలో పర్యటించారు. అక్కడి కొన్ని రాళ్లపై కంగారూ పాద ముద్రలను పోలిన బొమ్మలను గమనించారు. ఆస్ట్రేలియా మొత్తంలో నీటి అడుగున ఇలాంటి బొమ్మలను గుర్తించడం ఇదే మొదటిసారని వాకర్ వెల్లడించారు. 7,000-18,000 సంవత్సరాల క్రితం ఇక్కడి నీటి మట్టాలు 100 మీటర్ల కంటే తక్కువగా ఉండేవని, ఈ బొమ్మలు మంచు యుగం తర్వాత చెక్కినవి కావచ్చని ఆయన అన్నారు.
"ఇది చాలా చిత్రంగా ఉంది. నేను పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఇలాంటి కొత్త కొత్త చిత్రాలు కనిపిస్తూనే ఉంటాయి'' అని గైడ్ పీట్ వెస్ట్ అన్నారు.
పిల్బరా మాయాజాలమంతా దాని పురాతన మూలాలలో ఉంది. ఇక్కడ ఎలాంటి గ్రూపులు, అడ్డుగోడలు, బిల్డింగులు ఉండవు. ఆధునికతకు సంబంధించిన ఆంక్షలు ఏమీ ఉండవు. నాలోని కొత్త విషయాలను కనుక్కోవాల్సిందిగా పిల్బరా ఆహ్వానిస్తూనే ఉంటుంది.
"ఈ స్థలం అన్వేషకులు, ఫొటోగ్రాఫర్‌లు, కళాకారులు, చిత్రకారులు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు,ప్రకృతి ప్రేమికులు...ఇలా అందరికీ ఎంతో ప్రత్యేకం'' అని వెస్ట్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
- ఇకపై సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తెలుగు విద్యార్థులకు లాభమా నష్టమా?
- ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టొచ్చా.. ఎవరి అనుమతి తీసుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ప్రపంచంలో దారుణమైన కేసుల్లో ఒకటి.. 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కాడు?
- 10th క్లాస్, బీటెక్ ఫెయిల్ అయ్యారా? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదా? ఈ ట్రైనింగ్‌తో జాబ్ గ్యారెంటీ..
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లక్ష్య సేన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడిన భారత షట్లర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)