నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీకవడంతో మంటలు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో ఒక ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయారని పోలీసులు చెప్పారు.

ప్రమాదానికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. దాని ప్రకారం..

చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో సయ్యద్ నౌషాద్(38) తెల్లవారు జామున లేచి వంట చేస్తుండగా గ్యాస్ పైప్ కట్ అయి ఉండడంతో ఆమెకు మంటలు అంటుకున్నాయి.

భార్యను కాపాడే ప్రయత్నంలో సయ్యద్ అబ్బాస్(42) కూడా మంటల్లో చిక్కుకున్నారు. దీంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే చనిపోయారు.

అదే సమయంలో ఇంట్లో ఉన్న వారి 13 ఏళ్ల కూతురు సయ్యద్ ఆయేషా కూడా మంటల్లో తీవ్రంగా గాయపడింది.

తెల్లవారుజామున కుక్కలు అరవడంతో లేచిన పక్కింటి వారు సయ్యద్ అబ్బాస్ ఇంటి తలుపులు తెరిచి చూసే సరికే దంపతులు చనిపోయి కనిపించారు.

వారు లోపల చావు బతుకుల్లో ఉన్న సయ్యద్ మూడో కుమార్తెను 108లో నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సయ్యద్ అబ్బాస్ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుండేవారు.

టిఫిన్ సెంటర్ కోసం ఉదయమే లేచిన భార్య సాంబారు కోసం గ్యాస్ వెలిగించగా ఈ ప్రమాదం జరిగింది.

వారు ఉంటున్నది చిన్న గది కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి, దంపతులు అక్కడికక్కడే చనిపోవడంతోపాటూ వారి కుమార్తెకూ మంటలు అంటుకున్నాయని పోలీసులు చెప్పారు.

పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో ఇండియన్ ఆర్మీ క్యాంప్ దగ్గర పేలుడు, నగరంలో అలర్ట్

పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఇండియన్ ఆర్మీ క్యాంప్ దగ్గర గ్రెనేడ్ పేలుడు జరిగింది.

ఆర్మీ క్యాంప్ త్రివేణీ గేట్ దగ్గర ఈ పేలుడు సంభవించింది.

ఈ ఘటన తర్వాత పఠాన్‌కోట్‌ మొత్తం అలర్ట్ జారీ చేశారు.

పేలుడు అర్థరాత్రి జరిగిందని, దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదని పఠాన్‌కోట్ పోలీసులు బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ గ్రెనేడ్ దాడికి పాల్పడింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మనుషుల పైనుంచి దూసుకెళ్లిన కారు, 20 మందికి గాయాలు

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఒక కారు వేగంగా జనం పైనుంచి దూసుకెళ్లడంతో 20 మందికిపైగా గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదంలో కొందరు మరణించినట్లుగా చెబుతున్నప్పటికీ ఎంతమంది చనిపోయారన్నది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

గాయపడినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఒక ఎర్ర రంగు స్పోర్ట్స్ కారు కనిపిస్తోంది. అది విస్కాన్సిన్‌లోని వౌకేష్ నగరంలో జరుగుతున్న ఒక క్రిస్మస్ పెరేడ్‌లోంచి వేగంగా దూసుకెళ్లింది.

కారు ఢీకొనడంతో జనం భయంతో కేకలు వేయడం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది.

అనుమానిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ చీఫ్ డేన్ థాంప్సన్ చెప్పారు.

ఈ దారుణానికి కారణమైన వ్యక్తిని కూడా గుర్తించామని, కానీ ఆయన ఎక్కువ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రుల్లో చేర్చినట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న రెండు వీడియోల్లో ఒక వీడియోలో ఈ ఎస్‌యూవీ బ్యారికేడ్లు కొట్టుకుని వెళ్తుండగా, మరో దానిలో సంగీత బృందంలా కనిపిస్తున్న ఒక గుంపులోంచి అది వెళ్తున్నట్లు ఉంది.

"ఈరోజు రాత్రి వౌకేషా నగరానికి ఒక విషాదకరమైన రాత్రి అని" నగర మేయర్ షాన్ రాలీ మీడియాతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)