Danish Siddiqui: అఫ్గానిస్తాన్‌లో భారత జర్నలిస్ట్ మృతి

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

భారత్‌కు చెందిన సీనియర్ ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ మృతిచెందినట్లు అఫ్గానిస్తాన్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయన ఎలా మరణించారనే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.అయితే, భారత్‌లో అఫ్గానిస్తాన్ రాయబారి ఫరీద్ మాముంద్‌జయీ ఈ వార్తను ధ్రువీకరించారు.

"కాందహార్‌లో నిన్న రాత్రి నా స్నేహితుడు దానిష్ సిద్దిఖీ చనిపోయాడనే విషాద వార్తతో నేను షాక్ అయ్యాను. పులిట్జర్ అవార్డ్ గ్రహీత, భారత జర్నలిస్ట్ అఫ్గాన్ భద్రతా దళాలతోపాటూ ఉన్నారు. నేను ఆయన్ను రెండు వారాల క్రితం కలిశాను. ఆయనప్పుడు కాబూల్ వెళ్తున్నారు. ఆయన కుటుంబం, రాయిటర్స్‌కు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.

అఫ్గానిస్తాన్ టీవీ చానల్ టోలో న్యూస్ వివరాల ప్రకారం కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో ఘర్షణను కవర్ చేస్తున్న సమయంలో దానిష్ మృతిచెందారు.

తాలిబన్లు బుధవారం స్పిన్ బోల్డక్ నగరం, అక్కడ పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక కీలక పోస్టును తమ అధీనంలోకి తీసుకున్నారు.

దానిష్ సిద్దిఖీ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతలను కవర్ చేస్తున్నారు.

ఆయన గతంలో తన ట్విటర్ అకౌంట్‌లో ద్వారా అక్కడి పరిస్థితులను వివరించేవారు. అక్కడ దాడుల నుంచి తను తృటిలో ఎలా తప్పించుకున్నారో చెప్పేవారు.

2017లో పులిట్జర్ పురస్కారం

దానిష్ సిద్దిఖీ ముంబయిలో ఉండేవారు. ఆయన భారత్‌లో రాయిటర్స్ పిక్చర్స్ మల్టీమీడియా టీమ్ చీఫ్‌.దిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం బాచిలర్ డిగ్రీ పొందిన దానిష్ 2007లో జామియాలో ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి డిగ్రీ చేశారు.

ఆయన ఒక టీవీ న్యూస్ రిపోర్టర్‌గా తన జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఆయన ఫొటో జర్నలిస్టుగా మారారు.

2010 నుంచి ఆయన రాయిటర్స్‌లో పనిచేస్తున్నారు.

ధ్రువీకరించిన రాయిటర్స్

దానిష్ మృతిని రాయిటర్స్ ధ్రువీకరించింది. తమ ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్‌లో చనిపోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రీడెన్‌బరో, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెస్సాండ్రా గలోనీ ఒక ప్రకటనలో తెలిపారు.

కాందహార్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం అఫ్గాన్ ప్రత్యేక బలగాలపై దాడి జరిగినప్పుడు దానిష్ అక్కడే ఉన్నారని వారు చెప్పారు.

అఫ్గాన్ అధికారుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

దానిష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)