You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: దిల్లీ ప్రభుత్వం అలర్ట్- విమానాశ్రయాలలో కోవిడ్ టెస్టులకు ఆదేశాలు - Newsreel
విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్‌లలో ర్యాండమ్‌గా కోవిడ్-19 టెస్టులు నిర్వహించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతుండగా, ఇది సెకండ్ వేవ్ అని కొందరు నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఒక్క బుధవారం రోజే దేశవ్యాప్తంగా 47,000 కేసులు నమోదు కాగా, 275మంది మరణించారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఇవే అత్యధిక కేసులు, మరణాలు. కొన్ని రోజుల కిందటి వరకు రోజుకు 10 వేలకు లోపు కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కాగా, మార్చి ఆరంభం నుంచి మళ్లీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత ఆదివారం 40వేల కేసులతో ఈ ఏడాదిలో తొలిసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి.
టెస్టులు తగ్గడం, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం, కొత్త వైరస్ వేరియంట్లు లాంటివి ఈ పెరుగుదలకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలోని వివిధ రాష్ట్రాలలో కోవిడ్ నిబంధనలను మళ్లీ కఠినతరం చేస్తున్నారు. ప్రజలు గుంపులుగా చేరడం, హోలీలాంటి పండగలపై ఆంక్షలు విధించారు.
దిల్లీలో సినిమా హాళ్లు, మెట్రో స్టేషన్లు, ప్రార్ధన స్థలాలు ఈ వైరస్ మళ్లీ పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించేలా నిబంధనలు కఠినతరం చేయాలని, ప్రజల కదలిక మీద నిఘాను ముమ్మరం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 30 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకల మీద కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. కొన్ని రూట్లలో మాత్రమే విమానాలు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం కేవలం మహారాష్ట్రలోనే ఉన్నట్లు తేలింది. ఆ రాష్ట్రంలోని కొన్నిజిల్లాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ విధిస్తున్నారు. ముంబయిలోని షాపింగ్ సెంటర్లు, రైల్వేస్టేషన్లలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
కేసులు పెరుగుతుండటంతో మంగళవారం కేంద్ర ప్రభుత్వం కొత్త టెస్టింగ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రొటోకాల్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలంటూ కేంద్రానికి సీజేఐ లేఖ
సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణను సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచిస్తూ ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్ఏ బోబ్డే కేంద్రానికి లేఖ రాశారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే ఏప్రిల్ నెల 23న రిటైర్ కాబోతున్నారు. బోబ్డే తాజా లేఖతో తెలుగువాడైన జస్టిస్ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ ఎన్‌వీ రమణ
జస్టిస్ ఎన్‌వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు.
సుప్రీం కోర్టులో 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది.
1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.
2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టు సీనియారిటీ జాబితాలో ఆయనది ఛీఫ్ జస్టిస్ తరువాతి స్థానం.
మియన్మార్ నిరసనలు: మిలటరీ కాల్పుల్లో ఏడేళ్ల బాలిక మృతి
మియన్మార్‌లో ఏడేళ్ల బాలిక భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించింది. గత నెలలో సైనికు కుట్ర తరువాత వెల్లువెత్తిన నిరసనల్లో చనిపోయిన అత్యంత చిన్న వయస్కురాలు ఆమేనని స్థానికులుచెబుతున్నారు.
మాండలే నగరంలోని ఆ బాలిక ఇంటివద్దే భద్రతా బలగాలు ఆమెను చంపాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఈ దేశం ప్రజా నిరసనలతో అట్టుడికిపోతోంది. నిరసన ప్రదర్శనల్లో మృతి చెందిన వారిలో 20కి పైగా పిల్లలు ఉన్నారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు మత్తంగా 164 మంది చనిపోయారని మిలటరీ చెబుతోంది. అయితే, మృతుల సంఖ్య 261 కన్నా ఎక్కువేనని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) సంస్థ అంటోంది.
నిరసనకారుల మృతి పట్ల మిలటరీ మంగళవారం నాడు విచారం వ్యక్తం చేసింది. అయితే, దేశంలో వారు అరాచకం సృష్టిస్తుండడం వల్లే ఈ మరణాలు సంభవించాయని వారు ఆరోపిస్తున్నారు. తిరుగుబాటు-వ్యతిరేక ప్రదర్శనకారులే ఈ అల్లర్లకు, హింసకు బాధ్యత వహించాలని సైనిక అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఏడేళ్ల బాలిక చాన్ మియా తాజీ టౌన్‌షిప్‌లో బులెట్ గాయాలతో చనిపోయిందని మాండలే అంతిమ సంస్కారాల సేవల సిబ్బంది రాయిటర్స్‌తో అన్నారు. సైనికులు ఆమె తండ్రి మీద కాల్పులు జరిపారని, అయితే అప్పుడు ఆయన ఒడిలో కూర్చున్న ఆ బాలిక బులెట్లు తగిలి చనిపోయందని 'మియాన్మర్ నవ్' అనే స్థానిక పత్రిక రిపోర్ట్ చేసింది.
చనిపోయిన బాలిక పేరు ఖిన్ మియో చిట్. 19 ఏళ్ల వయసున్న ఆ బాలిక అన్నను సైనికులు అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై మిలటరీ అధికారులు స్పందించలేదు. మాండలేలో 14 ఏళ్ల బాలుడు కాల్పుల్లో చనిపోయినట్లు తెలిసిన మరునాడే ఈ బాలిక మృతి చెందడం 'భయభ్రాంతులకు' గురి చేస్తోందని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)