You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ హక్కు కోసం పోరాడిన కార్యకర్తకు జైలు శిక్ష: Newsreel
సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ హక్కు కోసం పోరాడిన ప్రముఖ మహిళా ఉద్యమకారిణి లౌజైన్ అల్-హాథ్‌లౌల్‌కు అయిదేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు.
31 ఏళ్ల అల్-హాథ్‌లౌల్ ఇప్పటికే రెండున్నరేళ్లుగా జైలులోనే ఉన్నారు.
సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో 2018లో అల్-హాథ్‌లౌల్ సహా మరికొంత మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.
ఆమెను విడుదల చేయాలంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు పలుమార్లు కోరాయి.
అయితే, తీవ్రవాద సంబంధిత కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు, జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం, విదేశీ ఎజెండాతో పనిచేస్తున్నారనే కేసుల్లో ఆమెను దోషిగా తేల్చుతూ సోమవారం తీర్పు చెప్పింది.
ఆ ఆరోపణలను అల్-హాథ్‌లౌల్‌తో పాటు, ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. ఆమెను జైలులో చిత్రహింసలకు గురిచేశారని వారు ఆరోపించగా, కోర్టు తోసిపుచ్చింది.
డ్రైవర్‌లెస్ ట్రైన్ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత దేశపు మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ట్రైన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
దిల్లీ మెట్రోలో మెజెంటా లైనులో ఈ సర్వీసును మోదీ ప్రారంభించారు.
ఈ అధునాతన టెక్నాలజీ వినియోగంతో దిల్లీ మెట్రో ప్రపంచంలోని 7 శాతం ఉన్న ఇలాంటి సేవలలో తానూ భాగమైంది.
జనకపురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్‌ను కలిపే ఈ మార్గం, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' ద్వారా అనుసంధానమయ్యాయని దిల్లీ మెట్రో వర్గాలు వెల్లడించాయి.
భారత్ స్మార్ట్ సిస్టమ్స్ దిశగా వేగంగా సాగుతుందనడానికి ఇదే ఉదాహరణ అని మోదీ ఈ సందర్భంగా అన్నారు.
సులభ జీవనానికి పట్టణీకరణను ఒక అవకాశంగా పరిగణించాలని మోదీ అన్నారు.
కృష్ణా జిల్లాలో కరోనావైరస్ వ్యాక్సీన్ డ్రైరన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సీన్ డ్రైరన్‌ను అధికారులు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ఈ రోజు నుంచి డ్రైరన్ ప్రారంభమవుతుండగా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
టీకా కార్యక్రమ యాప్ పనితీరు, వ్యాక్సిన్ సరఫరా, పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులను ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు గాను ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, సూర్యారావుపేటలోని పూర్ణ హార్ట్ సెంటర్, కృష్ణవేణి డిగ్రీకాలేజీ, తాడిగడప సెక్రటేరియట్, ప్రకాశ్ నగర్ పీహెచ్‌సీ, కంకిపాడు మండలంలోని ఉఫ్పలూరు పీహెచ్‌సీ పరిధిలో చేపట్టిన ఈ డ్రైరన్ రెండు రోజుల పాటు కొనసాగుతుంది.
టీకా కార్యక్రమం ప్రారంభమైన తరువాత ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో, అవే ఏర్పాట్లు ఇప్పుడూ చేసి పరిశీలిస్తున్నారు.
అమెరికా: కరోనా ఉపశమనం, వ్యయం ప్యాకేజీ బిల్లుపై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కరోనావైరస్ ఉపశమనం, వ్యయం ప్యాకేజీ బిల్లుపై సంతకం చేశారు.
ట్రంప్ మొదట ఈ బిల్లుపై సంతకం చేయడానికి నిరాకరించారు. ప్రజలకు ఒకే విడతలో భారీగా చెల్లింపులు జరపాలని వాదించారు.
ఈ బిల్లుపై సంతకం ఆలస్యం కావడం వల్ల లక్షలాది అమెరిన్లు తాత్కాలికంగా నిరుద్యోగ ప్రయోజనాలను కోల్పోయారు.
కొన్ని నెలలపాటు చర్చించిన తర్వాత అమెరికా కాంగ్రెస్ 900 బిలియన్ డాలర్ల ఈ విలువైన ఈ ఉపశమనం ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది.
ఫెడరల్ ప్రభుత్వం వ్యయం చేస్తున్న 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీలో ఇది భాగం.
సోమవారం అర్థరాత్రి నాటికి ట్రంప్ దీనిపై సంతకం చేయకపోయుంటే, అమెరికాలో తత్కాలిక ప్రభుత్వం అంతంకావడం ప్రారంభమై ఉండేది.
దాదాపు కోటీ 40 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగులకు ప్రయోజనాలు, కొత్త ఉద్దీపన చెల్లింపుల్లో లోపాలను ఎదుర్కున్నారు. ఇప్పుడు నిరుద్యోగ ప్రయోజనాలను పునరుద్ధరించనున్నారు.
ఈ ప్యాకేజీలో భాగంగా నిరుద్యోగులకు తక్షణం చెల్లింపులు జరుపుతారు. అందుకే ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్ చివరికి దీనిపై సంతకం చేయాలని నిర్ణయించారు.
ట్రంప్ సంతకం పెట్టడం ఆలస్యం అయితే 'వినాశకర పరిణామాలు' ఉంటాయని అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనాతో ప్రపంచం తలకిందులవుతున్న వేళ ఈ ఐదుగురు రూ. 22 వేల కోట్లు వెనకేసుకున్నారు
- కోవిడ్-19 లాక్డౌన్: ఫిలిప్పీన్స్‌లో సంతాన విప్లవం - లక్షల సంఖ్యలో అవాంఛిత గర్భాలు
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)