You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: అమెరికాలో తొలి కోవిడ్ వ్యాక్సీన్... ఏప్రిల్ నాటికి 10 కోట్ల మందికి టీకాలు - BBC Newsreel
అమెరికాలో తొలి కోవిడ్-19 వ్యాక్సీన్ ఇచ్చారు. చరిత్రలో మున్నెన్నడూ లేనంతటి భారీ స్ధాయిలో వ్యాక్సీన్ పంపిణీకి అమెరికా సిద్ధమవుతోంది.
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు చెందిన ఒక నర్సు తొలి టీకాను ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
అమెరికాలో సోమవారం నాడు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ డోసులు లక్షల సంఖ్యలో 150 ఆస్పత్రులకు చేరుతున్నాయి. ఏప్రిల్ నెల నాటికి 10 కోట్ల మందికి టీకాలు వేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు 3 లక్షల మంది కరోనావైరస్ బారిన పడి చనిపోయారు.
ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను అమెరికా ఎఫ్‌డీఏ అత్యవసర ఉపయోగానికి అనుమతిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
"తొలి వ్యాక్సీన్ ఇవ్వడం జరిగింది. అమెరికాకు శుభాకాంక్షలు! ప్రపంచానికి శుభాకాంక్షలు!" అని అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు.
చైనా హెచ్చరిక: 'బ్లూంబర్గ్ జర్నలిస్ట్ అరెస్ట్ మా అంతర్గత విషయం'
న్యూస్ ఏజెన్సీ బ్లూంబర్గ్ జర్నలిస్ట్ అరెస్టు తమ అంతర్గత అంశమని చైనా చెప్పింది. తమ దేశానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని మిగతా దేశాలను హెచ్చరించింది.
చైనా పౌరుడు, జర్నలిస్ట్ హేజ్ ఫాన్‌ను గత వారం అదుపులోకి తీసుకున్నారు. జాతియ భద్రతను ప్రమాదంలో పడేశారని అధికారులు ఆయనపై ఆరోపణలు నమోదు చేశారు.
చైనాలో ఇటీవల జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, లేదంటే బహిష్కరించడం లాంటి ఘటనలు పెరుగుతున్నాయి. అదే వరుసలో తాజాగా హేజ్ ఫాన్‌ను అరెస్ట్ చేశారు.
యూరోపియన్ యూనియన్ అపీల్
రిపోర్టింగ్‌లో ఉండగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులు అందరినీ విడుదల చేయాలని యూరోపియన్ యూనియన్ చైనాను కోరింది.
"చైనా అవసరమైతే హేజ్ ఫాన్‌కు వైద్య సేవలు, లాయర్ సౌకర్యాన్ని అందిస్తారని తాము ఆశిస్తున్నామని, అతడిని కలవడానికి కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని" ఈయూ శనివారం జారీ చేసిన ఒక ప్రకటనలో చెప్పింది.
చైనాలోని విదేశీ జర్నలిస్టుల సంఘం(ఎఫ్‌సీసీసీ) కూడా హేజ్ ఫాన్‌కు అండగా నిలిచింది. అంతర్జాతీయ మీడియా అంతా చైనాలో తమ సిబ్బందిపై ఆధారపడుతుందని తెలిపింది.
చైనా సమాధానం
అయితే, చైనా జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే నేర కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్టు హేజ్ ఫాన్ మీద సందేహాలు ఉన్నాయని యూరోపియన్ యూనియన్‌లో చైనా రాయబారి ఆదివారం చెప్పారు.
"ఈ అంశంపై చట్ట పరిధిలో దర్యాప్తు జరుగుతోంది. హేజ్ ఫాన్ హక్కులను పరిగణనలోకి తీసుకున్నాం. ఇది పూర్తిగా చైనా అంతర్గత అంశం. వేరే ఏ దేశానికీ, ఏ సంస్థకూ ఇందులో జోక్యం చేసుకోడానికి ఎలాంటి హక్కూ లేదు" అని చైనా రాయబారి తన అధికారిక వీచాట్ అకౌంట్‌లో హెచ్చరించారు.
గూగుల్ సేవలకు అంతరాయం... స్తంభించిన యూట్యూబ్, జీమెయిల్, డాక్స్
గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్, యూట్యూబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. గూగుల్ డాక్స్ కూడా పని చేయడం లేదని అంటున్నారు. గూగుల్ డాక్స్ యూజర్లకు "Google Docs encountered and error" అనే మెసేజ్ వస్తోంది.
యూట్యూబ్ క్లిక్ చేసినా "Something went wrong" అనే మెసేజ్ కనిపిస్తోంది. జీమెయిల్ విషయానికి వస్తే, 'We're sorry, but your account is temporarily unavailable. We apologise for the inconvenience and suggest trying again in a few minutes. You can view the G Suite Status Dashboard for the current status of the service.' అనే సందేశం కనిపిస్తోంది.
Downdetector వెబ్ సైట్ ప్రకారం గూగుల్ సంస్థకు చెందిన దాదాపు అన్ని సేవలు స్తంభించిపోయాయి. వీటిలో గూగుల్ డ్రైవ్, హాంగౌట్స్, మీట్, ప్లే వంటి ఆన్ లైన్ సేవలు ఉన్నాయి.
యూట్యూబ్ యాక్సెస్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించామని చెబుతూ టీమ్ యూట్యూబ్ ట్వీట్ చేసింది. మా బృందం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందని ఈ ట్వీట్ ద్వారా తెలిపింది.
ఆ తరువాత కొన్ని నిమిషాలకు గూగుల్ సేవలను పునరుద్ధరించారు. ఆ కొద్ది సేపట్లోనే లక్షలాది మంది యూజర్లు అయోమయానికి గురయ్యారు. నెటిజెన్లు ఈ అంతరాయంపై తమదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు కూడా.
డౌన్ అయింది మీ వైఫై అనుకుంటున్నారా.. కాదు యూట్యూబ్
యూట్యూబ్, జీమెయిల్ సర్వీసుల్లో అంతరాయంపై సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ వెల్లువెత్తాయి.
యూట్యూబ్ ఓపెన్ కాకపోయే సరికి, ఏం జరిగిందో చూడ్డానికి వెంటనే అంతా ట్విటర్ వైపు పరుగులు తీశారంటూ తన్వీర్ సింగ్ ఓ సరదా ట్వీట్ చేశారు.
డౌన్ అయింది మీ వైఫై అనుకుంటున్నారేమో.. కాదు. డౌన్ అయింది యూట్యూబ్ అంటూ దివ్యమ్ గుప్తా ట్వీట్ చేశారు.
గూగుల్ చాలా నమ్మకంగా ఉంది.. తన సర్వీసులు డౌన్ కావు అని. అందుకే గూగుల్ డౌన్ అయిందా అని ప్రశ్నిస్తే నో అని చూపిస్తోంది అని ప్రేమ్ గంతా ట్వీట్ చేశారు.
మొత్తానికి ఆ రోజు వచ్చింది. గూగుల్‌కు ఏం జరుగుతోందో తెలుసుకుందామని గూగుల్‌లో వెతికే అవకాశం లేకుండా పోయింది. ఇదింకా 2020నే. అని కార్తీక్ ట్వీట్ చేశారు.
సెక్స్ వర్కరే కదా అని లైంగికంగా వేధిస్తే ఏమైందో చూడండి...
న్యూజీలాండ్‌లో ఒక యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు వేసిన ఒక సెక్స్ వర్కర్ ఆరంకెల భారీ మొత్తాన్ని పరిహారంగా అందుకున్నారు.
మహిళ భావోద్వేగాలకు హాని కలిగించి, ఆదాయం కోల్పోయేలా చేశారంటూ వేసిన ఈ కేసు సెటిల్‌మెంట్‌లో భాగంగా బాధితురాలికి ఈ మొత్తం అందినట్లు ఆమె తరపున వాదించిన ఒక మానవ హక్కుల సంస్థ చెప్పింది.
పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి విముక్తి పొందడం కార్మికుల హక్కు అని చెప్పడానికి ఇది ఒక రిమైండర్‌లా మిగిలిపోతుందని ఆ సంస్థ తెలిపింది.
వేశ్యా వృత్తిని నేరంగా చూడకూడదని చెబుతూ 2003లో న్యూజీలాండ్ ఒక చట్టం ఆమోదించింది. ఈ కేసులో విచారణ వివరాలను, వాదులు, ప్రతివాదుల గుర్తింపును రహస్యంగా ఉంచారు. కానీ, ఈ కేసులో సోమవారం ఇచ్చిన తీర్పును వేశ్యావృత్తిలో ఉన్న వారి హక్కులకు సంబంధించి ఒక మైలురాయిగా భావిస్తున్నారు.
"వేశ్యావృత్తిలో ఉన్న ఒక సెక్స్ వర్కర్‌కు ఇలాంటి పరిష్కారం అందించడం చాలా గొప్ప విషయం. మనం ఏ పని చేస్తున్నా, అక్కడ జరిగే అన్యాయాన్ని ఎదుర్కోడానికి ఇలాంటివి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ వ్యాపారాల్లో ఉన్నవారికి ఇది మేలుకొలుపు" అని న్యూజీలాండ్‌లో సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఉద్యమించే డేమ్ కేథరీన్ హీలే అన్నారు.
న్యూజీలాండ్‌లో వేశ్యావృత్తిని నేరంగా చూడకూడదని, అప్పుడే ఆ వృత్తిలో భద్రత ఉంటుందని హీలే సుదీర్ఘ కాలంగా ఉద్యమం చేశారు. ఆమె కృషితో వ్యభిచారంలో సంస్కరణలు తీసుకొచ్చే చట్టంకోసం ముసాయిదా రూపొందించారు. 2003లో ఆమోదించిన ఈ చట్టంతో వేశ్యాగృహాల్లో వ్యాపారం చట్టబద్ధం అయ్యింది. సెక్స్ వర్కర్లకు పూర్తి ఉపాధి హక్కులను అందాయి.
"పనితో సంబంధం లేకుండా కార్మికులందరికీ పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి విముక్తి పొందే హక్కు ఉంది. వ్యాపార సంస్థల యజమానులు, యాజమాన్యాలు ఆ హక్కులను గౌరవించడాన్ని మేం ప్రోత్సహిస్తాం" అని న్యూజీలాండ్‌లోని మానవ హక్కుల కార్యాలయం డైరెక్టర్ మైకేల్ టిమ్మిన్స్ సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు.
వైట్‌హౌస్ అధికారులకు టీకా ఇప్పుడే వద్దన్న డోనల్డ్ ట్రంప్
అత్యవసర అనుమతి పొందిన ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను సోమవారంనుంచీ ప్రజలకు అందజేస్తామని యూఎస్ అధికారులు తెలిపారు.
మొదటి 30 లక్షల వ్యాక్సీన్ డోసులను అన్ని రాష్ట్రాలకూ పంపిణీ చేసినట్లు జనరల్ గుస్తావ్ పెర్నా తెలిపారు.
కాగా, మొదటిదశ టీకా కార్యక్రమంలో భాగంగా అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ అధికారులకు కూడా వ్యాక్సీన్ వేయనున్నారని తొలుత వార్తలు వచ్చాయి.
అయితే, వైట్‌హౌస్ అధికారులకు అనుకున్నదానికంటే ముందుగా టీకా వేసే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ట్రంప్ ఆదేశించారు.
ఈ వ్యాక్సీన్ 95 శాతం కోవిడ్ నుంచి రక్షణ ఇస్తుందని, పూర్తిగా సురక్షితమని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది.
గత శనివారం, యూఎస్‌లో అత్యధికంగా 3,309 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదే అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది.
యూఎస్‌లో గత నవంబర్‌నుంచీ కరోనావైరస్ మరణాలు వేగంగా పెరుగుతున్నాయి.
గత శుక్రవారం, ఫైజర్ వ్యాక్సీన్‌కు అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చిన ఎఫ్‌డీఏ ‘మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇదొక మైలురాయి’ అని అభివర్ణించింది.
యూకేలో ఇప్పటికే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. కెనడా, బహ్రైన్, సౌదీ అరేబియాలలో కూడా ఫైజర్ వ్యాక్సీన్‌కు అత్యవసర వినియోగ అనుమతి లభించింది.
కోవిడ్ వైరస్ ఎంఆర్ఎన్ఏ (mRNA)లో ఒక చిన్న భాగాన్ని ఈ వ్యాక్సీన్ తయారీలో వాడారని, ఇది శరీరంలోకి వెళ్లి కోవిడ్‌తో పోరాడే కణాలను పెంపొందిస్తుందని ఎఫ్‌డీఏ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: ఫైజర్ కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కిన మహిళ
- ప్రికాషియస్ ప్యుబర్టీ: ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావటానికి కారణాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- హైదరాబాద్: బొల్లారం ఐడీఏలో భారీ అగ్ని ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు
- పరాంత్రోపస్ రోబస్టస్: 20 లక్షల ఏళ్ల కిందటి మన ‘కజిన్’ పుర్రె లభ్యం.. తవ్వకాల్లో వెలుగులోకి
- అమెరికా: రెండు రోజుల్లో ఇద్దరికి మరణశిక్ష అమలు.. ట్రంప్ దిగిపోయే లోగా మరో ముగ్గురికి...
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్‌లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)