టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం నిలిపివేత - Newsreel

ప్రచురణ

అమెరికాలో టిక్‌టాక్‌పై గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న నిషేధాన్ని నిలిపేస్తూ అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.

నిషేధం ఉత్తర్వులు అమలులోకి వచ్చినట్లయితే.. అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ కాకుండా నిరోధించి ఉండేది.

న్యాయపరమైన కారణాలతో ఈ నిషేధాన్ని కొన్నాళ్లు నిలిపేస్తున్నట్లు కామర్స్‌ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. యాప్‌పై నిషేధాన్ని ఆపాలంటూ ముగ్గురు ప్రముఖ టిక్‌టాక్‌ యూజర్లు ఫిలడెల్ఫియా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయంతో అమెరికాలోని సుమారు 10 కోట్ల మంది టిక్‌టాక్‌ యూజర్లకు ఊరట లభించింది.

టిక్‌టాక్‌ చైనా యజమాని బైట్‌డాన్స్‌ టిక్‌టాక్‌ గ్లోబల్‌ పేరుతో మరో సంస్థగా మార్చేందుకు వాల్‌మార్ట్‌, ఒరాకల్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించారు.

అప్పట్లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఒప్పందానికి మద్దతు పలికింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని టిక్‌టాక్‌ వెల్లడించింది.

టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన సంస్థ ఏదైనా కొనుగోలు చేస్తే బాగుంటుందని ట్రంప్‌ గతంలో అభిప్రాయపడ్డారు.

అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్‌ చైనాకు చేరవేస్తోందని ట్రంప్‌తో పాటు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపేయో పదేపదే ఆరోపించారు. కానీ వాటికి ఎలాంటి ఆధారం చూపలేదు. టిక్‌టాక్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ కారణంగా భారతదేశం కూడా ఇప్పటికే టిక్‌టాక్‌ను నిషేధించింది.

అమెరికాలో నిషేధం నిలిపివేత అంశంపై మాట్లాడానికి బీబీసీ ప్రయత్నించినప్పటికీ.. టిక్‌టాక్‌ ప్రతినిధులు ఎవరూ అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)