అమెరికా ఎన్నికల ఫలితాలు 2020: ట్రంప్, బైడెన్‌లలో ఎవరు ఏ రాష్ట్రంలో ఆధిక్యంలో ఉన్నారంటే

అమెరికా ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మ్యాజిక్ నంబర్ 270. అంటే ఏ అభ్యర్థి అయినా అధికారం చేజిక్కించుకోవాలంటే ఎలక్టోరల్ కాలేజీ మొత్తం 538 ఓట్లలో 270 ఓట్లు గెలుచుకోవాలి.

ఇప్పటివరకూ మ్యాజిక్ ఫిగర్‌కు అభ్యర్థులు ఇద్దరూ చాలా దూరంలో ఉన్నారు. బైడెన్‌కు 224 ఓట్లు, ట్రంప్‌కు 213 ఓట్లు వచ్చాయి.

2016లో మూడు ప్రధాన రాష్ట్రాలు విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియాలో పడిన కేవలం 70 వేల ఓట్లు ట్రంప్‌కు విజయాన్ని అందించాయి. దీనిని బట్టి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎంత ముఖ్యమో మనం అంచనా వేయవచ్చు.

అమెరికా 50 రాష్ట్రాల్లో అక్కడి జనాభాను బట్టి ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య ఉంటుంది. అందుకే ప్రతి రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది.

కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ గెలుస్తారని అనిపిస్తున్నా, ఆధిక్యం పెద్దగా లేదు. అది మారే అవకాశం తక్కువ. మరోవైపు బైడెన్ కూడా చాలా రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించారు. అది తారుమారవడం కూడా కష్టం. ఈ ఆధిక్యం చూస్తున్న మీడియా సంస్థలు ఆధిక్యం లభించిన రాష్ట్రంలో వారే గెలిచినట్లు చెబుతున్నాయి.

అధికారికంగా ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ఫలితాలూ వెల్లడికాలేదు. మీడియా ప్రొజెక్షన్స్ ప్రకారం ట్రంప్‌ ఫ్లోరిడా, ఒహాయో, టెక్సాస్, ఆయోవాలో గెలిచినట్లు ప్రకటించారు. బైడెన్ కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూయార్క్, ఇలినాయ్‌లో గెలిచినట్లు చెబుతున్నారు.

కానీ, ఆరిజోనా, పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, విస్కాన్సిన్, జార్జియాలో పోటీ హోరాహోరీగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మందకొడిగా జరుగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు రేపు గానీ, లేదంటే ఈ వారాంతంలో గానీ ముగుస్తుంది.

అమెరికా ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

ఏ రాష్ట్రం ఎవరిది?

డోనాల్డ్ ట్రంప్: మోంటానా, ఇడాహో, వ్యోమింగ్. నార్త్ డకోటా. సౌత్ డకోటా, నెబ్రస్కా, కన్సాస్, ఉటా, ఒక్లహోమా, టెక్సాస్, ఐఓవా, మిజోరీ, అర్కాన్సస్, లూసియానా, మిసిసిపీ, టెనెసీ, కెంటకీ, ఇండియానా, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కెరోలినా, ఫ్లోరిడాలో విజయం సాధించిన ట్రంప్ పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, జార్జియా, అలస్కా రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

జో బైడెన్: వాషింగ్టన్, ఆరగాన్, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, కోలరాడో, మిన్నెసోటా, ఇలినోయ్, వర్జీనియా, మేరీలాండ్, డెలావేర్, న్యూజెర్సీ, న్యూయార్క్, మసాచుసెట్స్, కనెక్టికట్, న్యూ హాంప్‌షైర్, వర్మాంట్, హవాయిలో విజయం సాధించిన బైడెన్ మెయిన్, విస్కాన్సిన్, ఆరిజోనా, నెవాడా, మిచిగాన్‌లో ఆదిక్యంలో ఉన్నారు.

అమెరికా ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

విజేతను నిర్ణయించేది ఈ ఐదు రాష్ట్రాలే...

అమెరికాకు తర్వాత కాబోయే అధ్యక్షుడు ఎవరనేది బహుశా ఈ రాష్ట్రాలే నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీరి విజయం చాలా వరకూ పెన్సిల్వేనియా లాంటి రాష్ట్ర ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

పెన్సిల్వేనియా - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 29

పెన్సిల్వేనియాలో ఇంకా 14 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. వీటిలో ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లే ఉన్నాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు మెల్లగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం వరకూ నిలిపివేశారు.

ఆరిజోనా- ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11

ట్రెండ్స్ ప్రకారం ఈ రాష్ట్రంలో బైడెన్ విజయం దిశగా వెళ్తున్నారు. ఆరిజోనాలో 82 శాతం అంటే 26 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం లెక్కింపు బుధవారం ఉదయం ముగుస్తుంది. రాష్ట్రంలో బైడెన్‌కు 51.8 శాతం, ట్రంప్‌కు 46.8 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా 18 శాతం ఓట్లు లెక్కింపులో బైడెన్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.

మిచిగాన్ - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16

ఇక్కడ 87 శాతం ఓట్లు అంటే 47 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తైంది. మిగతా ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం పూర్తి చేస్తారు. ఇక్కడ ఆధిక్యంలో ఉన్న ట్రంప్‌కు 49.9 శాతం ఓట్లు, బైడెన్‌కు 48.5 శాతం ఓట్లు వచ్చాయి. పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ ఇక్కడ విజయం ట్రంప్‌దేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

విస్కాన్సిన్ - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10

ఇక్కడ 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైంది. వార్తా సంస్థల వివరాల ప్రకారం బైడెన్‌కు 49.3 శాతం, ట్రంప్‌కు 49.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఈ రాష్ట్రం ఎవరి వైపైనా మొగ్గు చూపవచ్చు. అందుకే, ఈ రాష్ట్రంలోని 10 ఎలక్టోరల్ ఓట్లు చాలా కీలకంగా చెబుతున్నారు.

జార్జియా - ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16

ఈ రాష్ట్రంలో 94 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇప్పటివరకూ ట్రంప్ 50.5 శాతం, బైడెన్ 48.3 శాతం ఓట్లు గెలుచుకున్నారు. జార్జియా ఒక విధంగా వైల్డ్ కార్డులా మారింది. మంగళవారం వరకూ ఇక్కడ ట్రంప్ విజయం దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ, బైడెన్ తర్వాత ఆ ఆధిక్యాన్ని చాలావరకూ తగ్గించారు. ట్రంప్ ఇప్పటికీ ముందంజలో ఉన్నప్పటికీ, పోటీ రసవత్తరంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)