పాకిస్తాన్: కరాచీలో హిందూ ఆలయం ధ్వంసం - NewsReel

కరాచీలో హిందూ ఆలయం ధ్వంసం

ఫొటో సోర్స్, TWITTER / LALMALHI

ప్రచురణ

పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరం కరాచీలో ఒక హిందూ ఆలయంపై ఆదివారం రాత్రి ఒక పెద్ద గుంపు దాడి చేసింది.

కరాచీలోని లీ మార్కెట్ ప్రాంతంలోని శీతల్ దాస్ ఆవరణలో 20కి పైగా హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి.

శీతల్ దాస్ కాంపౌండ్ లోపలి నుంచి ఒక పశువు బయటికి వచ్చిందని, దానిపై రాసి ఉన్న అభ్యంతరకర మాటలు స్థానిక ముస్లింలకు ఆగ్రహం తెప్పించాయని చెబుతున్నారు.

ఆదివారం అర్థరాత్రి దాదాపు 400 మంది శీతల్ దాస్ కాంపౌండ్‌ను చుట్టుముట్టారని అక్కడ నివసించేవారు బీబీసీకి చెప్పారు.

జనంలోని కొందరు కాంపౌండ్‌లోకి చొరబడి మహేశ్వరి సంఘం ఆలయాన్ని ధ్వంసం చేశారని, ఆలయం కిటికీలు, తలుపు విరగ్గొట్టారని, కాసేపట్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో విధ్వంసం, జనం అరవడం కనిపిస్తోంది.

ఈ ఘటన తర్వాత భద్రతా కారణాలతో ముందు జాగ్రత్తగా మహిళలు, పిల్లలను ఆ కాంపౌండ్ నుంచి తరలించారు. అపరిచితులపై పోలీసులు దైవనింద కేసు నమోదు చేశారు.

సింధ్‌లో మైనారిటీల పట్ల వివక్ష పెరుగుతోందని అధికార తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎంపీ లాల్ మహలీ అన్నారు.

శీతల్ దాస్ కాంపౌండ్‌లో ఆలయాన్ని ఇంతకు ముందు కూడా ధ్వంసం చేశారు. సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తజా వహాబ్‌తో దీనిపై మాట్లాడేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

బిహార్ ఎన్నికలు - మోదీ: 'అభివృద్ధి గెలుస్తోంది... ముఠాతత్వం ఓడిపోతోంది'

మోదీ

ఫొటో సోర్స్, ANI

బిహార్‌లో రెండో దశ పోలింగ్ రోజు అరరియా జిల్లాలోని ఫర్బిస్‌గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

బిహార్‌లో ఇవాళ అభివృద్ధికే పెద్ద పీట వేసారని, బంధుప్రీతి, ముఠాతత్వం, దోపిడీ... ఇవన్నీ ఓడిపోతున్నాయని మోదీ అన్నారు. ప్రజల హక్కు గెలుస్తోందన్నారు.

పేదవాళ్లకు పక్కా ఇళ్లు ఇస్తామని చేసిన ప్రచారం గురించి ప్రస్తావిస్తూ... కరోనా కారణంగా పనులు మందగించాయని, త్వరలో అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

"బిహార్‌లో ఎన్నికలను హాస్యాస్పదంగా నిలబెట్టిన రోజులను ఎప్పటికీ మరచిపోలేం. వారికి ఎన్నికలంటే హింస, హత్యలు, పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకోవడం మాత్రమే. పేద ప్రజల ఓటు హక్కును హరించారు. ఇప్పుడు బిహార్ ప్రజలు ఆటవిక రాజ్యాన్ని, డబుల్-డబుల్ యువరాజులను తిరస్కరించారు" అని మోదీ అన్నారు.

ఎన్‌డీఏ పేద ప్రజలకు ఓటు వేసే హక్కును కల్పించిందని ప్రధాని అన్నారు. ఈరోజు బిహార్ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది....కరోనా కారణంగా ప్రపంచం మొత్తం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో బిహార్ ప్రజలు ఇల్లు కదిలి ఓటు వెయ్యడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారనిప్రశంసించారు.

దుబ్బాక ఉప ఎన్నిక: ప్రశాంతంగా పోలింగ్... ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం

దుబ్బాక

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక‌ పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ న‌మోదైంది.

ఓటర్లు సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కోవిడ్ బాధితులు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌మ‌స్యాత్మ‌క‌మైనవిగా గుర్తించిన 85 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నిక‌లో మొత్తం 23 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)