You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ వ్యాక్సిన్: నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ పంపిణీకి సంసిద్ధం కావాలని అమెరికా రాష్ట్రాలకు సీడీసీ సూచన - BBC Newsreel
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే కొంతమందికి కోవిడ్-19 వాక్సిన్ ఇస్తామని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలిపింది.
ఈ వ్యాక్సిన్ పంపిణీ కోసం సంసిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో అమెరికాలో కలకలం మొదలైంది.
సాధారణంగా యూఎస్‌లో ఎన్నికల ప్రచారంలో చివరి అంకంగా 'అక్టోబర్ సర్ప్రైజ్' పేరుతో ఒక వార్తను లేదా విధానాన్ని ప్రకటిస్తారు.
ఈసారి కోవిడ్-19 వాక్సిన్ అక్టోబర్ సర్ప్రైజ్‌గా ముందుకు వచ్చింది. దీన్ని హోలీ గ్రెయిల్ (పవిత్ర పాత్ర) గా ట్రంప్ బృదం అభివర్ణిస్తోంది.
అయితే, నవంబర్ 1 కి వాక్సిన్ విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలకు ముందు సీడీసీ రాజకీయ జోక్యంపై డెమోక్రటిక్ పార్టీ సభ్యులు, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'ఒక్కొక్కరు రెండు సార్లు ఓటు వెయ్యండి': మద్దతుదారులకు ట్రంప్ సూచన
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్షఎన్నికల్లో.. చట్టవిరుద్ధమైనా సరే నార్త్ కరోలినావాసులు రెండుసార్లు ఓట్లు వెయ్యాలని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
పోస్టల్ ద్వారా వచ్చే ఓట్లలో అవకతవకలు జరుగుతాయని, మోసాలు జరుగుతాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
"వాళ్ల ఓట్లను పోస్ట్ చెయ్యమనండి. నేరుగా పోలింగ్ స్టేషన్‌కి కూడా వెళ్లి వెయ్యమనండి. ఒకవేళ వ్యవస్థలో లోపాలేవీ లేకుండా సక్రమంగా పనిచేస్తున్నట్టైతే పోస్టల్ ద్వారా పంపించినవారిని మళ్లీ పోలింగ్ బూత్‌లో ఓటు వెయ్యనివ్వరు" అని ట్రంప్ నార్త్ కరోలినా టీవీ కార్యక్రమంలో అన్నారు.
నార్త్ కరోలినా అటార్నీ జనరల్ జోష్ స్టైన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ "రాబోయే ఎన్నికల్లో గందరగోళం సృష్టించడానికి, ట్రంప్ ప్రజలను చట్టవిరుద్ధంగా ప్రవర్తించాలని అంటున్నారు. నార్త్ కరోలినా ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి.. మీరు తప్పక ఓటు వెయ్యండి, కానీ రెండు సార్లు కాదు. నవంబర్‌లో ప్రజల అభిమతమే గెలుస్తుందని నిరూపించడానికి కావలసిన అన్ని జాగ్రత్తలూ నేను తీసుకుంటాను" అని అన్నారు.
అయితే పోస్టల్ ఓట్లపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కొత్తేమీ కాదు. గత నెల జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో కూడా పోస్టల్ ఓట్లలో దగా జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ అధ్యక్షుడు ఎల్లెన్ వెయింట్రాబ్ "ట్రంప్ వ్యాఖ్యలకు ఆధారాలు లేవు" అన్నారు.
ఇప్పటివరకూ జరిగిన అనేక జాతీయ, రాష్ట్రస్థాయి అధ్యయనాల్లో పోస్టల్ ఓట్లలో మోసాలు జరుగుతాయని బయటపడినట్టు సమాచారం లేదు.
2016 యూఎస్ ఎన్నికల్లో నాలుగొంతుల జనాభా పోస్ట్ ద్వారానే తమ ఓటు పంపించారు. కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది ఎన్నికల్లో పోస్టల్ ద్వారా వచ్చే ఓట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.
జార్జి ఫ్లాయిడ్ కన్నా ముందు.. అదే రీతిలో మరో నల్లజాతీయుడి మరణం
అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా డేనియల్ ప్రూడ్ అనే నల్లజాతీయుడు ఊపిరాడక మరణించిన విషయం ఆలస్యంగా బయటకువచ్చింది.
అరెస్టైన సమయంలో డేనియల్ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. డేనియల్ తమపై ఉమ్మకుండా ఉండేందుకు పోలీసులు ఆయనకు 'స్పిట్ హుడ్' అని పిలిచే మాస్క్ తొడిగారు.
జార్జ్ ఫ్లాయిడ్ మరణించడం కన్నా రెండు నెలల ముందే గత మార్చిలో ఈ ఘటన జరిగింది.
డేనియల్ వయసు 41 ఏళ్లు. అరెస్టు చేసే క్రమంలో ఆయనకు పోలీసులు స్పిట్ హుడ్ వేసి, రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి రెండు నిమిషాల పాటు నేలకు గట్టిగా అదిమిపట్టి ఉంచారు. పోలీసుల బాడీ కామ్ ఫుటేజీలో ఇదంతా రికార్డైంది.
డేనియల్ ఆ తర్వాత ఊపిరాడక మరణించారు. ఘటన జరిగిన సమయంలో ఆయన దగ్గర ఎలాంటి ఆయుధమూ లేదు.
గత మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతి వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో ఓ తెల్ల జాతి పోలీసు అధికారి... ఆయన్ను నెలకు అదిమిపట్టి, మెడను మోకాలితో నొక్కిపట్టి చాలా సేపు కూర్చున్న సంగతి తెలిసిందే.
జార్జ్ మరణించడంతో, అప్పుడు పోలీసుల తీరుపై అమెరికా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' నినాదం మార్మోగింది.
తాజాగా విస్కాన్సిన్‌లోనూ ఆగస్టు 23న జేకబ్ బ్లేక్ అనే నల్ల జాతి వ్యక్తి పోలీసుల కాల్పుల కారణంగా పక్షవాతానికి గురయ్యారు. ఈ ఘటనతో ఆందోళనలు మళ్లీ పెరిగాయి.
డ్వైన్ జాన్సన్ 'ద రాక్'కు కరోనావైరస్ పాజిటివ్
''ద రాక్''గా సుపరిచితుడైన డ్వైన్ జాన్సన్‌కు కరోనావైరస్ సోకింది. తనతోపాటు తన భార్య, ఇద్దరు కుమార్తెలకూ పాజిటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మాజీ రెజ్లర్, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న48ఏళ్ల రాక్‌కు రెండు వారాల క్రితం ఈ వైరస్ సోకింది.
తాము అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ.. ఓ సన్నిహిత కుటుంబం నుంచి ఈ వైరస్ సోకినట్లు ఆయన తెలిపారు. ఆ కుటుంబానికి వైరస్ ఎలా సోకిందో తెలియదని చెప్పారు.
ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వివరించారు.
రెజ్లింగ్‌తో పాపులర్ అయిన రాక్.. ద స్కార్పియో కింగ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, జుమాంజీ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి:
- పబ్జీ గేమ్ నిషేధం.. మొత్తం 118 మొబైల్ యాప్‌లు బ్లాక్.. కేంద్రం ఆదేశాలు
- న్యూడ్ బీచ్‌లో గ్రూప్ సెక్స్ పార్టీలు... ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- జీడీపీ పతనం భయపెడుతున్నా.. ‘మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను కాపాడొచ్చు.. ఎలాగంటే...‘
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- కరోనావైరస్ అంతా కట్టుకథ అనుకున్నాడు... చివరకు భార్యను పోగొట్టుకున్నాడు
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీ... ప్రపంచ దేశాల మధ్య రాజకీయ యుద్ధంగా ఎందుకు మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)