జాకబ్ బ్లేక్: అమెరికాలో ఆగని ఘర్షణలు.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. విస్కాన్సిన్‌లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
నల్లజాతి వ్యక్తిపై కాల్పుల ఘటనకు నిరసనగా అల్లర్లతో అట్టుడికి పోతున్న విస్కాన్సిన్ రాష్ట్రంలో కెనోషా నగరం ఇంకా రగులుతూనే ఉంది. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మరణించారు.
ఆదివారంనాడు జాకబ్ బ్లేక్ అనే 29 ఏళ్ల వ్యక్తిపై అతని పిల్లల ముందే పోలీసులు ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు.
బ్లేక్‌పై కాల్పులకు నిరసనల సందర్భంగా ఓ పెట్రోల్ స్టేషన్ వద్ద కాపలా ఉన్న పోలీసులతో ఆందోళనకారులు గొడవకు దిగారు. చివరకు అది హింసాత్మకంగా మారింది
కెనోషా పట్టణానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారు. మరోవైపు నగరంలో ఆందోళనకారులు పలు ఆస్తులను ధ్వంసం చేశారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలు, నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపుతామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారంనాడు ప్రకటించారు.
“అమెరికా వీధుల్లో అరాచకాన్ని మేం సహించం. కేంద్ర దళాలను అనుమతిస్తున్నామని విస్కాన్సిన్ స్టేట్ గవర్నర్ మా అధికారులకు సమాచారమిచ్చారు’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం జాకబ్ బ్లేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అతను స్పృహలోనే ఉన్నారని అతని తల్లి తెలిపారు. బ్లేక్ మళ్లీ నడవగలిగితే అది ఒక అద్భుతమేనని అతని లాయర్లు అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆందోళనల సందర్భంగా మంగళవారం నాడు పలుమార్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని కెనోషా నగర పోలీసులు ప్రకటించారు. “ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించాం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పెట్రోల్ స్టేషన్ దగ్గర పలువురు ఆందోళనకారులు భద్రతాధికారులతో గొడవపడ్డారని, ఇది కాల్పులకు దారి తీసిందని కెనోషా నగర షెరీఫ్ డెవిడ్ బెత్ న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు.
జనం వెంటపడగా రైఫిల్ పట్టుకున్న ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు, అతను కిందపడి జనం మీద కాల్పులు జరుపుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. మరో వీడియోలో సైనిక దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు షాపుల మీద దాడి జరగకుండా భద్రతా వలయంలాగా నిలుచుకున్న దృశ్యాలు కూడా కనిపించాయి.
ఇంతకు ముందు కొన్ని ప్రభుత్వ ఆస్తులు, షాపుల మీద దాడులు జరగగా కొందరు వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వాటిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది
“కొందరు పౌరులు బృందాలుగా ఏర్పడి తమ ఆస్తులు, వ్యాపారాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని విస్కాన్సిన్ ప్రొఫెషనల్ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.
కెనోషా పట్టణానికి నేషనల్ గార్డ్స్ దళాలను పంపుతున్నట్లు విస్కాన్సిస్ స్టేట్ గవర్నర్ టోనీ ఎవర్స్ మంగళవారంనాడు ప్రకటించారు.

ఫొటో సోర్స్, BENCRUMP.COM
అల్లర్లు ఎందుకు మొదలయ్యాయి?
ఆదివారంనాడు నల్లజాతీయుడు జాకబ్ బ్లేక్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలియగానే వందలమంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించానికి బయలుదేరారు. మధ్యలో కనిపించిన అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. 24గంటలపాటు షాపులు మూసేయాల్సిందిగా పోలీసులు సూచించారు. ఆదివారం రాత్రి మొత్తం అక్కడ కర్ఫ్యూ విధించారు.
అల్లర్లను అదుపు చేయడంలో స్థానిక పోలీసులకు సాయం చేయాల్సిందిగా విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ సోమవారంనాడు నేషనల్ గార్ట్స్‌ను కోరారు. కొందరు ఆందోళనకారులు కార్లకు నిప్పంటించారని, బేస్‌బాల్ బ్యాట్లతో విధ్వంసానికి దిగారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
మంగళవారంనాడు కెనోషా నగరమంతా ఆందోళనలు, నిరసనలతో హోరెత్తింది. కొందరు ఆందోళనకారులు పోలీసులు మీద దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.
ప్రజలెవరూ వీధుల్లోకి రావద్దని పోలీసులు కెనోషా నగర వాసులకు ట్విటర్ ద్వారా తెలిపారు. ఆందోళనల సందర్భంగా అనేక భవనాలపై కూడా దాడులు జరిగాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు.
విస్కాన్సిన్‌లో మొదలైన ఆందోళనలు క్రమంగా పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌తోపాటు ఇటీవల పోలీసుల చేతిలో మరణించిన నల్లజాతీయుడు జార్జ్‌ఫ్లాయిడ్ సొంత పట్టణం మిన్నియా పోలీస్ వరకు పాకాయి.
బ్లేక్‌పై కాల్పుల ఘటననకు నిరసనగా “ది టొరంటో ర్యాప్టర్స్’’ బాస్కెట్‌బాల్ టీమ్ సెమీఫైనల్ నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. “బ్లాక్‌లైవ్స్ మ్యాటర్స్ ఉద్యమంలో సాధించాల్సింది చాలా ఉంది. ఊరికే జూమ్ మీటింగ్‌లు పెట్టుకుని చర్చిస్తే కుదరదు’’ అని జట్టు ఆటగాడు నార్మన్ పోవెల్ వ్యాఖ్యానించారు.

జాకబ్ బ్లేక్‌పై కాల్పుల ఘటన- తాజా పరిణామాలు
వీపు మీద కాల్పుల కారణంగా బ్లేక్ కదల్లేని స్థితిలో ఉన్నారని అతని లాయర్లు వెల్లడించారు. అతని వెన్నెముక దెబ్బతిన్నదని, అతను తిరిగి నడవగలిగితే అది అద్భుతమేనని జాకబ్ కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు అతని తరఫు లాయర్లు వెల్లడించారు. కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోయాయని, కిడ్నీ, లివర్‌పై కూడా కాల్పుల ప్రభావం పడిందని, చిన్నపేగును కొంత తొలగించాల్సి వచ్చిందని వారు తెలిపారు.
“జాకబ్ మృత్యువుతో పోరాడుతున్నాడు. కానీ జరుగుతున్న విధ్వంసంపట్ల అతను ఆందోళన వ్యక్త చేస్తున్నాడు’’ అని జాకబ్ తల్లి జూలియా జాక్సన్ మీడియాకు వెల్లడించారు.
పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత జాతివివక్ష దాడులపై అమెరికాలో విపరీతమైన చర్చ జరుగుతున్న సమయంలోనే జాకబ్ బ్లేక్ రూపంలో మరో ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులు ఏం చెబుతున్నారు?
వీడియో ఫుటేజ్‌లో మాత్రం జాకబ్ బ్లేక్ కారు ఎక్కబోతుండగా, వెనక నుంచి అతని చొక్కాపట్టుకుని పోలీసులు కాల్పులు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
తండ్రిపై కాల్పులు జరుగుతున్న సమయంలో అతని ముగ్గురు పిల్లలు కారు వెనక సీట్లోనే ఉన్నారని, వారు భయంతో కేకలు పెట్టారని అతని భార్య లాఖీషా బూకర్ వెల్లడించారు.
ఒక గొడవను సర్ది చెప్పడానికి వెళ్లిన బ్లేక్‌పై కాల్పులు జరిగాయని అతని లాయర్లతోపాటు స్థానికులు కూడా చెబుతున్నారు.
లైంగిక వేధింపులు, గృహహింస ఆరోపణలపై బ్లేక్ మీద ఇప్పటికే ఒక అరెస్టు వారెంటు ఉందని కోర్టు రికార్డులు చెబుతుండగా, వాటి గురించి తమకు తెలుసా లేదా అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించడం లేదు.
జాకబ్ బ్లేక్‌పై కాల్పులు జరిపిన పోలీస్ అధికారి పేరును ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ వెల్లడించారు.
రుస్టెన్ షెస్కీ అనే ఈ పోలీసాఫీసర్ జాకబ్ బ్లేక్ తన కారు డోరు తీసుకుని లోపల కూర్చోబోతుండగా 7 సార్లు కాల్పులు జరిపారు. కారు డోర్ తెరవగానే అందులో ఒక కత్తి కనిపించిందని, మరే ఇతర ఆయుధం కనబడలేదని అటార్నీ జనరల్ వెల్లడించారు.
కెనోషా ఘటనకు బాధ్యులైన వారిని సెలవు మీద పంపించాల్సిందిగా విస్కాన్సిన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాల్పులు జరిపిన అధికారులపై విచారణ జరగాలంటూ ఆన్‌లైన్‌లో వేలమంది నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నడుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ పేరుతో అమెరికాలోని భారతీయుల ఓట్లకు ట్రంప్ గాలం వేస్తున్నారా?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- టెనెట్: ఆమె కోసం ఆ ఇద్దరు మగాళ్లు సర్వం ధారపోయడానికి సిద్ధపడ్డారెందుకు
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి, విజేతను ఎలా ప్రకటిస్తారు?
- బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమం ఎలా పుట్టిందంటే...
- కమలా హారిస్: అమెరికన్ రాజకీయ కొలనులో భారత సంతతి కమలం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























