అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ: ‘వచ్చే ఏడాది జనవరి నుంచి మేం ముగ్గురం’ - BBC Newsreel

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల పెళ్లి ఫొటో

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల పెళ్లి ఫొటో
ప్రచురణ

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన, భార్య అనుష్క శర్మలు ట్విటర్ వేదికగా ఈ విషయం ప్రకటించారు.

వారు ఈ ప్రకటన చేసిన తరువాత నుంచి ఎప్పటిలా వారిద్దరి పేర్ల ద్వయం 'విరుష్క' అనేది ట్విటర్‌లో ట్రెండవుతోంది.

''2021 జనవరి నుంచి మేం ముగ్గురం'' అంటూ కోహ్లీ, అనుష్క శర్మలు తమతమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.

ఈ స్టార్ కపుల్ 2017 డిసెంబరులో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.

విరాట్, అనుష్కలు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించగానే బాలీవుడ్ ప్రముఖులు అలియా భట్, వరుణ్ ధవన్, ప్రియాంక చోప్రా తదితరులు వారికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

అంతేకాదు.. తమ అభిమాన ఆటగాడు తండ్రి కాబోతున్నట్లు తెలియగానే అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ ఆనందం పంచుకోవడం ప్రారంభించారు.

విరాట్, అనుష్కలు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వారికి లక్షల్లో ఫాలోవర్లున్నారు.

ఇన్‌స్టా‌లో అనుష్క శర్మ ఈ విషయం పంచుకోగా కేవలం రెండు గంటల్లో 26 లక్షల మంది దాన్ని లైక్ చేశారు.

బాలీవుడ్‌లో విజయవంతమైన నటుల్లో అనుష్క శర్మ కూడా ఒకరు. పీకే, సుల్తాన్, దిల్ ధడక్నే దో, యే దిల్ హై ముష్కిల్ వంటి హిట్ చిత్రాల్లో నటించారామె. ఇటీవల ఆమె పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.

కాగా ప్రస్తుతం కోహ్లీ తన ఐపీఎల్ టీం రాయల్ చాలెంజర్స్ సహచరులతో కలిసి దుబయిలో ఉన్నారు.

క్రైస్ట్‌చర్చ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బ్రెంటన్ తన నేరాలను కోర్టులో అంగీకరించాడు

క్రైస్ట్‌చర్చ్ మసీదు దాడి: హంతకుడు బ్రెంటన్ టారంట్‌కు జీవితాంతం జైలు శిక్ష

న్యూజిలాండ్‌లో రెండు మసీదులపై కాల్పులు జరిపి 51 మందిని చంపిన దోషి బ్రెంటన్ టారంట్‌కు జీవితాంతం జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది.

అతడికి పెరోల్ అవకాశం కూడా ఉండదని స్పష్టంచేసింది. అంటే.. కొంత కాలం శిక్ష అనుభవించిన తర్వాత కూడా సదరు ఖైదీ జైలు నుంచి బయటకు వెళ్లే అవకాశం కల్పించరు.

న్యూజిలాండ్ చరిత్రలో ఈ శిక్ష పడిన మొదటి వ్యక్తి 29 ఏళ్ల బ్రెంటన్.

2019 మార్చిలో క్రైస్ట్‌చర్చి నగరంలోని రెండు మసీదులు.. అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ ఇస్లామిక్ సెంటర్ల మీద బ్రెంటన్ తుపాకీలతో కాల్పులు జరిపాడు. ఆ దాడిని హంతకుడు హెడ్ క్యామ్ ద్వారా సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడు. అది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆస్ట్రేలియా పౌరుడైన బ్రెంటన్.. తాను 51 మందిని హత్య చేశానని, మరో 40 మందిపై హత్యాయత్నం చేశానని, ఉగ్రవాదానికి పాల్పడ్డానని నేరాలను అంగీకరించాడు.

క్రైస్ట్‌చర్చ్ మారణహోమం మృతులు
ఫొటో క్యాప్షన్, క్రైస్ట్‌చర్చ్ మారణహోమం మృతులు

అతడి చర్యలు 'అమానవీయమ'ని న్యాయమూర్తి జస్టిస్ మండేర్ అభివర్ణించారు. అతడు ఏమాత్రం దయచూపలేదని వ్యాఖ్యానించారు.

న్యూజిలాండ్ చరిత్రలో నిందితుడు దోషిగా తేలిన తొలి ఉగ్రవాద కేసు కూడా ఇదే.

''నువ్వు చేసిన నేరాలు ఎంత క్రూరమైనవంటే.. నిన్ను చనిపోయేవరకూ జైలులో ఉంచినా.. నువ్వు అనుభవించాల్సిన శిక్ష పూర్తికాదు'' అని జడ్జి పేర్కొన్నారు.

న్యూజిలాండ్ న్యాయవ్యవస్థలో మరణశిక్ష లేదు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో పుట్టిన బ్రెంటన్.. 2017లో న్యూజిలాండ్ వచ్చాడు. అప్పటి నుంచీ ముస్లింల మీద దాడిచేయటానికి ప్రణాళిక రచిస్తూ ఉన్నాడు.

అఫ్గానిస్తాన్ వరదలు

ఫొటో సోర్స్, EPA

అఫ్ఘానిస్థాన్‌: అర్థరాత్రి వరద బీభత్సం.. దాదాపు 100 మంది మృతి

అఫ్ఘానిస్తాన్‌లోని పర్వాన్‌ ప్రావిన్సులో భారీ వరదలకు దాదాపు వంద మంది మరణించారు.

చరికార్‌ అనే పట్టణంలో రాత్రి పూట కుండపోత వర్షం కురవడంతో ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు.

ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో వచ్చిన ఈ భారీ వరదలకు వందల ఇళ్లు కూలిపోయాయని, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని అప్ఘానిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ వెల్లడించింది.

కూలిన ఇళ్ల శిథిలాల కిందా ఇంకా కొందరు ఉండే అవకాశం ఉందని, మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు వెల్లడించారు.

ఫిల్ హోగాన్

ఫొటో సోర్స్, PA Media

యూరోపియన్ యూనియన్: కోవిడ్‌-19 నిబంధనల ఉల్లంఘనతో ఈయూ కమిషనర్ రాజీనామా

యూరోపియన్‌ యూనియన్‌ ట్రేడ్‌ కమిషనర్‌ ఫిల్‌ హోగాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 19న ఒక గోల్ఫ్‌ క్లబ్‌ డిన్నర్‌కు ఆయన హాజరయ్యారు. ఈ డిన్నర్‌లో 80మంది పాల్గొన్నారు. కాగా ఇది కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని ఐర్లాండ్‌ ప్రభుత్వం విమర్శించింది. పైగా ఆయన బ్రస్సెల్‌ నుంచి ఐర్లాండ్‌కు వచ్చాక క్వారంటైన్‌కు వెళ్లలేదని కూడా తెలిపింది. తాను సాధ్యమైనంత వరకు కోవిడ్‌ నిబంధనలను పాటించానని ఫిల్‌ హోగాన్‌ అన్నారు. “ నా పర్యటనలో జరిగిన పొరపాట్లకు ఐరిష్‌ ప్రజలు నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’’ అంటూ తన పదవికి రాజీనామా చేశారు హోగాన్‌.

ఇజ్రాయెల్

ఇజ్రాయెల్‌: మత ప్రబోధకుడి హత్య

ఇజ్రాయెల్ పెటా తిక్వా పట్టణంలో ఓ యూదు ప్రబోధకుడిని పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపారు. షయ్‌ ఒహవాన్‌ అనే మత ప్రబోధకుడు బస్సు దిగి వస్తుండగా, ఓ పాలస్తీనా జాతీయుడు రోడ్డు మీదే అతనిపై దాడి చేశారు. పారిపోయే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నామని ఇజ్రాయెలీ భద్రతాధికారులు వెల్లడించారు. నిందితుడి మానసిక స్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు.

డాల్ఫిన్లు

ఫొటో సోర్స్, NITIN JEEHA

మారిషస్: 17 డాల్ఫిన్ల మృతి

మారిషస్‌ సముద్ర తీరానికి చనిపోయిన 17 డాల్ఫిన్లు కొట్టుకు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సముద్రంలో చమురు లీక్‌ కావడమే దీనికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్‌ ఓడ నుంచి లీకైన ఆయిల్‌గానీ, అధికారులు అధికారులు ముంచేసిన పడవల వల్లగానీ డాల్ఫిన్లకు హాని కలిగి ఉండవచ్చని పర్యావరణ ఉద్యమకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం ఇది చమురు వల్ల జరిగిన ప్రమాదం కాదని ప్రాథమికంగా అంచనా వేశారు. షార్క్‌ దాడి వల్ల గాయపడి డాల్ఫిన్లు మరణించి ఉండవచ్చని, ప్రస్తుతం వీటికి పోస్ట్‌ మార్టం జరుగుతోందని వారు వెల్లడించారు. మారిషస్‌ తీరంలో ఇంత పెద్ద ఎత్తున డాల్ఫిన్‌లు చనిపోయి కొట్టుకురావడం చాలా అరుదని స్థానికులు చెబుతున్నారు.

మెహదీ రజిబియాన్

ఫొటో సోర్స్, MEHDI RAJABIAN

ఇరాన్: మహిళలతో పాటలు పాడించినందుకు మ్యుజీషియన్అరెస్ట్

ఇరాన్‌కు చెందిన ఓ సంగీత కళాకారుడు మెహదీ రజబియాన్‌ మహిళా డాన్సర్‌లు, సింగర్లతో కలిసి పని చేసినందుకు విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలోనే ఆయన తన మ్యూజిక్‌ ఆల్బమ్‌ల విషయంలో రెండుసార్లు అరెస్టయ్యారు. తాజాగా రెండువారాల కిందట పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఆల్బమ్‌ ఇంకా పూర్తికాలేదని, అందులో మహిళా సింగర్ల చేత పాటలు పాడించడం వల్లే తనను అరెస్టు చేశారని రజబియాన్‌ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందన కోసం ఇరాన్‌ సాంస్కృతిక శాఖామంత్రిని బీబీసీ సంప్రదించడానికి ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. పోలీసులు తనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నావా అని జడ్జి తనను నిలదీశారని రజబియాన్‌ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ప్రయత్నాలతో తనకు బెయిల్ దొరికిందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)