You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కమలా హారిస్: ‘‘అమెరికాలో పుట్టలేదు, ఉపాధ్యక్షురాలి అర్హత లేదు అని విన్నా’’ - జన్మ సిద్ధాంతానికి ఆజ్యం పోసిన ట్రంప్
డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్‌కు.. దేశ ఉపాధ్యక్షురాలిగా పనిచేసే 'అర్హత' లేదని తాను విన్నానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా.. విమర్శకులు జాతివివక్షతో కూడుకున్నదని తప్పుపట్టే ఓ న్యాయ సిద్ధాంతాన్ని ఆయన ఎగదోశారు.
కమలా హారిస్ భారతీయ తల్లికి, జమైకా తండ్రికి 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఆక్లండ్‌లో జన్మించారు.
అయితే.. ఆమె అర్హతను సంప్రదాయవాద న్యాయ ప్రొఫెసర్ ఒకరు ప్రశ్నించారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో జన్మించలేదనే బూటకపు సిద్ధాంతాన్ని కూడా ట్రంప్ అనేక ఏళ్ల పాటు ప్రచారం చేశారు.
కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ మంగళవారం నాడు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి నల్లజాతి మహిళగా ఆవిర్భవించారు.
నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారు.
ట్రంప్ ఏమన్నారు?
ట్రంప్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కమలా హారిస్ అర్హత గురించి వినిపిస్తున్న వాదనపై కొందరు ట్రంప్‌ను ప్రశ్నించారు.
దానికి ఆయన స్పందిస్తూన.. ''ఆమెకు కావలసిన అర్హతలు లేవనే మాట నేను ఈ రోజే విన్నాను. అంతేకాదు.. ఆ ముక్క రాసిన లాయర్ చాలా ఉన్నత అర్హతలు గల వ్యక్తి, చాలా టాలెంట్ ఉన్న న్యాయవాది కూడా'' అని బదులిచ్చారు.
''అది నిజమేమో నాకు తెలియదు. ఆమెను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే ముందు డెమొక్రాట్లు ఆ విషయాన్ని తనిఖీ చేసుకుని ఉంటారని నేను అనుకునుండే వాడిని'' అని కూడా వ్యాఖ్యానించారు.
''కానీ అది చాలా సీరియస్ విషయం. ఆమె ఈ దేశంలో పుట్టలేదు కనుక ఆమెకు అర్హత లేదని మీరు అంటున్నారు. వాళ్లు అంటున్నారు'' అని పేర్కొన్నారు.
కమలా హారిస్ అమెరికాలో పుట్టారనే విషయంలో ఎలాంటి ప్రశ్నా లేదని.. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు చట్టబద్ధమైన శాస్వత నివాసులు కాకపోవుచ్చునని సదరు విలేకరి బదులిచ్చారు.
దీనికి ముందు.. ట్రంప్ ఎన్నికల ప్రచార సలహాదారు జెన్నా ఎలిస్.. గురువారం నాడు సంప్రదాయ వాద బృందం జ్యుడీషియల్ వాచ్ అధిపతి టిమ్ ఫిటన్ చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు.
''అమెరికా రాజ్యాంగంలోని 'పౌరసత్వ నిబంధన' కింద ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్‌కు అర్హుల లేదా'' అని ఆ ట్వీట్‌లో టిమ్ ప్రశ్నించారు.
కాలిఫోర్నియాలోని చాప్‌మన్ యూనివర్సిటీకి చెందిన లా ప్రొఫెసర్ జాన్ ఈస్ట్‌మన్ 'న్యూస్‌వీక్' మేగజీన్‌లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసాన్ని కూడా ఆయన షేర్ చేశారు.
లా ప్రొఫెసర్ వాదన ఏమిటి?
అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2లో.. ''సహజంగా జన్మించిన పౌరులు మినహా మరే వ్యక్తీ అధ్యక్ష పదవికి అర్హులు కారు'' అని చెప్తున్న వ్యాక్షలను ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ ఉటంకిస్తున్నారు.
అలాగే ''అమెరికాలో పుట్టిన వ్యక్తులందరూ.. చట్టపరిధికి లోబడిన మేరకు.. పౌరులే'' అని చెప్తున్న 14వ రాజ్యాంగ సవరణను కూడా ఆయన ప్రస్తావించారు.
కాలిఫోర్నియాలో కమలా హారిస్ పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు అమెరికా చట్టపరిధికి లోబడి ఉండకపోవచ్చునని.. అంటే ఉదాహరణకు వారు స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉండి ఉండవ్చుననే భావన మీద ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ వాదన ఆధారపడి ఉంది.
ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆయన స్టీవ్ కూలీ చేతిలో ఓడిపోయారు. స్టీవ్ కూలీని సాధారణ ఎన్నికల్లో కమలా హారిస్ ఓడించారు.
న్యూస్‌వీక్‌లో ప్రచురితమైన అభిప్రాయ వ్యాసం మీద తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అయితే.. ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ వ్యాసానికి.. 'జాతి వివక్ష వాదమైన పుట్టుక సిద్ధాంతా'నికి సంబంధం లేదని మేగజీన్ ఎడిటర్ ఇన్ చీఫ్ నాన్సీ కూపర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
ఇతర రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు?
కమలా హారిస్ అర్హత గురించి ప్రొఫెసర్ హారిస్ వాదన ''నిజంగా హాస్యాస్పద''మని మరో రాజ్యాంగ నిపుణుడు సీబీఎస్ న్యూస్ (అమెరికాలో బీబీసీ భాగస్వామి)తో చెప్పారు.
బర్కిలీ లా స్కూల్ డీన్ ఎర్విన్ చిమెరిన్‌స్కీ ఈమెయిల్ పంపిస్తూ: ''14వ సవరణలోని సెక్షన్ 1 కింద.. అమెరికాలో పుట్టిన వారు ఎవరైనా అమెరికా పౌరులే. సుప్రీంకోర్టు 1890ల నుంచీ దీనిని బలపరుస్తోంది. కమలా హారిస్ అమెరికాలో జన్మించారు'' అని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ ఈస్ట్‌మన్ వాదన ''చెత్త'' అని.. ''జాతివివక్షాపూరిత పుట్టుక వాదన'' అని డోనల్డ్ ట్రంప్ విమర్శకుడు, హార్వర్డ్ యూనివర్సిటీలో రాజ్యాంగ చట్ట ప్రొఫెసర్ లారెన్స్ ట్రైబ్ అభివర్ణించారు.
''అసలు ఇదేమిటో మనం నిజాయితీగా చూద్దాం: ఇది.. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాని ఒక నల్లజాతి అభ్యర్థి ఉన్నపుడల్లా మనం పాడే జాతివక్ష రాగం మాత్రమే'' అని లయోలా లా స్కూల్ ప్రొఫెసర్ జెస్సికా లెవిన్సన్ వ్యాఖ్యానించారు.
ఒబామా పుట్టుక సిద్ధాంతానికి ట్రంప్ ఎలా ఆజ్యం పోశారు?
డోనల్డ్ ట్రంప్ 2011లో అధ్యక్షుడు ఒబామా కెన్యాలో పుట్టి ఉండవచ్చుననే మితవాద సిద్ధాంతాలకు ఆజ్యం పోయటం ప్రారంభించారు.
ఒబామా తాను హవాయిలో పుట్టినట్లు చెప్తున్న తన జనన ధృవీకరణ పత్రాన్ని ఆ ఏడాది ఏప్రిల్‌లో చూపించినా కానీ.. అది ''మోసం'' అంటూ ట్రంప్ తన వాదనను కొనసాగించారు.
2016 సెప్టెంబర్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఒక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ట్రంప్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించారు.
ఒబామా అర్హతల మీద సందేహాలను తొలగించటం తన ఘనతేనని ఆయన చెప్పుకొచ్చారు. ''దానికి నేను ముగింపునిచ్చాను. ఒబామా అమెరికాలో పుట్టారు. అది ముగిసింది'' అని వ్యాఖ్యానించారు.
2016లో తన ఎన్నికల ప్రత్యర్థి టెడ్ క్రూజ్.. అమెరికా పౌరురాలైన తల్లికి, క్యూబాలో జన్మించిన తండ్రికి కెనడాలో పుట్టారని, కాబట్టి ఆయన అధ్యక్ష పదవికి పోటీపడటానికి అనర్హుడని ట్రంప్ వాదించారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)