టిక్‌టాక్ - ట్రంప్: నిషేధాజ్ఞలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న చైనీస్ యాప్

ప్రచురణ

చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌తో అమెరికాలోని అన్ని సంస్థలూ 45 రోజుల్లోగా లావాదేవీలు రద్దు చేసుకోవాలని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆదేశాలపై పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిక్ టాక్ సంస్థ తాజాగా హెచ్చరించింది.

తమపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేయడం తమకు "విస్మయం" కలిగించిందని టిక్ టాక్ తెలిపింది.

ఈ విషయంలో చట్టపరమైన అన్ని మార్గాలనూ పరిశీలిస్తామని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది.

చైనాతో ఆమెరికాకు విభేదాలు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఇదే తరహా ఆదేశాలను విచాట్ యాప్ మీద కూడా జారీ చేశారు.

విచాట్ యజమాని టెన్సెంట్, "ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాం" అని చెప్పారు.

జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని టిక్‌టాక్‌ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు ఇదివరకే హెచ్చరించారు. ఇప్పుడు ఆ కంపెనీ తన అమెరికా వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం ఖరారు చేసుకోవడానికి వారికి సెప్టెంబర్ 15 వరకు గడువు ఉందని కూడా ట్రంప్ ప్రకటించారు.

చిన్న వీడియోల సోషల్ వేదిక టిక్ టాక్, మెసేజింగ్ సేవలు అందించే విచాట్ కంపెనీల కార్యకలాపాలను రద్దు చేస్తూ ట్రంప్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడమన్నది చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకుంటున్న చర్యలలో తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా, చైనా కంపెనీలు తమ అకౌంట్ల వివరాలను నియంత్రణ అధికారులకు చూపించకపోతే అమెరికాలోని స్టాక్ మార్కెట్ల నుంచి వాటి పేర్లు తొలగించాలని కూడా ట్రంప్ గురువారం ఓ ప్రకటన చేశారు.

ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ

అంతకుముందు, ట్రంప్ చైనాకు చెందిన టిక్‌టాక్, వీ చాట్‌ యాప్స్ లక్ష్యంగా రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం అమెరికా సంస్థలు ఏవైనా రానున్న 45 రోజుల్లో టిక్‌టాక్, వీ చాట్‌లతో తమ లావాదేవీలు, సంబంధాలను నిలిపివేయాల్సి ఉంటుంది.

అమెరికా, చైనాల మధ్య ఇప్పటికే ఉన్న ప్రతిష్ఠంబనలను ఈ చర్య మరింత తీవ్రం చేసింది.

మరోవైపు అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

‘జాతీయ భద్రతకు ముప్పు రాకుండా’

టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

"జాతీయ భద్రత పరిరక్షణ కోసం టిక్‌టాక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని" ఆ ఉత్తర్వులో ప్రస్తావించారు.

ఈ ఆర్డర్ ప్రకారం బైట్‌డాన్స్‌తో అన్ని లావాదేవీలపైనా నిషేధం ఉంటుంది.

కాగా.. టిక్‌టాక్ యాప్‌ను చైనా నియంత్రిస్తుందని, ఇందులో నమోదయ్యే డాటా అంతా చైనాకు చేరవేస్తున్నారన్న అమెరికా ఆరోపణలను టిక్‌టాక్ ఖండించింది.

టిక్‌టాక్ మాత్రమే కాకుండా చైనాకు చెందిన మరో టెక్ దిగ్గజం ‘టెన్సెంట్ కాంగ్లోమెరేట్’కు చెందిన మెసేజింగ్ యాప్ వీచాట్‌‌తో లావాదేవీలనూ నిషేధిస్తూ ట్రంప్ గురువారం రాత్రి మరో ఉత్తర్వు జారీ చేశారు.

ట్రంప్ ఏమన్నారు?

రెండు ఉత్తర్వులలోనూ "జాతీయ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, సర్వీసెస్ రంగం సప్లయ్ చైన్ దృష్ట్యా జాతీయ అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని" ట్రంప్ అన్నారు.

"చైనాలో తయారయ్యే మొబైల్ అప్లికేషన్ల వల్ల అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉందని" ఆయన ఆరోపించారు.

రెండు ఉత్తర్వులలోనూ జాతీయ అత్యవసరాల చట్టం (నేషనల్ ఎమర్జన్సీస్ యాక్ట్), అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఇంటర్నేషనల్ ఎమర్జన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) నుంచి చట్టపరమైన అధికారాన్ని ఉదహరించారు.

టిక్‌టాక్‌లో నమోదవుతున్న డాటా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి లేదా కార్పొరేట్ గూఢచర్యం నెరపడానికి చైనాకు సహాయపడే అవకాశం ఉందని ట్రంప్ ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్నారు.

యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (అమెరికా విమానాశ్రయాల భద్రతను పర్యవేక్షిస్తుంది), యూఎస్ సాయుధ దళాలు ఇప్పటికే ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్ వాడకాన్ని నిషేధించాయి.

ఈ ఆర్డర్లపై స్పందించడానికి టిక్‌టాక్, బైట్‌డాన్స్ నిరాకరించాయి.

నేపథ్యం ఏమిటి?

టిక్‌టాక్ నిషేధించనున్నట్లు ట్రంప్ గత శుక్రవారం ప్రకటించిన తరువాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ చైనా యాప్ అమెరికా కార్యకలాపాలను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.

అమ్మకపు ధరలో గణనీయమైన భాగాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందిస్తే ఈ కొనుగోలుకు మద్దతు ఇస్తానంటూ ట్రంప్ చెప్పారు.

అయితే సెప్టెంబర్ 15 నుంచి యూఎస్లో టిక్‌టాక్‌ను నిషేధించనున్నట్టు ట్రంప్ హెచ్చరించారు.

అమెరికాలో చైనా సాంకేతికతను నిరోధించే దిశలో భాగంగా వ్యక్తిగతమైన యాప్‌లపైనా నిషేధం ప్రకటించున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపిన మర్నాడే ట్రంప్ ఈ ఉత్తర్వ్యులు జారీ చేశారు.

యూఎస్‌లో గత ఏడాది రెండు చైనీస్ కమ్యూనికేషన్ కంపెనీలు హువాయ్, జడ్‌టీఈల పై నిషేధం విధించారు.

చైనావల్లే కరోనావైరస్ వ్యాప్తి చెందుతోందని, ఈ మహమ్మరివల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని నిందిస్తూ ట్రంప్ చైనాపై వాణిజ్య పోరూ సాగిస్తున్నారు.

అమెరికాలో 8 కోట్ల మంది వాడుతున్నారు

అమెరికాలో నెలకు సుమారు 8 కోట్ల మంది టిక్‌టాక్ వాడుతున్నారు. వీరిలో 20 ఏళ్ల లోపు వయసువారే ఎక్కువ.

ప్రపంచవ్యాప్తంగా దీన్ని నెలకు 80 కోట్ల మంది వాడుతుంటారని అంచనా. భారత్, అమెరికాల్లో దీని వాడకం ఎక్కువ కాగా భారత్‌లో ఇప్పటికే నిషేధించారు.

వీచాట్(wechat) కూడా ఒక సోషల్ మీడియా యాప్. ఇది ఎక్కువగా నగదు చెల్లింపులకు, వార్తలు తెలుసుకోవడానికి, చిన్న చిన్న ప్రోగ్రాంలు రన్ చేసుకోవడానికి వాడుతుంటారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)