వైరల్ వీడియో: లైవ్‌లో పన్ను ఊడిపోయినా వార్తలు చదవటం ఆపని యాంకర్‌

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

లైవ్ టీవీకి ఎన్నో రకాల అవరోధాలు ఎదురవుతుంటాయి. సాంకేతిక సమస్యలు, అనుకోని అతిథులు.. అనూహ్యమైన ఇబ్బందులు చాలానే ఉంటాయి.

ఒకసారి లైవ్ (ప్రత్యక్ష ప్రసారం) మొదలయ్యాక రెండో టేక్ అనే మాటే ఉండదు. అది తెలిసీ ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కానీ మరీచ్కా పదాల్కో ఈ వారం వార్తలు చదువుతున్నపుడు అసాధారణ సమస్యను ఎదుర్కొన్నారు. ఆమె ఉక్రెయిన్‌లో ఓ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు.

లైవ్ న్యూస్ చదువుతుండగా ఆమె ముందు పన్ను ఒకటి ఊడిపడిపోయింది.

కానీ.. ఆమె వార్తలు చదవటం ఆపకుండానే ఆ పన్నును చేతితో పట్టుకుని తన పని కొనసాగించారు.

''నిజానికి.. ఈ విషయాన్ని ఎవరూ గమనించరని నేను అనుకున్నా'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

లైవ్‌లో తన పన్ను ఊడిపోయిన వీడియో కింద ఆమె స్పందిస్తూ.. ''కానీ ప్రేక్షకుల దృష్టిని మేం తక్కువ అంచనా వేశాం'' అని పేర్కొన్నారు.

దాదాపు పదేళ్ల కిందట తన కూతురు ఒక ఇనుప అలారం క్లాక్‌ను ఊపుతున్నపుడు అది తన పంటికి తగిలిందని అప్పుడు పన్నును బాగుచేయించుకోవాల్సి వచ్చిందని మరీచ్కా వివరించారు.

లైవ్‌లో పన్ను ఊడిపోయిన వీడియోను తమ టీవీ చానల్ మొదట యూట్యూబ్‌లో ప్రచురించకపోయినా.. తనకు లభించిన మద్దతు చాలా ఆనందపరిచిందని ఆమె పేర్కొన్నారు.

''ఎటువంటి పరిస్థితుల్లోనైనా చలించవద్దు. మళ్లీ రేపు ఉదయం కలుస్తా'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)