You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: కోవిడ్-19ను న్యూజీలాండ్ ఇంత త్వరగా ఎలా ఓడించింది? అనుసరించిన వ్యూహం ఏమిటి?
న్యూజీలాండ్‌లో జూన్ చివర్లో కేవలం 2 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దానికి ముందు 24 రోజుల పాటు ఒక్క కేసు కూడా కొత్తగా నమోదవ్వలేదు.
కానీ.. ఆ రెండు కొత్త కేసులు క్వారంటైన్ ఉల్లంఘనల వల్లే నమోదయ్యాయి. అందుకు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు న్యూజీలాండ్‌లో అన్నిరకాల సామాజిక కార్యకలాపాలూ, క్రీడా కార్యక్రమాలూ కరోనా ముందు స్థాయికి వస్తున్నాయి.
షేక్ హ్యాండ్‌లు ఇవ్వటానికి, ఆలింగనాలు చేసుకోవటానికి జనంలో సంశయం లేదు. సామాజిక దూరం పాటించకపోతే ఎలా అనే ఆందోళనా లేదు.
దేశంలో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి తిరిగివస్తోంది. ఒకవైపు మిగతా దేశాల్లో రోజూ వేలాదిగా కొత్త కేసులు నమోదవుతుంటే న్యూజీలాండ్ ఈ స్థాయిలో విజయం సాధించటం అబ్బురపరుస్తోంది.
ఇంతకీ కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ ఎలా ఓడించింది? ఎలాంటి వ్యూహం అనుసరించింది?
ఒక్క కేసూ లేక ముందే సరిహద్దుల మూసివేత
మొట్టమొదటిసారిగా చైనా వెలుపల కోవిడ్-19 మరణం సంభవించింది ఫిలిప్పీన్స్‌లో. అది ఫిబ్రవరు 2న జరిగింది.
అప్పటికి న్యూజీలాండ్‌లో ఒక్క కేసు కూడా లేదు. కానీ ఆ మర్నాడే చైనా నుంచి లేదా చైనా మీదుగా న్యూజీలాండ్‌కు వచ్చే వారిపై నిషేధం విధించారు.
చైనా నుంచి స్వదేశానికి తిరిగొచ్చేవారు మాత్రం కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ పాటించాలని నియమం తీసుకొచ్చారు.
ప్రపంచం నలుమూలలా వైరస్ వ్యాపిస్తుండడంతో ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీల నుంచి వచ్చే వారిపై కూడా నిషేధం విధించారు.
మార్చ్ 16 నాటికి దేశంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్వారంటైన్ పాటించాలని నియమం తీసుకొచ్చారు.
ప్రపంచంలోనే ఇవి అత్యంత కఠినమైన నిబంధనలని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు.
"ప్రపంచం మొత్తంలో కోవిడ్-19 కేసులు ఇంకా వేలల్లో ఉన్నప్పుడే ఇలాంటి కఠినమైన నిబంధనలు పాటించడం వలన కమ్యూనిటీ వ్యాప్తిని అరికట్టడానికి వీలైంది" అని ఆర్థికవేత్త ప్రొఫెసర్ మార్టిన్ బెర్కా బీబీసీతో చెప్పారు.
చాలా తొందరగా లాక్‌డౌన్ ప్రకటించారు
"మార్చి చివరికొచ్చేసరికి సాధారణ పద్ధతులతో, కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ మహమ్మారిని ఎదుర్కోలేమని అర్థమైపోయింది. వూహాన్ నగరంలో పూర్తి లాక్‌డౌన్ విధానం కోవిడ్-19ను అరికట్టగలిగిందంటూ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. తొలి దశలో కఠినంగా లాక్‌డౌన్ పాటించడం ఒక్కటే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మార్గమని రుజువయ్యింది. అదే విధానాన్ని న్యూజీలాండ్ అవలంబించింది" అని న్యూజీలాండ్‌లోని ప్రముఖ ఎపిడమాలజిస్ట్ ప్రొఫెసర్ మైఖేల్ బేకర్ పేర్కొన్నారు.
కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు న్యూజీలాండ్ నాలుగు దశల విధానాన్ని రూపొందించుకుంది. రెండవ దశ దగ్గర ప్రారంభించి, మార్చి 25 నాటికి నాలుగవ దశ విధానాలను అవలంబించింది.
దేశం మొత్తం పూర్తి లాక్‌డౌన్ విధించింది. అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ మూసివేయాలని పిలుపునిచ్చింది.
అప్పటికి న్యూజిలాండ్‌లో కోవిడ్-19 కేసులు 102 మాత్రమే నమోదయ్యాయి. మరణాలు సున్నా.
అదే సమయంలో లాక్‌డౌన్ విధించిన బ్రిటన్‌లో అప్పటికే 6,500 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 330 మరణాలు సంభవించాయి. యూకేలో సరిహద్దులను ఎప్పుడూ పూర్తిగా మూసివేయలేదు. దేశానికి వచ్చినవారు క్వారంటైన్ పాటించాలని మాత్రమే యూకే సూచించింది.
ఈ విషయంలో యూకే ప్రభుత్వం స్పందిస్తూ.. "మేము సరైన సమయంలో సరైన విధానాలను అవలంబించాం. అప్పటికే వైరస్ బాగా వ్యాప్తి చెంది ఉండడంతో సరిహద్దులు మూసినా పెద్ద ప్రయోజనాలు ఉండవు" అని పేర్కొంది.
"బ్రిటిష్ పద్ధతి - వైరస్ బాగా వ్యాప్తి చెందేవరకు వేచి ఉండడం, సరిహద్దులు ఎక్కువ రోజులు తెరిచి ఉంచడం వంటి విధానాలను అవలంబిస్తే సమస్య తీవ్రతరమవుతుంది. ఆరోగ్య వ్యవస్థపై పెద్ద దెబ్బ పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించే ప్రమాదం ఉంది" అంటారు బేకర్.
"ఇప్పుడు కూడా మిగతా దేశాలకన్నా న్యూజీలాండ్ ఆర్థిక వ్యవస్థ కొంచం ఎక్కువ కుంటుపడిందన్నమాట వాస్తవమేగానీ ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారు. అది ముఖ్యం" అని బేకర్ వ్యాఖ్యానించారు.
సమర్థవంతమైన కమ్యూనికేషన్
"లాక్‌డౌన్ అమలుచేయడంలో న్యూజీలాండ్ ప్రభుత్వం పూర్తి విజయం సాధించింది. వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రోజుకు 89 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి" అని ఆయన తెలిపారు.
లాక్‌డౌన్ ఉద్దేశాలను, అవసరాన్ని ప్రజల మనసుల్లోకి సమర్థవంతంగా చొప్పించగలిగారని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో టెస్టుల సంఖ్య పెంచుతూ, కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతిలో వ్యాప్తిని అరికట్టేందుకు కృషిచేశారు.
ఇప్పుడు న్యూజీలాండ్ రోజుకి 10,000 టెస్టులు నిర్వహించగలదు. పాజిటివ్ అని నిర్థారణ అయిన వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతి ద్వారా రోగులతో సాన్నిహిత్యం ఉన్నవారిని ఐసొలేషన్‌లో ఉండాలని హెచ్చరిస్తోంది.
న్యూజీలాండ్ విజయాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ఆ దేశం పాటించిన విధానాలను నమూనాగా తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు
అయితే న్యూజీలాండ్ ప్రభుత్వం అవలంబించిన విధానాలపై విమర్శలు లేకపోలేదు.
ఈ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని, దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అప్పటి ప్రతిపక్ష నాయకుడు సైమన్ బ్రిడ్జెస్ విమర్శలు గుప్పించారు.
ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం గమనించిన ప్రజలు లాక్‌డౌన్ వల్ల ఉపయోగమేమిటని ప్రశ్నించారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పుడు లాక్‌డౌన్ అవసరం లేదని కొందరు అభిప్రాయపడ్దారు.
కానీ ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ విధానాలకు మద్దతు ప్రకటించారు. లాక్‌డౌన్ సవ్యంగా జరిగి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సహాయపడ్డారు.
జూన్ 8 నాటికి కరోనావైరస్‌ను పూర్తిగా అరికట్టగలిగామని, గత 17 రోజులలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని, వైరస్ సోకినవారు కూడా పూర్తిగా కోలుకున్నారని దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
ఇప్పుడు న్యూజీలాండ్‌లో ప్రజల జీవితం సాధారణ స్థితికి వచ్చేసింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తున్నారు.
దేశంలోకి రాకపోకలు మాత్రం జరగట్లేదు. సరిహద్దులు ఎప్పుడు తెరుస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
చిన్న దేశం కావడం వల్లే ఇది సాధ్యపడిందా?
“భౌగోళికంగా న్యూజీలాండ్ ఉన్న స్థానం, తక్కువ జనాభా ఈ విజయానికి కొంతవరకూ దోహదం చేసాయని చెప్పుకోవచ్చు. కానీ అవి చిన్న ప్రయోజనాలే" అని ప్రొఫెసర్ బేకర్ అన్నారు.
“చిన్న దేశాల్లోనే కాదు న్యూజిలాండ్ పాటించిన విధానం ఎక్కడైనా సత్ఫలితాలనిస్తుంది. వియత్నాం, తైవాన్, అధిక జనాభా ఉన్న చైనాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.
"ప్రజారోగ్యం విషయంలో అమెరికా, యూకే లాంటి దేశాలన్నీ ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. కానీ కోవిడ్-19 విషయంలో మాత్రం చిన్న దేశాలు, ముఖ్యంగా ఆసియా ఖండంలోని దేశాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)