You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు పెరిగాయి.. ఎందుకు?
కరోనావైరస్ మహమ్మారి వలన ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపారాలు మూతపడినప్పటికీ కాస్మొటిక్ సర్జరీకి మాత్రం గిరాకీ పెరిగింది. ప్రపంచంలో అనేకచోట్ల ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్ తెరిచే ఉంచారని, ట్రీట్మెంట్ చేయించుకునేవాళ్ల తాకిడి పెరిగిందనీ రిపోర్టులు చెప్తున్నాయి.
యూఎస్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో లాక్‌డౌన్ సమయంలో కాస్మొటిక్ సర్జరీ క్లినిక్స్‌లో ట్రీట్మెంట్ చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
పెదవులు, ముక్కు సరిచేసుకోవడం, ముడతలు తీయించుకోవడం, ఫేస్ లిఫ్ట్ లాంటి సర్జరీలన్నీ చేయించుకుంటున్నారు.
ఆరోన్ హెర్నాండెజ్ పెదవులు, చెంపలు సరిచేయించుకున్నారు. అతను బీబీసీతో మాట్లాడుతూ... "లాక్‌డౌన్ సమయంలో సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే కోలుకోవడానికి నాకు తగినంత సమయం దొరుకుతుంది".
"సాధారణంగా మగవాళ్లు పెదవులు సరిచేయించుకోరు. నేను సర్జరీ చేయించుకున్నానంటే నన్ను అందరూ అదోలా చూసే అవకాశం ఉంది. అందుకని నేను ఇంట్లో ఉన్నప్పుడే సర్జరీ చేయించుకుంటే, పూర్తిగా కోలుకున్నాక బయటకి వెళ్లొచ్చు. అప్పుడు నేనేం చేయించుకున్నానో ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎవరికీ తెలీదు. లాక్డౌన్ నాకు ఆ అవకాశమిచ్చింది" అన్నారు.
కరోనావైరస్‌కు ముందు కూడా హెర్నాండెజ్ పెదవులకు సర్జరీ చేయించుకున్నారు. అప్పుడు బయటకి వెళ్లక తప్పింది కాదు. పెదవులపై కుట్లు, వాచిపోయి ఉండి బయటకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు.
రోడ్ జే రోహ్రిక్ టెక్సాస్‌లో కాస్మొటిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. "ట్రీట్మెంట్ చేయించుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మామూలురోజులకన్నా చాలా ఎక్కువగా ఉంది. మేము కావాలనుకుంటే వారంలో ఆరు రోజులు సర్జరీ చెయ్యొచ్చు. అంత డిమాండ్ పెరిగింది" అని బీబీసీతో చెప్పారు.
ఇంతకుముందైతే సర్జరీ చేయించుకున్నాక కోలుకునేంతవరకూ పనులన్నీ మానుకుని ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇంట్లోంచే పనిచేస్తున్నారు అని రోహ్రిక్ అన్నారు.
"ఫేస్‌లిఫ్ట్ లాంటి సర్జరీలు చేయించుకున్నప్పుడు కొంతకాలం మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో ఎలాగూ మాస్క్ వేసుకోవాలి. బయటకి ఎక్కువగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మెల్లిగా కోలుకోవచ్చు. ఈ మహమ్మారి తరువాత ప్రజలు తమ సాధారణ జీవితాలను ప్రారంభించాలి అనుకుంటున్నారు. తమ అందాన్ని పెంచుకోవాలనుకోవడం కూడా అందులో ఒక భాగమే" అని రోహ్రిక్ అన్నారు.
సౌత్ కొరియా కాస్మొటిక్ సర్జరీలకు పేరుగాంచిన దేశం. ఇది కరోనావైరస్ సోకిన మొట్టమొదటి దేశాల్లో ఒకటి. వైరస్ వ్యాప్తి తరువాత సౌందర్య చికిత్సకోసం బయట దేశాలనుంచి వచ్చేవారి సంఖ్య తగ్గినా స్థానిక ప్రజల రద్దీ బాగా పెరిగింది.
54 ఏళ్ల ఒక స్కూలు టీచర్ ఫిబ్రవరిలో కనురెప్పలకి సర్జరీ చేయించుకున్నారు. "నేను వెళ్లి చూసిన ప్రతీ క్లినిక్ జనాలతో నిండిపోయి ఉంది" అని జూంగాంగ్ పత్రికకు తెలిపారు.
సియోల్‌లో బీకే హాస్పిటల్ సిబ్బంది బీబీసీతో మాట్లాడుతూ "వైరస్ వచ్చిన కొత్తల్లో ప్రజలు కంగారుపడ్డారు. కానీ మెల్లి మెల్లిగా కాస్మొటిక్ సర్జరీ క్లినిక్‌కు రావడం మొదలుపెట్టారు" అన్నారు.
"కోవిడ్-19 ఉన్నప్పటికీ సర్జరీ చేయించుకోవడానికి ప్రజలు వెనుకాడలేదు. మా క్లినిక్ సురక్షితం అనే భావించారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ట్రీట్మెంట్ చేయించుకున్నవారి సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది" అని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
జపాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించలేదుగానీ ప్రజలంతా వారి వారి ఇళ్లకే పరిమితమవుతూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని వారి ప్రధాని పిలుపునిస్తూ ఎమర్జెన్సీ ప్రకటించారు.
అయితే ఈ ఎమర్జెన్సీ సమయంలో కూడా కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవడానికి అక్కడి ప్రజలు వెనుకాడలేదు.
ఇలా విపరీతంగా పెరిగిన డిమాండ్ చూసి జపాన్ అసోసియేషన్ ఆఫ్ ఆస్థటిక్ మెడిసిన్ "ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం నిత్యావసరం కాదు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు కాస్మొటిక్ సర్జరీల ఆలోచన చేయకూడదని" హెచ్చరిక జారీ చేసింది.
ప్లాస్టిక్ సర్జరీకి ఎక్కువరోజులు హాస్ఫటిల్ లో ఉండక్కర్లేదు. సర్జరీ జరిగినరోజే ఇంటికి వెళిపోవచ్చు. ముఖ్యంగా సర్జరీ ముఖంతో ఆఫీసుకి వెళ్లక్కర్లేదు. ఇంట్లో ఉండి పని చేస్తూ, చక్కగా కోలుకున్నాక బయటకి వెళ్లొచ్చు. ఈ కారణాలవల్ల చాలా దేశాల్లో లాక్‌డౌన్ సమయంలో కాస్మొటిక్ సర్జరీలు పెరిగాయి.
అయితే క్లినిక్స్‌లో పెరిగిన రద్దీ వలన వైరస్ వ్యాప్తి అధికమవుతుందనే భయం ఉన్నప్పటికీ కాస్మొటిక్ సర్జరీకి ఇదే అనువైన సమయం అని హెర్నాండెజ్‌లాంటి వాళ్లు భావిస్తున్నారు.
"లాక్‌డౌన్ వల్ల సర్జరీ తరువాత ఇంట్లోనే ఉంటూ నేను సుఖంగా కోలుకోగలిగాను. సరైన సమయానికి మందులు వాడుతూ, ఎక్కువసార్లు ఐసుముక్కలు రుద్దుకుంటూ చక్కగా కోలుకున్నాను. మామూలు రోజుల్లో అయితే ఇంత అవకాశం ఉండేది కాదు" అని హెర్నాండెజ్ అన్నారు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?
- పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?
- బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం
- కరోనావైరస్ మృతులను జేసీబీలతో ఎందుకు ఖననం చేస్తున్నారు?
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)