డోనల్డ్ ట్రంప్‌ ఆదేశాల ప్రభావం అమెరికాలోని భారతీయ విద్యార్థులపై ఎలా ఉంటుంది?

    • రచయిత, వినీత్ ఖ‌రే
    • హోదా, బీబీసీ ప్ర‌తినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అకడమిక్ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్న విద్యార్థుల వీసాలన్నింటినీ రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులంతా షాక్‌కు గురయ్యారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉంటూ, అకడమిక్‌ కోర్సులను ఆన్‌లైన్‌ చదువుతున్నవారంతా అమెరికాను విడిచివెళ్లాలి, లేదా పూర్తిగా ఆన్‌లైన్‌ కాని కోర్సులకు, హాజరు తప్పనిసరయ్యే కోర్సులకు మారాలి

కొత్త నిబంధనతో ఎఫ్-1, ఎం-1 క్లాస్ వీసాపై అమెరికా వెళ్లే విద్యార్థులపై ప్రభావం పడుతుంది. అమెరికాలో ఏదో ఒక సబ్జెక్టు లేదంటే ఒకేషనల్ కోర్సు చేస్తున్న విద్యార్ధులందరికీ ఈ నియమం వర్తిస్తుంది.

“ప్రభుత్వ ఆదేశాలను పాటించని విద్యార్థులను దేశం నుంచి పంపించివేస్తారు’’ అని కొత్త నియమం హెచ్చరిస్తోంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

స్థానిక మీడియాలో ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం, “అమెరికాలో ఉన్నత విద్య గురించి ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తికి కూడా జూలై మధ్యలో ఒక ఆన్‌లైన్‌ కోర్సుల నుంచి ఆఫ్‌లైన్‌ కోర్సులకు మారడం కష్టమని తెలుస్తుంది’’ అని అభిప్రాయపడ్డాయి.

అయినా సరే, అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులు ఆన్‌లైన్‌ కోర్సుల నుంచి ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నించాలి’’ అని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్ కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్ విద్యార్ధులకు సూచించింది.

"విదేశీ విద్యార్థులను మా దేశ విశ్వవిద్యాలయాలలోకి అనుమతించడం ద్వారా అమెరికన్లు కాని వారిని అమెరికాకు అనుకూలురుగా మార్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వారిని అమెరికా వ్యతిరేకులుగా మారుస్తున్నట్లు ఉంది" అని కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్‌ ట్విటర్‌లో విమర్శించారు.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌లో విజ్జప్తులు మొదలయ్యాయి. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విదేశీ విద్యార్ధులను వారి దేశాలను బలవంతంగా పంపడం సరికాదని అందులో వారు అంటున్నారు.

2020-21 విద్యా సంవత్సరంలో తమ యూనివర్సిటీ కోర్సులన్నింటినీ ఆన్‌లైన్‌కు మారుస్తున్నట్లు హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. అయితే స్థానిక మీడియా ప్రచురించిన కథనాల ప్రకారం ప్రభుత్వం నిర్ణయంపై యూనివర్సిటీ ప్రెసిడెంట్ ల్యారీ బెకో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంతమంది విద్యార్ధులపై ప్రభావం పడుతుందన్న దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలుర్ బైటికి రాలేదు.

భారత్, చైనా విద్యార్ధులపై ప్రభావం

భారత్‌, చైనాల నుంచి అమెరికాకు చాలామంది విద్యార్థులు వస్తుంటారు. ఒక అంచనా ప్రకారం 2018-19 సంవత్సరంలో సుమారు 10లక్షలమంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుకోడానికి అమెరికా చేరుకున్నారు. అందులో సుమారు 3లక్షల 72వేలమంది విద్యార్థులు చైనీయులు కాగా, సుమారు 2లక్షలమంది భారతీయ విద్యార్ధులున్నారు. "పరిస్థితి చాలా ఉద్రిక్తంగా, గందరగోళంగా ఉంది. దీని ప్రభావం మాపై ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. విద్యార్థులందరూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. వారి ప్రొఫెసర్లను కూడా అడుగుతున్నారు" అని హార్వర్డ్ యూనివర్సిటీలో సోషల్ ఆంథ్రోపాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న అపర్ణ గోపాలన్ అన్నారు.

"నా కలలను నెరవేర్చుకోడానికి స్నేహితులను, కుటుంబాన్ని, దేశాన్ని వదిలి ఇక్కడకు వచ్చాను. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. ఐసీఈ నిర్ణయం నా గుండెను బద్ధలు చేసింది. ఇప్పుడు నేను పడినశ్రమ అంతా వృథా" అని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న పాకిస్తాన్ విద్యార్థి సయీద్ అలీ వాపోయారు.

లాహోర్‌కు చెందిన మహ్మద్ ఇహాబ్ రసూల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ కోర్సు చదువుతున్నాడు."ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో ఎవరికీ తెలియదు. విద్యార్ధుల్లో చాలా ఆందోళన ఉంది. ఆన్‌లైన్‌ కోర్సులు స్వదేశం నుంచే చదవాలన్న ఐసీఈ నిర్ణయం సరికాదు’’ అని రసూల్ వ్యాఖ్యానించారు.

" మా దేశానికి, అమెరికాకు సమయంలో చాలా తేడా ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ సమస్య కూడా ఉంది. పాకిస్తాన్‌లో విద్యుత్తు సమస్య కూడా అధికమే. ఇక ఇప్పుడు కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించి ఉంది. ఈ పరిస్థితుల్లో స్వదేశానికి వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు’’ అని రసూల్ అభిప్రాయపడ్డారు.

రసూల్‌ సోదరుడు, సోదరి కూడా అమెరికాలోనే చదువుకుంటున్నారు. కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని దేశంలోని విదేశీయులు సంఖ్యను అదుపు చేయడనికి ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని చాలామంది అభివర్ణిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో సుమారు 1లక్షా 30మంది వరకు మరణించారు. ఆ దేశంలోని అనేక రాష్ట్రాలలో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది.

చైనాను కలవరపెట్టే నిర్ణయం

కొన్నిరకాల గ్రీన్ కార్డులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో నిషేధించారు. 2020 చివరి వరకు నాన్‌ ఇమ్మిగ్రెంట్ హెచ్-1బి, జె -1, ఎల్ వీసాల జారీని నిలిపేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. " ఇది విదేశీయులను ఇష్టపడని జెనోఫోబియా తరహా ఆలోచన. దీని వెనుక ఆర్థిక తర్కం లేదు" అని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది సైరస్ మెహతా అన్నారు.

“చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని మరో లాయర్‌ మాథ్యూ కోల్కెన్‌ అన్నారు. గత కొద్దినెలలుగా అమెరికా, చైనా దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర ఆగ్రహంతో ఉంది.

అమెరికాలో కరోనా వ్యాధివ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మార్చి-ఏప్రిల్‌ నెలల నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని అమెరికాలోని పలు విద్యాసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

"అంతర్జాతీయ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులను నిషేధించారు. కానీ ఆన్‌లైన్ విద్యను మాత్రమే అందించే కాలేజీలను,యూనివర్సిటీలను అంతర్జాతీయ విద్యార్థులు ఎంచుకోరని గమనించాలి’’ అని న్యాయవాది సైరస్ మెహతా వ్యాఖ్యానించారు.

కోవిడ్-19 కారణంగా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించే స్టూడెంట్ అండ్‌ ఎక్చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రాం కింద విదేశీ విద్యార్ధులు అమెరికాలో ఉంటూ 2020 సమ్మర్‌ వరకు ఆన్‌లైన్‌ కోర్సులు చదవడానికి అనుమతించారు.

ఒకపక్క అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ సమయంలో అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా తన వైఖరిని మార్చుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

విద్యా సంస్థల మీదా ప్రభావం

ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వు ఇప్పటికే వీసాలు జారీ అయిన, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న, రెగ్యులర్ కోర్సులో చేరి సెమిస్టర్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉన్న విద్యార్ధులపై కూడా ప్రభావం చూపుతుంది. "ఇది విశ్వవిద్యాలయాలు, విద్యార్థులకంటే స్థానిక సొసైటీలను ఎక్కువగా ప్రభావితం చేసే నిర్ణయమని నేను భావిస్తున్నాను" అని మాథ్యూ కోల్కెన్‌ అన్నారు. “ఇక్కడ అద్దె ఇళ్లపై ఆధారపడి జీవించే స్థానికులపై, విద్యార్థులపై ఆధారపడే చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతుంది.’’ అని మాథ్యూ చెప్పారు.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యాసంస్థలపైనా పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. "అన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లలో అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటాయి. ఈ విద్యార్థులు పూర్తి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి రావడమే దీని ప్రధాన కారణం. అమెరికన్ విద్యార్థులను చేర్చుకుంటే వారికి ఫీజుల్లో మినహాయింపు ఇవ్వాలి. చాలా అమెరికన్ యూనివర్సిటీలు నిధుల కోసం ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థులపైనే ఆధారపడతాయి " అని న్యాయవాది సైరస్‌ మెహతా అన్నారు.

ఒక అంచనా ప్రకారం అమెరికన్ కాలేజీలు, యూనివర్సిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల వల్ల 2018-19 విద్యా సంవత్సరంలో సుమారు 41బిలియన్ల డబ్బు యూనివర్సీటీలకు, కాలేజీలకు అందింది. ఈ సంపద అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో 4,558,000 ఉద్యోగాలను సృష్టించడానికి సహాయ పడింది.

అమెరికా వెలుపల ఉన్న విద్యార్ధులపై కూడా దీని ప్రభావం పడుతుంది. బ్రౌన్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి, బంగ్లాదేశ్‌ నివాసి శ్వేతా మజుందార్ "హైబ్రిడ్ మోడల్ స్కూల్‌లో చదువుతున్న, యుఎస్ వెలుపల ఉన్నవారు, క్లాసుల్లో పాల్గొనడానికి అమెరికాకు రావాల్సి ఉంటుంది" అని చెప్పారు.

హైబ్రిడ్‌ మోడల్‌ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో కొన్ని తరగతులకు అటెండ్‌ కావాలి. కొన్నిసార్లు క్యాంస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పుడుక్లాసులకువెళ్లడంతప్పనిసరి

కరోనా కారణంగా తిరిగి రానివ్వరన్న భయంతో శ్వేతా అనే విద్యార్ధిని ఈసారి సెలవులకు స్వదేశానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుతున్న శ్వేత స్నేహితురాలు అంచితా దాస్‌గుప్తా మాత్రం కరోనా భయంతో కోల్‌కతాకు తిరిగి వచ్చారు. "కొత్త ఆర్డర్ ప్రకారం, మేము హైబ్రిడ్ మోడల్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ కనీసం ఒక క్లాసుకైనా కాలేజీకి వెళ్లాల్సి ఉంది. అంటే నేను అమెరికాకు వెళితే మా హాస్టల్‌లో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు పర్మిషన్‌ ఉండదు. మేం కచ్చితంగా క్లాసులకు హాజరు కావాలి. ఇది మాకు ఇబ్బందికరమైన పరిస్థితి’’ అని కోల్‌కతాలో ఉన్నఅంచిత బీబీసీతో అన్నారు. "అమెరికాలోని నా స్నేహితులు చాలామంది ఈ నిబంధనలు పట్టించుకోకుండా ఉన్నారు. నేను అమెరికాకు తిరిగి వచ్చి వారితో కలిసిపోతే అది నాకు ప్రమాదకరం కావొచ్చు. ఇప్పుడు నేను ఒక సెమిస్టర్‌ను వదిలేసి, ఆరు నెలల తర్వాత నా కోర్సును పూర్తి చేస్తాను. అమెరికాలో ఉంటూ చదువుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం" అన్నారామె.

ట్రంప్‌ నిర్ణయంపై అంచిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. “ఇప్పుడు మా ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం, రెండోది కోర్సును వదలివేయడం. బ్రౌన్‌ యూనివర్సిటీ హైబ్రిడ్ మోడల్‌నే అనుసరిస్తే, మేం వెనక్కి రావాల్సిందే" అని ఆమె అన్నారు. ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎన్నుకోవడం అంచితా లాంటి అనేకమంది విద్యార్ధులకు చాలా కష్టం.

కొత్తగా వచ్చిన నిబంధనలను పాటించకపోతే విద్యార్ధులను అదుపులోకి తీసుకోవచ్చని కూడా నిపుణులు అంటున్నారు. అదే జరిగి ఆ విద్యార్థిని బలవంతంగా తిప్పి పంపిస్తే భవిష్యత్తులో అతను అమెరికాలో ప్రవేశించే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.

ఈ వీసా ఉత్తర్వుల రాజ్యాంగబద్ధతను కోర్టులో సవాలు చేయవచ్చు. కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు న్యాయవాది మాథ్యూ కోల్కెన్. “ఈ నిర్ణయం ద్వారా ట్రంప్‌ ప్రభుత్వం ఇస్తున్న సందేశం ఏంటంటే, అమెరికాలో ఇతర దేశాల వారికన్నా ఆ దేశంవారికే ఎక్కువ హక్కులున్నాయని నిరూపించడం’’ అని మాథ్యూ కోల్కెన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)