You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు కరోనా కష్టాలు... టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు కోవిడ్-19
జూన్ 28న ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉండగా పాకిస్థాన్ జట్టులో పదిమంది ఆటగాళ్లకు కరోనా సోకడం సంచలనంగా మారింది. ఇటీవలే ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలగా, తాజాగా మరో ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో వాసీమ్ ఖాన్ మంగళవారంనాడు వీడియో లింక్ ద్వారా మీడియాకు తెలిపారు.
మహ్మద్ హఫీజ్, వహబ్ రియాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హస్‌నెన్, ఫకార్ జమాన్, ఇమ్రాన్‌ఖాన్, కషిఫ్‌బట్‌లతోపాటు టీమ్‌కు సాయంగా ఉండే మరో అధికారి మలాంగ్ అలీ కూడా తాజాగా వైరస్ బారిన పడిన వారిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతున్న పాకిస్థాన్ టీమ్‌లోని 29మంది సభ్యుల్లో 10మంది ఇప్పుడు వైరస్ కోరల్లో చిక్కుకున్నట్లయింది.
యథావిథిగా ఇంగ్లండ్ టూర్
టూర్ యథావిధిగా కొనసాగుతుందని, 28న పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ బయలుదేరుతుందని వాసిమ్ ఖాన్ తెలిపారు. పాజిటివ్‌గా తేలిన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నారని, వారు నెగిటివ్‌గా తేలిన తర్వాత జట్టులో చేరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ‘‘ఇది మాకు కష్టకాలం. కానీ ఇంగ్లాండ్ టూర్ వెళ్లడం చాలా అవసరం. ఎందుకంటే క్రికెట్‌ను మళ్లీ బతికించాలి. రాబోయే 18నెలల్లో క్రికెట్, కరోనా కలిసి ఉంటాయి’’ అని వాసిమ్ ఖాన్ అన్నారు.
తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే బోర్డుకు తెలపాల్సిందిగా ఆటగాళ్లకు సూచించినట్లు వాసిమ్ ఖాన్ తెలిపారు. అయితే అలా వెల్లడించని ఆటగాళ్ల మీద ఎలాంటి చర్యలుండవని కూడా చెప్పారు. సోమవారం రోజు పాకిస్థాన్ జట్టులోని 28మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
రెండుదశల్లో జట్టు సభ్యులకు కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించగా, రెండోదశలో జూన్ 25న మరోసారి ఆటగాళ్లకు టెస్టులు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వచ్చిన వారిని జూన్ 28న విమానంలో మాంఛెస్టర్‌కు బయలుదేరతారు.
షోయబ్ మాలిక్ జూన్ 24నే ఇంగ్లాండ్ చేరుకోగా ఆయనతోపాటు, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌కు, ఫిజియో క్లిఫ్ డీకాన్‌కు తర్వాత టెస్టులు నిర్వహిస్తామని పీసీబీ వెల్లడించింది. వీరిద్దరికీ తర్వాత టెస్టులు నిర్వహించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇంగ్లాండ్‌లో పాటించాల్సిన కరోనా నిబంధనలేంటి ?
ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరిన తర్వాత జూన్ 29న మరోసారి అందరికీ టెస్టులు జరుగుతాయని, నెగెటివ్‌గా తేలినవారే ప్రాక్టీస్‌కు వెళ్లాల్సి ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పోర్ట్స్ సైన్సెస్ అండ్ మెడిసిన్స్ డైరక్టర్ డాక్టర్ సొహైల్ సలీమ్ చెప్పారు.ప్రతివారం ఆటగాళ్లందరికీ టెస్టులు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
ఆట మధ్యలో ఎవరవైనా పాజిటివ్‌గా తేలితే ఆ ఆటగాడిని ఐసోలేషన్‌కు పంపుతామని, వరసగా రెండు టెస్టుల్లోనూ పాజిటివ్ వస్తే అతన్ని ఇంటికి పంపే అవకాశం ఉందని డాక్టర్ సలీమ్ వెల్లడించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమ్‌లో ఒక్కరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసినా అందరికీ టెస్టులు చేస్తామని డాక్టర్ సలీమ్ చెప్పారు.
జట్టు సభ్యులు బోర్డు అనుమతి లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలవడం, రూమ్ దాటి బైటికి వెళ్లడం కుదరదని, ఈ మేరకు బ్రిటీష్ గవర్నమెంట్ విధించిన నిబంధనలను వాటిని అందరూ పాటించాల్సిందేనని సలీమ్ అన్నారు.
వెస్టిండీస్-ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. కాకపోతే వెస్టిండీస్ టీమ్‌లో ఎవరికీ పాజిటివ్‌గా తేలలేదు.
'క్షమించండి, నా వల్లే మీకు వైరస్ సోకింది' :జకోవిచ్
తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే, తన టోర్నమెంటులో పాల్గొని కరోనావైరస్ బారిన పడిన ముగ్గురు ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పారు వరల్డ్ నెంబర్ టెన్నిస్‌స్టార్ నోవాక్ జకోవించ్ . గిగార్ దిమిత్రోవ్, బోర్నా కొరిక్, విక్టార్ ట్రోయికీ అనే ముగ్గురు ఆటగాళ్లు జకోవిచ్ ఆధ్వర్యంలో జరిగిన ఆడ్రియా టూర్ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు. తన తొలి మ్యాచ్‌లో ఆయన సెర్బ్ ట్రోయికితో ఆడారు.
ఈ టోర్నమెంట్ విషయంలో కాస్త తొందరపడ్డామని ట్విటర్‌లో రాశారు జకోవిచ్. ‘’ ఈ టోర్నమెంట్ వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నేను చింతిస్తున్నాను’’ అన్నారాయనన. దీన్ని సహృదయంతో, మంచి ఉద్దేశంతో నిర్వహించామని, అన్ని ఆరోగ్య నిబంధనలు పాటించామని ఆయన చెప్పారు. ‘’ఇది తొందరపాటని అర్ధమైంది’’ అని జకోవిచ్ చెప్పుకొచ్చారు.
జకోవిచ్‌తోపాటు మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలడంతో టోర్నమెంట్‌లో తరువాతి మ్యాచ్‌లను రద్దు చేశారు. ‘’ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ వ్యాధిని మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అందరూ కోలుకోవాల్సిన ఉంది’’ అని జకోవిచ్ అన్నారు. ‘’ ఈ టోర్నమెంట్ మనకు ఒక పాఠం’’ అన్నారు బ్రిటన్‌కు చెందిన ఆండ్రీ ముర్రే.
‘’ఇదొక పిచ్చిపని ‘’ అని అభివర్ణించారు ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్గియోస్.
అంతకు ముందు జకోవిచ్ కొందరు టెన్నిస్ ప్లేయర్లతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో సామాజిక దూరం పాటించకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా బాస్కెట్ బాల్ ఆడుతున్నట్లు కనిపించింది.
కరోనా మహమ్మారి కారణంగా గత కొన్నాళ్లుగా ఏటీపీ టోర్నమెంట్లు జరగడం లేదు. అయితే ఆడ్రియా టూర్ కాంపిటిషన్ ఏటీపీ టోర్నమెంట్ కాకపోయినప్పటికీ కరోనా లాక్‌డౌన్ ఎత్తివేశాక మొదలైన తొలి టోర్నమెంట్ ఇది. ‘‘వైరస్ బలహీనపడినందున ప్రమాదం లేదన్న భరోసాతో ఈ టోర్నమెంటును ప్రారంభించాం, కానీ వైరస్ ఇంకా ఉందని తేలింది’’ అని జకోవిచ్ తన వెబ్‌సైట్‌లో ఒక స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేశారు.
‘’నా వల్ల జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నిబంధనలకు అనుగుణంగా నేను 14 రోజులు ఐసోలేషన్‌లో ఉంటాను’’ అని జకోవిచ్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- హెచ్1 బి వీసాలు: ట్రంప్ ఆదేశాలతో భారతీయులకే పెద్ద దెబ్బ... ఎందుకు?
- చైనా నుంచి 70 శాతం బల్క్ డ్రగ్స్ దిగుమతి చేసుకోకుండా భారత్ ఉండగలదా?
- రష్యా అధ్యక్షుడిగా పుతిన్ జీవితాంతం ఉండిపోతారా? రిఫరెండం ఉద్దేశం ఏమిటి?
- గల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణపై ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ..
- భారత్, చైనా చర్చలు: బలగాల ఉపసంహరణకు అంగీకారం
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- ముంబయిలోని మురికివాడ ధారావిలో కరోనాను ఎలా కంట్రోల్ చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)