చింతామణి: సుబ్బిశెట్టి పాత్రపై అభ్యంతరాలుంటే చర్యలు తీసుకోవాలి.. మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా - ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న : ప్రెస్ ‌రివ్యూ

ప్రచురణ

చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఈ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. సుబ్బిశెట్టి పాత్రపై అభ్యంతరాలుంటే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి తప్ప మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా వ్యాఖ్యానించింది.

నాటకానికి ఆధారమైన పుస్తకాన్ని నిషేధించనప్పుడు నాటక ప్రదర్శనను ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది.

వందేళ్లుగా కొనసాగుతున్న నాటక ప్రదర్శనను రాత్రికి రాత్రి ఎలా నిషేధిస్తారని నిలదీసింది. వినతుల ఆధారంగా నిషేధించుకుంటూ పోతే ఏ నాటకాలు, సినిమాలూ మిగలవని పేర్కొంది.

ప్రదర్శనను ఏ కారణంతో నిషేధించారో ఉత్తర్వుల్లో పేర్కొనలేదని, ఏ వినతి ఆధారంగా నిషేధం విధించారో ఆ వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ క్రియేటివ్‌ అండ్‌ కల్చర్‌ కమిషన్‌ సీఈవో, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడికి నోటీసులు జారీచేసింది.

కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చినట్లు పత్రిక వివరించింది.

అండర్-19 ఫైనల్లో టీమిండియా

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరిందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్‌ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్‌ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది.

ఫలితంగా భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్‌ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్‌ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్‌ తాంబే, అంగ్రిష్‌లు చెరో వికెట్‌ తీశారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు యష్‌ ధుల్‌ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్‌), షేక్‌ రషీద్‌ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచారు.

ధుల్‌ 64 బంతుల్లో, రషీద్‌ 78 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు.

ఈ జోడీని విడదీయడానికి ఆసీస్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. విట్నీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టిన ధుల్‌ 106 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు.

పార్ట్‌నర్‌షిప్‌ 200 పరుగులు దాటిన తర్వాత 46వ ఓవర్లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయ్యారు.

విట్నీ వేసిన చివరి ఓవర్లో భారత్‌ వరుసగా 4, 6, 1, 6, 4, 6తో ఏకంగా 27 పరుగులు రాబట్టింది. దినేశ్‌ బానా ఆడిన 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఫైనల్లో భారత జట్టు.. ఇంగ్లండ్‌తో తలపడనుందని సాక్షి రాసింది.

తాగుబోతు కొడుకును చంపిన తండ్రి

తెలంగాణలోన సూర్యాపేట జిల్లాలో ఒక తండ్రి తాగుబోతు కొడుకును చంపినట్లు వెలుగు దిన పత్రిక వార్త కథనం ప్రచురించింది.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కీతవారి గూడెంలో రోజూ తాగి వస్తూ, ఇంటి బాధ్యతల్ని పట్టించుకోకుండా గొడవలు పెట్టుకోడమే పనిగా పెట్టుకున్న ఓ కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు.

స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన యల్లావుల రాములు(62), భూలక్ష్మి(55)లకు ఇద్దరు పిల్లలు.

బిడ్డకు పెండ్లి చేసి పంపించారు. కొడుకు నాగరాజు(30)కు పెండ్లయి తొమ్మిదేండ్ల కొడుకు కూడా ఉన్నాడు. నాగరాజు భార్య ఈమధ్యే చనిపోయింది.

నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్లేవాడు. అయితే వచ్చే డబ్బులన్నింటినీ ఇంట్లో ఇవ్వకుండా తాగుడుకే పెట్టేవాడు.

దీంతో నాగరాజు తల్లి భూలక్ష్మి హోటల్లో పనిచేస్తూ వచ్చే జీతంతో మనవడిని చూసుకుంటోంది. ఈ విషయం గురించి నాగరాజుకు ఎన్నిసార్లు చెప్పినా మారలేదు.

దీంతో కొడుకు నాగరాజుపై ఆగ్రహంతో ఉన్న తండ్రి రాములు మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. పడుకుని ఉన్న నాగరాజును గొడ్డలితో నరకడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

అయితే రాత్రికిరాత్రే కొంతమంది సాయంతో నాగరాజు డెడ్ బాడీకి దహన సంస్కారాలు నిర్వహించారు.

బుధవారం ఉదయం గ్రామంలో అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా వీఆర్ఏ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో రామయ్యతోపాటూ మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ సీఐ తెలిపారు.

రామయ్య పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలిస్తున్నామని గరిడేపల్లి పోలీసులు తెలిపారని పత్రిక వివరించింది.

కొత్త రాజ్యాంగంపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం-మందకృష్ణ

కొత్త రాజ్యాంగం అవసరమన్న కేసీఆర్‌తో ఆ విషయంపై చర్చకు సిద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నట్లు ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది.

దేశానికి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అవసరం లేదని, కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు సరికాదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఈ విషయంపై చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారని.. తానూ ఆయనతో చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

బుధవారం ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'ఈ విషయంలో నువ్వు కానీ, నీ కుటుంబ సభ్యులు, నీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల రూపంలో ఉన్న తాబేదార్లు ఎవరొచ్చినా.. మేం చర్చకు సిద్ధం. మీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు ఎవరు వస్తారో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పండి' అని డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరమైతే సవరణలు చేసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారని.. కేసీఆర్‌ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)