You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘బార్‌లో అద్దం వెనుక సీక్రెట్ రూమ్, లోపల 17 మంది అమ్మాయిలు’- ప్రెస్ రివ్యూ
ముంబయిలో ఒక బార్‌లో తనిఖీలు చేసిన పోలీసులు లోపల ఒక అద్దం వెనుక ఉన్న రహస్య గదిలో 17 మంది అమ్మాయిలను గుర్తించారని వెలుగు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ముంబయిలోని అంధేరీ ప్రాంతం. అక్కడి ఓ బార్‌లో మహిళా డ్యాన్సర్లతో నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
దాని ఆధారంగా బార్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కానీ బార్ గర్ల్స్ ఎవరూ కనిపించలేదు.
అక్కడి నుంచి వెనుదిరిగిన పోలీసుల్లో ఒకరికి వచ్చిన అనుమానం 17 మంది డ్యాన్సర్లను బార్ యాజమాన్యం చెర నుంచి విడిపించిందని పత్రిక రాసింది.
అంధేరీలోని దీపా బార్ ఎక్స్సైజ్ నియమ నిబంధనలు పాటించడం లేదని ఓ ఎన్జీఓ ముంబై పోలీసులకు కంప్లైంట్ చేసింది.
అక్కడ బార్ గర్ల్స్‌తో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో బార్‌లో తనిఖీలు ప్రారంభించారు.
కిచెన్, స్టోర్ రూమ్, బాత్రూమ్ ఇలా దేన్నీ వదలకుండా ప్రతి చోటా వెతికారు. కానీ డ్యాన్సర్ల జాడ మాత్రం కనిపించలేదు. బార్ మేనేజర్, వెయిటర్లను ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
స్టేషన్‌కు తిరిగి వెళ్లిన అనంతరం ఓ పోలీసుకు బార్‌లో ఉన్న ఒక పెద్ద అద్దంపై అనుమానం వచ్చింది. దాంతో ఖాకీలు ఆదివారం తెల్లవారుజామున మరోసారి బార్‌కు వెళ్లారు.
మేకప్ రూంలో ఉన్న పెద్ద అద్దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో సుత్తితో పగలగొట్టారు.
ఆ అద్దం వెనుక వారికి ఓ ఎలక్ట్రానిక్ డోర్ కనిపించింది. అది ఓపెన్ చేసి చూడగా.. ఏసీ, బెడ్స్ సహా సకల సదుపాయాలు కలిగిన సీక్రెట్ రూంలో 17 మంది బార్ గర్ల్స్ కనిపించారు.
డ్యాన్సర్లతో పాటు చట్ట విరుద్దంగా వారితో నృత్యాలు చేయిస్తున్న బార్ మేనేజర్, క్యాషియర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారని పత్రిక వివరించింది.
రోహిత్ శర్మకు గాయం, దక్షిణాఫ్రికా సిరిస్‌కు దూరం
గాయపడ్డ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు సాక్షి దిన పత్రిక వార్త ప్రచురించింది.
ఆస్ట్రేలియాలో రెండు వరుస టెస్టు సిరీస్ విజయాలు, ఇంగ్లండ్ గడ్డపై సిరీస్‌లో ఆధిక్యం తర్వాత అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రస్తుత జట్టుతో దక్షిణాఫ్రికానూ గెలవాలని భావించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది.
సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ చేతికి స్వల్ప గాయం కావడంతో అదే కారణమని ముందుగా భావించారు.
అయితే సమస్య అది కాదని, గతంలో ఇబ్బంది పెట్టిన తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తర్వాత తెలిసింది.
రోహిత్ తప్పుకున్న విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
2020 ఐపీఎల్‌లో ఇదే గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్... ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం నాలుగు టెస్టుల్లో చివరి రెండు మాత్రమే ఆడగలిగాడు.
ఇప్పుడు అతని కెరీర్ కీలక దశలో అదే తొడ కండరాల గాయం మళ్లీ రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది.
రోహిత్ శర్మ స్థానంలో ఇటీవలి 'ఎ' జట్టు పర్యటనలో భారత కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ టూర్‌కు వెళ్లాల్సిన భారత జట్టు సభ్యులంతా సోమవారం ముంబైలో ప్రత్యేక 'బయో బబుల్'లో చేరారని పత్రిక తెలిపింది.
సింగరేణి కార్మికులది స్టేట్ స్పాన్సర్ సమ్మె- కేంద్ర మంత్రి
సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత సమ్మె అని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారని ఆంధ్రజ్యోతి పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఇది దురదృష్టకరమని, సంబంధిత మంత్రితో లేదా అధికారులతో మాట్లాడకుండా కార్మికులు సమ్మెకు దిగారని, వాళ్లు వచ్చి మాట్లాడాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ ప్రాయోజిత సమ్మె ఇటు దేశ, అటు సింగరేణి ప్రయోజనాలకు మంచిది కాదన్నారని పత్రిక రాసింది.
పార్లమెంటులో సోమవారం జీరో అవర్‌లో తెలంగాణలో బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
దానిపై కేంద్ర మంత్రి స్పందించి సమాధానమిచ్చారు. బొగ్గు గనుల వేలం విధానం లేక ముందు గనుల కేటాయింపుపై యూపీఏ హయాంలో ఏం జరిగిందో, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అందరికీ తెలుసునని అన్నారు.
14.29 శాతం ఫిట్‌మెంట్ సరిపోతుంది-కమిటీ సిఫార్సు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసినట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఫిట్‌మెంట్ 14.29% ఇస్తే సరిపోతుందని ఈ కమిటీ అభిప్రాయపడింది.
ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు నడుచుకోవాలని సూచించింది.
హైదరాబాద్ నుంచి అమరావతి తరలివచ్చిన ఉద్యోగులకు 30% అద్దె భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చినట్లు పత్రిక రాసింది.
ఇంటి అద్దె భత్యం తగ్గింపుతో కొందరు ఉద్యోగులు ఇప్పుడు అందుకుంటున్న మొత్తం వేతనం కన్నా కొత్త వేతనం తగ్గే ప్రమాదం ఉందని భావించింది. అలా జరగకుండా వారి పాత వేతనానికి రక్షణ కల్పించాలని సిఫార్సు చేసింది.
ఇందుకోసం కోతపడే మొత్తాన్ని పర్సనల్ పే రూపంలో ఇవ్వాలని సూచించింది. సిటీ కాంపెన్సేటరీ భత్యం ఇక చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చేసిందని ఈనాడు చెప్పింది.
పెన్షనర్లకు అదనపు మొత్తం భత్యం ఇప్పుడు 70 ఏళ్లకే ఇస్తున్నారు. ఇకపై 80 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ అదనపు భత్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది.
ఇక ముందు రాష్ట్ర వేతన సవరణ కమిషన్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని- కేంద్ర వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ వేతన సవరణ చేపట్టాలని సూచించింది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దోవలో వెళ్తున్నాయంది. ప్రజా రవాణా ఉద్యోగులకు, హోం గార్డులకు కూడా కమిటీ సిఫార్సులు చేసింది. కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేళ్లను నిర్ణయించిందని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘రాత్రి 12 గంటలకు ‘బతికే ఉన్నావా’ అని మెసేజ్ పెట్టాను.. జవాబు రాలేదని ఫోన్ చేస్తే ఆయన స్నేహితులు ఎత్తారు’
- ‘నేను భారతీయ పైలట్‌నని తెలిసిన తరువాత కూడా ఆ పాకిస్తాన్ గ్రామస్థులు చికెన్‌తో భోజనం పెట్టారు’
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)