'పీఆర్‌సీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

''పీఆర్‌సీ నివేదికను బయటపెట్టేందుకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే ఏదో రహస్యం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారని 'ఈనాడు' తన వార్తాకథనంలో తెలిపింది.

''పీఆర్‌సీ త్వరగా ప్రకటించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదని వారు ప్రశ్నించారు. 'ఉద్యోగసంఘాలకు నివేదిక ఇచ్చేందుకే ఇన్నిరకాలుగా ఇబ్బంది పెడితే ఎలా? దీనికోసం ఇంతలా అవమానిస్తారా? మేం రెండు నెలలుగా అడుగుతున్నా ఎందుకు దాచిపెడుతున్నారు? గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.

నివేదికలోని సిఫార్సులను మేమూ అధ్యయనం చేయాలి కదా? శాఖల నుంచి ప్రస్తావించిన డిమాండ్లను అందులో చేర్చారో లేదో చూసుకోవాలి. దీనిపై అధికారులు ఎందుకు దాటవేస్తున్నారు?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు ఐకాస నేతలు గురువారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు.

అంతకుముందు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో సమావేశమైనట్లు వెల్లడించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

దక్షిణ కోస్తాను ముంచెత్తిన వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోందని 'సాక్షి' కథనం తెలిపింది.

''ఎడతెరపిలేని వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. జోరువానకు తోడు గాలి బీభత్సం సృష్టించడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలపై వర్ష ప్రభావం అధికంగా కనిపించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఏర్పేడు మండలంలోని గుడిమల్లం-పాపానాయుడుపేట మధ్య ఉన్న సీతకాలువలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. రాకపోకలు నిలిచిపోయాయ''ని ఆ కథనంలో రాశారు.

ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యానికి కేసీఆరే కారణం: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్

ఏపీ, తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జరిగిన జాప్యానికి సీఎం కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ తేల్చిచెప్పారని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో తెలిపింది.

''2015లోనే సుప్రీం కోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తుందని ఆయన నిలదీశారు.

రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి బోర్డులకు అప్పగించకపోతే రాజ్యాంగ నిబంధనలున్నాయని హెచ్చరించారు.

గురువారం ఆయన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ కార్యాలయం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రచురణ, ప్రసార మాధ్యమాల పాత్రికేయులతో ప్రత్యక్ష, వర్చువల్‌ విధానంలో మాట్లాడారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో తన పేరును ప్రస్తావిస్తూ జలవివాదాలను లేవనెత్తారని.. అందువల్ల వాస్తవాలు తెలియజేయాలని భావించానని, అందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశాలను ఎందుకు నిర్వహించారో అందరికీ తెలుసని, దాని గురించి తాను మాట్లాడబోనని ఆయన వ్యాఖ్యానించారు.

''అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం ట్రైబ్యునల్‌ వేయాలని 2015లో సుప్రీంకోర్టులో తెలంగాణ కేసు వేసింది. 2020 అక్టోబరు 6వ తేదీన ఆ కేసును రెండురోజుల్లో వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ నాకు చెప్పారు.

8 నెలల తర్వాత కేసును వెనక్కితీసుకున్నారు. ఏడేళ్ల మీ నిర్లక్ష్యానికి కేంద్రం, నేను ఎలా బాధ్యులమవుతాం?'' అని ప్రశ్నించారు. పిటిషన్‌ ఉపసంహరణపై ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కేసీఆర్‌కు 8 నెలల సమయం పట్టిందని అన్నారు. చివరికి ఈ ఏడాది అక్టోబరు 6న పిటిషన్‌ ఉపసంహరణకు కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ట్రైబ్యునల్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకునే పరిధి తమకు లేకుండాపోయిందని గుర్తుచేశారు. పిటిషన్‌ ఉపసంహరణ తర్వాత ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించార''ని ఆ కథనంలో రాశారు.

అబద్ధాలు దండి.. కిషన్‌ తొండి: హరీశ్ రావు

కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కిషన్‌రెడ్డి.. అసత్యాలను ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు అన్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''తెలంగాణ హక్కులను కాలరాస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హరీశ్ రావు హెచ్చరించారు.

రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ తీవ్రంగా స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ.. ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

వైద్య కళాశాలల స్థాపన, ఎయిమ్స్‌ వంటి వాటి విషయంలో ఎలాంటి సమాచారం కావాలన్నా తానే స్వయంగా ఎలాంటి భేషజాలకు పోకుండా కిషన్‌రెడ్డిని కలిసి ఇస్తానని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనంటూ ఒక్కో అంశంపై ఆధారాలు చూపించారు.

కిషన్‌రెడ్డి గతంలోనూ తెలంగాణ వాళ్లకు ఎర్రబస్సులు తప్ప ఏమీ తెలియవని ట్వీట్‌ చేసి తర్వాత నాలిక కరుచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సరైన సమాచారం ఇచ్చే మంచి టీమ్‌ను పెట్టుకోవాలని ఆయన కిషన్‌రెడ్డికి సలహా ఇచ్చార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)