You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి - Newsreel
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది.
గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన ఆదిమూలపు సురేష్‌తో పాటుగా ఆయన భార్య, ప్రస్తుతం సర్వీసులో ఉన్న విజయలక్ష్మిపై 2016లో కేసు నమోదయ్యింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులతో సీబీఐ ఈ కేసు విచారణను చేపట్టింది. దానికి సంబంధించి 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.ఈ కేసులో విచారణ నిలిపివేయాలని మంత్రి దంపతులు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో ఈ కేసులో విచారణ నిలిపివేస్తూ తీర్పు వెలువడింది.
అయితే, సీబీఐ ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దాంతో ఆదిమూలపు సురేష్ దంపతుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో గత నెల 22న విచారణ పూర్తి చేసి తీర్పుని రిజర్వు చేసింది. శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతించింది.
సురేష్ దంపతులు గతంలో తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా సీబీఐ అభియోగాలను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొంది. మరోసారి ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశించింది.
కానీ తాజాగా సుప్రీంకోర్టు మాత్రం ప్రాథమిక విచారణ అవసరం లేదని, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ సాగించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)