శ్రీకళా రెడ్డి: ఉత్తర్‌ప్రదేశ్‌లో జడ్పీ ఛైర్మన్‌గా తెలుగు మహిళ - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

‘‘మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి గతంలో తెలంగాణలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలోనూ బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు వినిపించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధనుంజయ్‌ను వివాహమాడిన ఆమె అక్కడ జరిగిన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం జౌన్పూర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ ఎన్నికయ్యార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్ల కలకలం

రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం శ్రీశైలంలో అర్ధరాత్రిపూట డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయని ‘వెలుగు’ పత్రిక కథనం వెల్లడించింది.

‘‘గత నాలుగైదు రోజులుగా శైవక్షేత్రం శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్లు సంచరిస్తున్నట్లు గుర్తించిన దేవాలయ, డ్యాం భద్రతా విభాగం వారు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

నాలుగు రోజులుగా అర్ధరాత్రి వేళ డ్రోన్లు శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లో ఆకాశవీధుల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శ్రీశైలం జలాశయం నీరు కేంద్ర బిందువుగా మారిన నేపధ్యంలో డ్రోన్లు ఎవరు ఎగురవేస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు.

ఒకవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం.. మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లో ఉగ్రవాదుల కదలికలు.. బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది అక్రమంగా దేశంలో చొరబడి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో పట్టుపడడం తదితర ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న ముఠా పని అయి ఉంటుందా? అనే అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి.

డ్రోన్లు తిరుగుతున్న సమయంలో వెంటనే గుర్తించి పట్టుకునేందుకు దేవస్థానం భద్రతా సిబ్బంది ప్రయత్నించినా దొరకలేదు. ఆకాశంలో బాగా ఎత్తుగా.. వేగంగా ఎగిరిపోతుండడంతో పట్టుకోవడం స్థానిక పోలీసులకు సవాల్ గా మారింది. గతంలో శ్రీశైలం ఆలయానికి ముంపు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

భార్య కోసం ఎర్రచీర దొంగిలించిన భర్త.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు

ఓ దుకాణంలో చూసిన ఎర్ర చీరపై మనసు పారేసుకున్న పాత నేరస్తుడు ఒకడు దానిని దొంగిలించి తెచ్చి ఇచ్చి మరీ భార్య మనసు దోచుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అతడు కష్టాల్లో పడ్డాడు. చీరను దొంగిలించిన అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిందీ ఘటన. పాత నేరస్తుడైన విక్కీపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి.

ఇటీవల స్థానిక ఫ్రీగంజ్ చౌపట్టీలోని ఓ వస్త్ర దుకాణంలో అతడి కంటబడిన ఓ ఎర్ర చీర అతడి మనసును కట్టిపడేసింది. ఆ చీర తనకే అంతగా నచ్చేస్తే తన భార్య ఇంకెంత మురిసిపోతుందో అనుకున్నాడు.

ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా చీరల దుకాణంలోకి వెళ్లి కత్తి చూపించి హంగామా చేశాడు. అడ్డొచ్చిన వారిని బెదిరించాడు. ఆ సమయంలో షోరూములోని గల్లాపెట్టె కళకళలాడుతున్నా దాని జోలికి పోకుండా తనకు నచ్చిన ఎర్రచీరను తీసుకెళ్లిపోయాడు.

ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. షోరూం యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని విక్కీగా తేల్చారు.

అతడు పాత నేరస్తుడని, ఇప్పటికే అతడిపై 16 కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇక తప్పించుకోవడానికి ఎంతమాత్రమూ వీలు లేకుండా విక్కీపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. విక్కీని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అతడు చెప్పింది విని ఆశ్చర్యపోయారు.

తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఈ దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడు. కాగా, చీర దొంగతనం చేస్తే జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంద’’ని ఆ కథనంలో రాశారు.

కరెంటు ఉత్పత్తి ఆపేది లేదు

కృష్ణా జలాల్లో తమకు కేటాయించిన నీళ్లవాటానే వినియోగించుకొంటున్నామని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు లేఖ రాసిందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘తమకు ఉన్న హక్కు మేరకు.. గతంలో జారీచేసిన జీవోల ప్రకారం విద్యుదుత్పత్తి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ప్రణాళికాసంఘం నివేదిక, కృష్ణా మొదటి ట్రిబ్యునల్‌ తీర్పునకు లోబడే సాగర్‌లో క్యారీ ఓవర్‌ స్టోరేజీ ఉండేలా తెలంగాణ కరెంటు ఉత్పత్తి చేస్తున్నదని పేర్కొన్నది.

2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 50:50 దామాషా ప్రకారం విద్యుత్తు పంపకాలు చేయాలన్న ఒప్పందం ఆ ఒక్క సంవత్సరానికే చెల్లుబాటు అవుతుందని స్పష్టంచేసింది.

ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీకి ఆదివారం లేఖ రాశారు.

నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులకు మించి కృష్ణా జలాలను వాడుకోవడంతోపాటు, సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా జలాలను బేసిన్‌ అవతలి ప్రాంతాలకు ఏపీ సర్కారు తరలిస్తున్నదని, ఈ వాస్తవాలను దాచిపెట్టి బోర్డును ఏపీ సర్కారు తప్పుదారి పట్టిస్తున్నదని పేర్కొన్నారు.

విద్యుదుత్పత్తి వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఏపీ సర్కారు కేఆర్‌ఎంబీకి ఫిర్యాదుచేసిన నేపథ్యంలో విద్యుదుత్పత్తిని ఆపాలంటూ బోర్డు తెలంగాణకు లేఖ రాసిన నేపథ్యంతో ఈఎన్సీ స్పందించారు. తెలంగాణపై ఏపీ చేసిన వాదనలను నిర్దంద్వంగా కొట్టిపారేశారు.

విద్యుదుత్పత్తి వల్ల తనకు నష్టం వాటిల్లుతుందనే ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేశారు. వాస్తవాలను గ్రహించి ఆ తరువాత ఒక నిర్ణయానికి రావాలని కేఆర్‌ఎంబీకి హితవు పలికారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్వాపరాలు.. ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వివిధ అంశాలను సవివరంగా లేఖలో పొందుపరిచార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)