You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లక్షదీవుల వివాదం: బీఫ్ బ్యాన్ ఎందుకు వివాదంగా మారింది.... పాలనాధికారి స్థానికులను అణచివేయాలని చూస్తున్నారా?
- రచయిత, శుభమ్ కిశోర్, కెంజ్-ఉల్-మునీర్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
లక్ష దీవుల్లో గొడ్డు మాంసం నిషేధం, కొత్త చట్టం, పంచాయతీ ఎన్నికల నిబంధనల మార్పు ప్రతిపాదనలపై గత కొన్ని రోజులుగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కానీ లక్షదీవుల పాలనాధికారి ప్రఫుల్ పటేల్ మాత్రం అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, వ్యతిరేక గళం కేరళ నుంచే ఎక్కువగా వినిపిస్తోంది అన్నారు.. లక్షదీవుల్లో స్వార్థపరులు మాత్రమే వాటిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
లక్షదీవుల్లోని కవారతీలో ఉంటున్న 47 ఏళ్ల సైఫుద్దీన్ (పేరు మార్చాం) ఆయన కుటుంబంలోని 10 మంది చేపలు పట్టి జీవిస్తారు. కానీ గత ఒక వారం నుంచీ ఆయన చాలా వరకూ ఏ పనీ లేకుండా ఉన్నారు.
ఇటీవల వచ్చిన తౌక్తే తుపాను వల్ల ఆయన పడవ నాశనమైంది.. దాంతో ఆయన సముద్రంలోకి వెళ్లలేకపోయారు.
తుపాను వాతావరణం ఈ దీవుల ప్రజలకు కొత్త కాదు. ప్రజలు తరచూ వాటిన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈసారీ అలా జరగలేదు. "మా ఈ పరిస్థితికి ఒక్కరే కారణం-ప్రఫుల్ పటేల్" అని సైఫుద్దీన్ చెబుతున్నారు.
ప్రఫుల్ పటేల్‌ను 2020 డిసెంబర్ 5న లక్షద్వీప్ పరిపాలనాధికారిగా నియమించారు. పటేల్ మీద గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
లక్షదీవుల ప్రత్యేకత ఏంటి?
లక్షదీవులు కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ అసెంబ్లీ లేదు. ఈ రాష్ట్రం పగ్గాలు రాష్టపతి నియమించిన పరిపాలనాధికారి చేతుల్లో ఉంటాయి.
లక్షదీవుల సంస్కృతి, స్థానికుల జీవనశైలికి నష్టం కలిగించడానికి, అనవసర భయాలు వ్యాప్తి చేయడానికి ప్రఫుల్ పటేల్ ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ఆయన ప్రతిపాదించిన చాలా నిబంధనలు ప్రజాస్వామ్య భావనకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు.
ప్రభుత్వం కొత్త నిబంధనల డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అక్కడ ఎన్నికైన ప్రజా ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకుండానే ఈ నోటిఫికేషన్‌లో ఆ నిబంధనలు చేర్చారని అక్కడి సామాన్యులు, సర్పంచులు, ఎంపీలు చెబుతున్నారు.
ఈ నిబంధనల్లో ప్రధానంగా వివాదాస్పదమైంది గొడ్డుమాంసం నిషేధం కాగా, ఇద్దరికి మించి పిల్లలున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడం రెండోది.
ప్రజల అరెస్ట్, భూసేకరణకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ వివాదాస్పద నిర్ణయాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ముసాయిదా రూపంలో ఉండగా , హోం మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేస్తే, ఇవి చట్టాలుగా మారతాయి.
కానీ ఈ నిర్ణయాలన్నీ వెనక్కు తీసుకోవాలని, ప్రఫుల్ పటేల్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
అధికారులకు ఎక్కువ పవర్ ఇచ్చారంటూ ఆరోపణలు
దశాబ్దాల నుంచీ తన పడవను సముద్ర తీరంలోని ఒక షెడ్‌లో పెట్టేవాడినని, కానీ, ఆ షెడ్ అక్రమ నిర్మాణం అంటూ జిల్లా అధికారులు ఇటీవల తనకు నోటీసులు పంపించారని సైఫుద్దీన్ చెప్పారు.
"నోటీసులు పంపించిన ఒక్క రోజు తర్వాత రాత్రి 12 గంటలకు మా షెడ్ ధ్వంసం చేశారు. మేం కోర్టుకు వెళ్లే లోపే అంతా అయిపోయింది. ఈ షెడ్ నేను పుట్టక ముందు నుంచీ ఉంది. మా నాన్న కూడా పడవను ఇక్కడే ఉంచేవారు" అని ఆయన తెలిపారు.
స్థానిక మత్స్యకారుడు ఒకరు అలాంటి ఒక నోటీసు కాపీని బీబీసీకి షేర్ చేశాడు.
డిప్యుటీ కలెక్టర్ ఆఫీస్ నుంచి జనవరిలో జారీ అయిన ఆ నోటీసులో "ఈ నోటీసు అందిన రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని ఉంది.
అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా స్థానిక అధికారులు చేపట్టిన చర్యలుగా పటేల్ వాటిని చెప్పారు. ఈ అంశంలో కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుగుతోంది.
స్థానికుల్లో భయం
ఇప్పుడు ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఎన్నో అధికారాలు ఇచ్చారని, ముందు ముందు తన భూమి కూడా లాక్కుంటారేమోనని భయంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి బీబీసీకి చెప్పారు.
2021 మార్చి 28న జారీ చేసిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వం అక్కడ ఏ ప్రాంతాన్నయినా ప్లానింగ్ ఏరియాగా ప్రకటించవచ్చు.
దీనిపై లక్షదీవుల ఎంపీ, మొహమ్మద్ ఫైజల్ బీబీసీతో మాట్లాడారు.
"ఈ కొత్త బాడీకి అపరిమిత అధికారాలు ఇస్తున్నారు. ఇక్కడ పటేల్ 50 మీటర్ల వెడల్పున్న రోడ్లు వేస్తామంటున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కొత్త భవనాలు నిర్మిస్తామని అంటున్నారు. మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, ఇవి చిన్న చిన్న దీవులు, అలాంటి నిర్మాణాల వల్ల ఇక్కడి వారికి చాలా ఇబ్బందులు వస్తాయి" అన్నారు.
ఇక్కడ స్థానికులు ఎన్నుకున్న ప్రతినిధులకు ఆ ప్రాంతంపై నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవనీ, అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతుల్లోకే వెళ్లిపోయాయని ఆయన అన్నారు.
అయితే, ఈ ఆరోపణలను పటేల్ కొట్టిపారేస్తున్నారు. "ఆ ప్రాంతం అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసమే ఈ నిబంధనలు రూపొందించాం, అన్ని నియమాలూ పాటిస్తున్నాం" అన్నారు.
వాటిని ఎవరూ వ్యతిరేకించకుండా, ప్రజలను అరెస్ట్ చేయడానికి ఒక కొత్త చట్టం తీసుకొచ్చే నిబంధన కూడా ఉందని ఫైజల్ ఆరోపించారు.
యాంటీ సోషల్ యాక్టివిటీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్
పటేల్ పదవిలోకి వచ్చిన తర్వాత జనవరి 29న ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్ సిద్ధం చేశారు. దీని కింద ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ వ్యక్తినైనా ఏడాది వరకూ అదుపులో తీసుకోవచ్చు.
దేశంలో అతి తక్కువ నేరాలు నమోదయ్యే ప్రాంతాల్లో లక్షదీవులు ఒకటని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి.
"అసలు నేరాలే జరగని ప్రాంతంలో, ఇలాంటి చట్టాల అవసరం ఏముంది" అని పేరు రాయద్దని కోరిన ఒక వ్యక్తి బీబీసీతో అన్నారు.
ఎవరూ రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేయకుండా గూండా యాక్ట్‌గా కూడా చెబుతున్న ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఫైజల్ ఆరోపించారు. ఇది తమ హక్కులను లాక్కునే ప్రయత్నం అంటున్నారు.
కానీ, ఇటీవల కొన్ని నేరాలు బయటపడడంతో, ఈ చట్టం అవసరం వచ్చిందని ప్రఫుల్ పటేల్ బీబీసీతో అన్నారు.
రెండు నెలల క్రితం లక్షదీవుల దగ్గర కోస్ట్ గార్డ్ చాలా భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దాని విలువ రూ.500 కోట్లకు పైనే ఉంటుంది. ఏకే-47లు కూడా దొరికాయి. చిన్న చిన్న దీవుల్లో గంజాయి స్మగ్లింగ్ కూడా భారీగా జరుగుతోంది అని చెప్పారు.
తప్పు చేయనివారు ఈ చట్టానికి భయపడాల్సిన అవసరం లేదని పటేల్ అన్నారు.
ముస్లిం జనాభా అధికం...కానీ, బీఫ్ నిషేధం
లక్షదీవుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మార్చాలని కూడా ప్రఫుల్ పటేల్ ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
2021 ఫిబ్రవరిలో వచ్చిన మరో నోటిఫికేషన్‌లో గొడ్డు మాంసంపై నిషేధం గురించి చెప్పారు. ఎవరైనా ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా గొడ్డు మాంసం అమ్మడం, నిల్వ ఉంచుకోవడం, రవాణా చేయడం, అమ్మకానికి ప్రదర్శించడంతో పాటు బీఫ్ ఉత్పత్తులు కొనడంపై కూడా ఈ నిషేధం ఉంటుంది.
2011లెక్కల ప్రకారం లక్షదీవుల్లో 96 శాతానికి పైగా జనాభా ముస్లింలు. బీఫ్ తమ ప్రధాన ఆహారమని కవారతీ పంచాయతీ చైర్మన్ అబ్దుల్ కాదిర్ బీబీసీతో అన్నారు.
"ఇక్కడ ఎక్కువ జనాభా ముస్లింలే. అది మా ప్రధాన ఆహారం. మా తిండి తినకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. బీఫ్ వ్యాపారం మీద చాలా మంది ఆధారపడ్డారు. మాకు ఇష్టమైన ఆహారం కూడా మేం తినలేకపోతున్నామనేది మాకు కోపం తెప్పిస్తోంది. మిడ్ డే మీల్‌లో కూడా బీఫ్ ఆపేశారు" అని ఫైజల్ చెప్పారు.
యానిమల్ ప్రివెన్షన్ రెగ్యులేషన్ కింద జారీ చేసిన ఈ డ్రాఫ్ట్‌లో ఆవు, గేదె, ఎద్దు ప్రస్తావన ఉంది.
"మీరు జంతువులను కాపాడాలని అనుకుంటే , ఈ దీవుల ఎకోసిస్టమ్‌కు అత్యంత అవసరమైన జంతువుల గురించి ఆలోచించండి" అని ఆయన అన్నారు.
కానీ, ఆ నోటిఫికేషన్‌కు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని పటేల్ ఆరోపిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, వీటి పై ఇప్పటికే చర్చ కూడా జరిగిందని తెలిపారు.
ఇద్దరికి మించి పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు
ఈ నిబంధన ద్వారా పంచాయతీలు, ప్రజా ప్రతినిధుల అధికారాలు తగ్గించాలని భావిస్తున్నారని ఫైజల్, పంచాయతీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పంచాయతీల అధికారాలను లాక్కుని, అధికారుల చేతికి అందించడానికే కొత్త నిబంధనలు తీసుకొచ్చారని అంటున్నారు.
మార్చి 28న జారీ చేసిన పంచాయతీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్ ప్రకారం, ఇద్దరికి మించి పిల్లలున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధనపై చాలా విమర్శలు వస్తున్నాయి.
ఇది తమకు ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన హక్కులను లాగేసుకునే ప్రయత్నం అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భయంవాతావరణం
ఇలాంటి నిబంధనల వల్ల లక్షదీవుల్లో ఉన్నవారిలో ఒక రకమైన భయం వాతావరణం ఏర్పడిందని గత 17 ఏళ్లుగా మినికాయ్ ద్వీపంలో స్థానికులకు చికిత్స అందిస్తున్న 48 ఏళ్ల డాక్టర్ మునీర్ చెప్పారు.
లక్షదీవుల్లో కరోనా కేసులు పెరగడానికి కూడా ప్రఫుల్ పటేల్ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.
అంతకు ముందు పాలకులు కరోనా మహమ్మారి తర్వాత లక్షదీవులకు రాకపోకలపై నిషేధం విధించారని, పటేల్ ఆ నిబంధనల సడలించడంతో, ఇప్పుడు అన్ని దీవుల్లో కరోనా కేసులు ఉన్నాయని చెప్పారు.
రాజకీయ పార్టీల వ్యతిరేకత
బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ‘‘లక్షదీవులు సముద్రంలో భారత్‌కు ఆభరణం లాంటివి. అధికారంలో ఉన్న అజ్ఞానులు దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నేను లక్షదీవుల ప్రజలు అండగా ఉన్నాను‘‘ అన్నారు.
దీనిపై శశి థరూర్ సహా, స్థానిక నేతలు, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ప్రఫుల్ పటేల్ ఏమంటున్నారు?
లక్షదీవుల్లోని మత్స్యకారులతో సహా అక్కడున్న అందరి అభివృద్ధి కోసం తాను ప్రణాళికలు రూపొందించానని, వాటి గురించి మాత్రం ఎలాంటి చర్చా జరగడం లేదని ప్రఫుల్ పటేల్ బీబీసీతో అన్నారు.
"మేం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నాం. మహిళా సాధికారత తీసుకొచ్చాం. మీరు ఆ ప్రశ్నలు అడగరేంటి" అన్నారు.
"మేం పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేశాం. అభ్యంతరాలు చెప్పాలని కోరాం. అన్ని నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. అన్నీ అందరికీ తెలుసు. నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారం" అని చెప్పారు.
‘‘అక్రమాలు చేసేవారికి ఇప్పుడు ఈ నిబంధనల వల్ల కష్టంగా ఉంది. 70 ఏళ్లలో ఇక్కడ ఏం జరగలేదు. అభివృద్ధి జరిగిన తర్వాత అన్నీ బయటికి వస్తాయని’’ అని ఆయన అన్నారు.
అభ్యంతరాలు చెప్పాలని కోరిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల గడువు ఇప్పటికే ముగిసింది.
ఇప్పుడు మీరు వీటిని హోం మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపిస్తారా అని బీబీసీ అడిగినప్పుడు, "ఇప్పటివరకూ దానికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఏదీ లేదు" అని ప్రఫుల్ పటేల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)