హైదరాబాద్‌: చికెన్ లేదని చెప్పిన హోటల్ సర్వర్‌ను కొట్టి, ప్రాణం తీశారు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో చికెన్ లేదని చెప్పినందుకు సర్వర్‌ను చితకబాదిన నలుగురు యువకులు అతడి మరణానికి కారణమయ్యారని నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రచురించింది.

‘‘హోటల్‌లో చికెన్‌ లేదని చెప్పినందుకు నలుగురు యువకులు సర్వర్‌పై దాడి చేయగా.. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

కొత్తపేటలో చోటుచేసుకున్న ఈ హత్యకేసులో నలుగురు నిందితులను బుధవారం సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం, బీదర్‌ జిల్లా, మొర్కందివాడి గ్రామానికి చెందిన పాలంపల్లి మహేశ్‌(20), అతడి సోదరుడు పాలంపల్లి విజయ్‌(24), ఇద్దరూ కలిసి కొంతకాలంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌లో హమాలీ పనులు చేస్తున్నారు.

అదే రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు బాల నేరస్థులు కొత్తపేట పండ్ల మార్కెట్‌లోని శ్రీకృష్ణ పండ్ల కంపెనీ వద్ద వారికి పరిచయమయ్యారు.

ఈ నెల 2న రాత్రి 7.30 గంటలకు నలుగురు కలిసి కొత్తపేటలోని శ్రీదుర్గా భవానీ హోటల్‌కు వెళ్లి.. భోజనంతోపాటు చికెన్‌ ఆర్డర్‌ ఇవ్వగా హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం లచ్చిరామ్‌ తండాకు చెందిన బాలాజీ రాథోడ్‌ తమ వద్ద చికెన్‌ లేదని, బోటీ ఉందని చెప్పాడు.

దీంతో మహేశ్‌ కిచెన్‌లోకి వెళ్లి చూడగా చికెన్‌ కనిపించింది. ఈ విషయంలో బాలాజీకి, నలుగురు యువకులకు మధ్య గొడవ జరుగుతుండగా హోటల్‌ యజమాని కల్సె సుధాకర్‌ జోక్యం చేసుకుని సర్దిచెప్పి పంపించాడు.

అదే రోజు రాత్రి 8గంటలకు పథకం ప్రకారం.. నలుగురు కలిసి హోటల్‌ వద్దకు వచ్చి బాలాజీపై దాడికి పాల్పడ్డారు. అంతలోనే మహేశ్‌ రాయితో బాలాజీ తలపై మోదగా తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గాయపడిన బాలాజీని గుర్తించి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 16న బీదర్‌లోని ఓ దవాఖానలో మృతి చెందాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

కోటి కోవిడ్-19 టీకా డోసులకు ఏపీ గ్లోబల్‌ టెండర్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి టీకా డోసులకు గ్లోబల్‌ టెండర్‌ వేసేందుకు సిద్ధమైనట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం 'గ్లోబల్‌ టెండర్‌' విధానానికి శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతానికి సాధ్యమైనంత వేగంగా కోటి కొవిడ్‌ టీకా డోసులను సమకూర్చుకునేలా కార్యాచరణ రూపొందించింది.

గ్లోబల్‌ టెండరుకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో ఈ-టెండర్‌ విధానం అందుబాటులో ఉంటుంది.

జూన్‌ 4 సాయంత్రానికి ఆసక్తి కలిగిన ఉత్పత్తి సంస్థలు టెండరులో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) తెలిపింది.

రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు అందజేస్తోంది. 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుక్కోవాలని సూచించింది.

రాష్ట్రంలో ఆ వయసులవారు సుమారు 1.90 కోట్లమంది ఉంటారని అంచనా. ఇంతమందికి రెండు డోసుల టీకాలను అందజేయాలంటే.. వృథా పోనూ మొత్తం 4 కోట్ల డోసులు అవసరమవుతాయి.

ఇందుకోసం రూ. 2500 కోట్లను కేటాయించింది. గ్లోబల్‌ టెండర్‌ విధానంలో సమకూర్చుకుంటే శరవేగంగా పంపిణీ చేయడానికి అవకాశాలుండంతోపాటు కొవిడ్‌ మూడో, నాలుగో ఉద్ధృతులను ఎదుర్కోవడానికి కూడా సన్నద్ధమైనట్లు అవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయని ఈనాడు వివరించింది.

కోవిడ్ నుంచి కోలుకున్నవారు టీకా కోసం 3 నెలలు ఆగాలి

కొవిడ్‌ బారినపడ్డ వారు కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు కనీసం మూడు నెలలు ఆగాలని కేంద్రం సూచించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించంది.

తొలిడోసు తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడ్డ వాళ్లు కూడా రెండో డోసు కోసం.. కోలుకున్న తర్వాత నుంచి మూడు నెలల పాటు వేచి ఉండాలని తెలిపింది.

గతంలో ఈ సమయం నాలుగు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. వీటన్నింటినీ సవరిస్తూ.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వ్యాక్సినేషన్‌ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని పేర్కొంది. అలాగే, కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని, అందులో నెగెటివ్‌ వచ్చిన తర్వాత 14 రోజులకు రక్తం దానం చేయొచ్చని చెప్పింది.

బాలింతలు కూడా నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని తెలిపింది. గర్భిణులకు వ్యాక్సినేషన్‌ విషయంలో అధ్యయనం జరుగుతోందని, ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వెల్లడించింది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి.. నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌-19 (ఎన్‌ఈజీవీఏసీ) చేసిన తాజా ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసిందని పత్రిక రాసింది.

ప్లాస్మా చికిత్స తీసుకున్న వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత వ్యాక్సిన్‌ తీసుకోవాలని, ఇతర వ్యాధులకు ఐసీయూలో చికిత్స తీసుకున్న వారు డిశ్చార్జి అయిన 4-8 వారాల తర్వాతే టీకా వేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలూ అవసరం లేదని తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాల్లో తీసుకొచ్చిన ఈ తాజా మార్పులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

ప్రైవసీ పాలసీని వెనక్కు తీసుకోండి- వాట్సాప్‌కు కేంద్రం ఆదేశం

వాట్సాప్ తన కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రం నోటీసులు ఇచ్చిందని సాక్షి కథనం ప్రచురించింది.

వివాదాస్పదంగా మారిన నూతన ప్రైవసీ విధానం-2021ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్‌ యాజమాన్యాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) శాఖ ఆదేశించింది.

ఈ మేరకు తాజాగా నోటీసు జారీ చేసింది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పుల పట్ల ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సమాచార విధానంలోని పవిత్రమైన విలువలను, డేటా సెక్యూరిటీని, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను దెబ్బతీసేలా ఈ నూతన పాలసీ ఉందని పేర్కొంది.

కొత్త పాలసీని అమలు చేస్తున్న తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పౌరుల ప్రయోజనాలను, హక్కులను ఉల్లంఘించేలా కొత్త పాలసీ ఉందని తేల్చిచెప్పింది.

నోటీసుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని వాట్సాప్‌ యాజమాన్యానికి కేంద్ర ఐటీ శాఖ సూచించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసిందని సాక్షి రాసింది.

భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త ప్రైవసీ పాలసీని ఎలా తీసుకొచ్చారని వాట్సాప్‌ను కేంద్రం నిలదీసింది.

దేశ పౌరుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్న దృష్ట్యా.. భారత చట్టాల ప్రకారం వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి వీలున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిందని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)