కరోనావైరస్‌తో పోరాటంలో 'ఆయుష్మాన్ భారత్' ఎంత వరకు ఉపయోగపడింది? BBC Fact Check

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం ప్రవేశ పెట్టగానే సరిపోదు. దానికి నిధులివ్వాలి, సౌకర్యాలు కల్పించాలి, అన్నింటికన్నా ముఖ్యంగా దాని లబ్ధిదారులకు ఆ పథకం ఎలా వారికి ఉపయోగపడుతుందో తెలియజేయాలి.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయగలిగిందా? కరోనా సమయంలో పేదలకు ఉపయోగపడాల్సిన ఆయుష్మాన్ భారత్ పథకం దాని లక్ష్యాన్ని చేరుకుంటోందా? నిపుణులు ఏమంటున్నారు ?

  • ఈ పథకంలో ఉన్న ఆసుపత్రుల సంఖ్య చాలా తక్కువ.
  • ఎంప్యానెల్ చేసిన అన్ని ఆసుపత్రులలో కోవిడ్ కు చికిత్స సౌకర్యం అందుబాటులో లేదు
  • ఆయుష్మాన్ భారత్‌లో భాగమైన ఆసుపత్రుల వివరాలు లబ్ధిదారులకు చేరలేదు.
  • ఈ పథకంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులలో ఛార్జ్‌లు సూచించిన దానికంటే ఎక్కువ వసూలు చేశాయి.
  • ఈ పథకంలో కోవిడ్‌ కోసం కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.

''కరోనా సోకినట్లు తెలిసిన మూడు రోజుల తర్వాత మా సోదరుడిని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లతో మాట్లాడితే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. నిన్న రాత్రే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాము. ఆక్సిజన్ లెవెల్స్ 80కి పడిపోయాయి. 24 గంటలకు రూ.1లక్ష 30 వేల రూపాయలు వసూలు చేశారు.’’ అంటూ రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి కన్నీళ్లు పెట్టుకున్నారు.

జైపూర్‌కు 17 కి.మీ దూరంలో ఉండే సికార్‌లో నివసించే రాజేంద్ర ప్రసాద్, తన సోదరుడు సుభాష్ చంద్ చికిత్స కోసం సికార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడాయన సోదరుడు ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఆయన చేతిలో తన తమ్ముడు సుభాష్ పేరు మీద ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది. దానిపై మోదీ ఫొటో ఉంది. మరి అది ఆయనకు ఉపయోగపడిందా?

''ప్రైవేటు ఆసుపత్రిలో కూడా ఈ కార్డు పని చేస్తుందని మేం భావించాం. కానీ ముందు డబ్బు కట్టండి, రసీదులు ఇస్తామని డాక్టర్లు అన్నారు. ఆ డబ్బు తిరిగి ఎలా వస్తుంది? ఈ కార్డు ఉండి ఏ ప్రయోజనం'' అన్నారు రాజేంద్రప్రసాద్.

సుభాష్ చంద్ ఒక చిన్న స్కూలు నడుపుతున్నారు. ఇంట్లో ఆయన ఒక్కరే సంపాదించే వ్యక్తి. కరోనా కారణంగా ఆ స్కూలు కూడా మూతపడింది.

ఆయుష్మాన్ భారత్-పీఎం జేఏవై అంటే ఏమిటి?

ఆయుష్మాన్ కార్డు అంటే మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన కార్డు. ఆయుష్మాన్ భారత్ పథకంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి వారి ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ -ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై), ఇంకొకటి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ స్కీమ్.

ఆయుష్మాన్‌ భారత్-పీఎంజేఏవై అనేది ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు. అయితే, అంతకు ముందు ఆగస్టులోనే హరియాణాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అనే బాలికనుఈ పథకం మొదటి లబ్ధిదారుగా చెబుతారు.

ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. ఈ పథకం దేశంలోని మొత్తం జనాభాలో 40% ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనకరమని ప్రభుత్వం చెప్పింది.

దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న 2020 ప్రారంభ నెలల్లో, ఆయుష్మాన్ పథకం కింద కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, దేశంలో కరోనా మహమ్మారి కాలంలో ఆయుష్మాన్ కార్డు ఉన్నవారు దీని ప్రయోజనాన్ని ఎంత మాత్రం పొందతున్నారో తెలుసుకోవడానికి సుభాష్ చంద్ ఒక ఉదాహరణ.

కరోనాకు చికిత్స పొందడానికి దేశంలోని ప్రతి ప్రాంతంలో చాలామంది చాలామంది ఇళ్లు, నగలు, భూములు అమ్ముకుంటున్నట్లు అనేక కథనాలు వినిపిస్తున్నాయి. కానీ, అలా అమ్ముకునేందుకు ఏమీ లేని వారికి ఈ కార్డు ఉపయోపడుతుందా ?

ఈ పథకం కింద కోటమందికి ఉచిత చికిత్సలు అందించామని గత ఏడాది మేలో అధికారులు సంబరాలు జరుపుకున్నారు. కానీ, కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ కార్డు అంతగా ఉపయోగపడినట్లు లేదని పరిశోధనలో తేలింది.

రాజస్థాన్‌లో ఆయుష్మాన్ పథకం పరిస్థితి

సుభాష్‌ చంద్‌ కథ విన్నాక రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ రాజోరియాను బీబీసీ సంప్రదించింది. ఈ పథకాన్ని రాజస్థాన్‌లో మే 1 నుంచి ''ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్థ యోజన''గా మార్చినట్లు ఆయన చెప్పారు.

పేరును మార్చడంతో పాటు, ఈ పథకానికి అర్హత పరిధిని కూడా పెంచారు. దీని కింద ఇప్పుడు రాష్ట్రంలోని 1.35 కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా చేశారు. అంటే, ఆయుష్మాన్ భారత్‌ దగ్గర మాత్రమే కాకుండా మరో లబ్ధిదారులు జాబితా కూడా ఉందన్నమాట.

రాజస్థాన్‌లో ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై లబ్ధిదారులు 'ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్థ యోజన' కింద చికిత్స పొందుతున్నట్లు అరుణ రాజోరియా పేర్కొన్నారు.

ఇక సుభాష్ చంద్ విషయానికి వస్తే, ఆయన చేరిన ఆసుపత్రి కరోనాకు చికిత్స చేసే ఎంప్యానెల్ జాబితాలో ఉంటే ఆయనకు కూడా ఉచితంగా చికిత్స లభించేంది. కానీ, ఎంప్యానెల్ ఆసుపత్రి జాబితా తన దగ్గర లేదని చెప్పారు.

అయితే, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వారందరికీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ ఆసుపత్రుల జాబితాను పంపామని రాజోరియా అన్నారు.

సుభాష్ చంద్‌కు అలాంటి మెసేజ్ వచ్చినట్లయితే, ఈ పథకం కింద చికిత్స చేసే ప్రైవేటు ఆసుపత్రులు ఏవో కూడా ఆయన తెలుసుకునే వారు. కానీ అది జరగలేదు. ఇది ఒక్క రాజస్థాన్‌లోనే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి.

గ్రామీణ ప్రజలకు వరం

పల్లె ప్రాంతాలలో ఇప్పుడు కరోనా ఎక్కువగా ఉంది. ఈ పథకం లబ్ధిదారులు కూడా పల్లెల్లోనే ఉన్నారు. సెకండ్ వేవ్‌లో 60శాతం ప్రజలు నివసించే గ్రామీణ ప్రాంతాలో మార్చి ఆరంభం నాటికి 38శాతం మంది కరోనా బారినపడితే, ఏప్రిల్ చివరి నాటికి ఈ సంఖ్య 48% కి పెరిగింది.

ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 15.88 మిలియన్ కార్డులు తయారయ్యాయి. వీటిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోని వారికే కేటాయించారు.

ఆయుష్మాన్ భారత్ డిప్యూటీ సీఈవో అగర్వాల్ అందించిన సమాచారం ప్రకారం, గత సంవత్సరం ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై కింద ఏప్రిల్ 14 వరకు 4 లక్షలమందికి కరోనా చికిత్స అందించారు. 10 లక్షలమంది కార్డు హోల్డర్లకు కరోనా టెస్టులు చేశారు. వీటన్నింటికీ అయిన ఖర్చు సుమారు రూ. 12 కోట్లు.

ఈ గణాంకాలకు సంబంధించి మరింత సమాచారం కోసం ఆయుష్మాన్ భారత్ సీఈవో ఆర్.ఎస్.శర్మ, డిప్యూటీ సీఈవో డాక్టర్ విపుల్ అగర్వాల్‌లతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా, వారి నుంచి స్పందన రాలేదు. ఇక, ఈ పథకం కింద ఖర్చు చేసిన రూ.12 కోట్లలో ఏ రాష్ట్రం వాటా ఎంతో చెప్పలేదు.

ఈ డేటాను ఎలా అర్థం చేసుకోవాలి?

సుమారు రెండు కోట్లమంది ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 40 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం 80-90 శాతం మంది రోగులు ఇంట్లో నుంచి చికిత్స ద్వారా కోలుకుంటున్నారు. 10-20 శాతం మంది రోగులకు మాత్రమే ఆసుపత్రి అవసరం. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉందని అనుకున్నా, 24 కోట్లమంది ప్రజల్లో కనీసం 2 కోట్ల 40 లక్షల మందికి ఆసుపత్రి అవసరం ఏర్పడి ఉంటుంది.

కానీ, ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ బీమా పథకం కింద 4 లక్షల మంది రోగులు మాత్రమే లబ్ధి పొందారు. ఈ 4 లక్షల మందికి చికిత్స కోసం ప్రభుత్వం రూ.12కోట్లు ఖర్చు చేసింది. వాస్తవానికి ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై వార్షిక బడ్జెట్ సుమారు రూ.6400 కోట్లు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ-ఆయుష్మాన్ భారత్ కార్డు

ఆయుష్మాన్‌ భారత్ కార్డు ఎంత వరకు పని చేస్తుందో అర్ధం చేసుకోవడానికి కొంతమంది ఆరోగ్య నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

''రోజూ 20-25వేలమంది పీఎంజేఏవై ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాంటిది మొత్తం 4 లక్షలమందే ఈ పథకంలో చికిత్స పొందారని ప్రభుత్వం చెబుతుందంటే ఇంత పెద్ద పథకంలో ఏ మేరకు ఉపయోగ పడుతుందని అనుకోవాలి'' అని ప్రశ్నించారు ఊమెన్ సి. కురియన్. ఆయన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో సీనియర్ ఫెలోగా పని చేస్తున్నారు.

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభమైన సెకండ్ వేవ్‌లో భారతదేశంలో ఒకే రోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

''ఈ ప్రభుత్వ సమస్య ఏమిటంటే అది డేటాను పంచుకోదు. ఇప్పుడు ఈ 4 లక్షల మంది రోగులు ఎలా ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో చెప్పడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది. అందుకే ఈ గణాంకాలను దాస్తోంది'' అన్నారు కురియన్.

ఆసుపత్రుల నెట్‌వర్క్

ఈ పథకం కింద ఆసుపత్రుల సంఖ్య కూడా తక్కువగానే ఉందని నిపుణులు అంటున్నారు. ''దేశంలో 40శాతం మందికి చికిత్స అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, కరోనాకు చికిత్స చేసే ఆసుపత్రులు ఈ పథకంలో ఎక్కువగా లేవు'' అన్నారు డాక్టర్ చంద్రకాంత్ లహారియా.

చంద్రకాంత్ లహారియా పబ్లిక్ హెల్త్ పాలసీ నిపుణులు. ' టిల్ వి విన్: ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ కోవిడ్ -19 పాండమిక్' పుస్తకానికి సహ రచయిత.

నిజంగా అవసరమైన సందర్భంలో పేదలకు అందుబాటులోకి రావడం లేదని లహారియా అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వస్తే, ఎంప్యానెల్ అయిన ఆసుపత్రిని వెతుక్కుని వెళ్లాల్సి వస్తోంది.

అసలు సుభాష్ చంద్ విషయంలో కూడా అదే జరిగింది. అతను ప్రభుత్వ ఆసుపత్రి రిఫర్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ ప్యానల్లో లేదు.

కొన్ని ఆసుపత్రులు తమకు ప్రభుత్వం పేమెంట్లు సరిగా చేయడం లేదంటూ ఈ జాబితా నుంచి తప్పుకుంటున్నాయని కొందరు డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా చికిత్స కోసం పెద్ద ఎత్తున కార్డులు సిద్ధం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, ఏయే ఆసుపత్రులకు వెళ్లాలో సూచించే సమాచారం మాత్రం లబ్ధిదారులకు అందలేదు.

ఇతర చికిత్సలదీ అదే పరిస్థితి.

ఆయుష్మాన్ పథకం కింద ఇతర వ్యాధులకు అందించే చికిత్స కూడా బాగా తగ్గిపోయిందని తేలింది. గత ఏడాది మార్చి నుంచి మే వరకు నిర్వహించిన అధ్యయనంలో ఆ మూడు నెలల్లో అంటువ్యాధి కారణంగా, కంటి కంటిశుక్లం ఆపరేషన్‌లు 90 శాతం తగ్గినట్లు తేలింది.

క్యాన్సర్ సంబంధ చికిత్సల్లో 57 శాతం, డయాలసిస్‌లో 10 నుంచి 20 శాతం తగ్గుదల కనిపించగా, సిజేరియన్, డెలివరీ చికిత్సలు దాదాపు 70 శాతం తగ్గినట్లు తెలిసింది. పిల్లల వ్యాధులు, అత్యవసర సేవల చికిత్స కూడా 15 నుండి 20 శాతం పడిపోయింది.

అయితే, 2020 సెప్టెంబర్ తర్వాత ఈ పథకంలో ఇతర వ్యాధులకు చికిత్సలు కొంత మేర పెరిగాయని ఊమెన్ అన్నారు. ఇతర తీవ్రవ్యాధుల బాధితులకు ఈ పథకం నుండి చాలా సహాయం లభించగా, కోవిడ్ -19 రోగులు ఆ స్థాయిలో సహాయం పొందలేకపోయారని ఆయన అన్నారు.

''ప్రభుత్వం పేదల కోసం, ధనికులు తమ కోసం బీమా పాలసీలు తీసుకుంటున్నారు. ఈ రెండు వర్గాలలోకి రాని వారిని ఈ పథకానికి అనుసంధానం చేసే చొరవను ప్రభుత్వమే తీసుకోవాలి. వీరినే మిస్సింగ్ మిడిల్ క్లాస్ అంటారు. ఇలాంటి వారిని కూడా ఈ పథకంలో చేర్చడం వల్ల ఎక్కువమందికి ప్రయోజనం కలుగుతుంది'' అన్నారు చంద్రకాంత్ లహారియా.

ఇక పీహెచ్‌సీల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వల్ల, ప్రాథమిక ఆరోగ్యం కోసం ప్రజలు వాటిని సంప్రదిస్తారని, అలాంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్ నెట్‌వర్క్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)