సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమంటున్నారు

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

''కరోనా ఉద్ధ‌తి, స్కూళ్ల మూసివేతల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే 4 నుంచి జరగాల్సిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం.

కరోనా పరిస్థితిపై జూన్ 1న సమీక్ష నిర్వహించిన అనంతరం 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు నిర్వహించడానికి 15 రోజుల ముందు తేదీలు ప్రకటిస్తాం'' అని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారని.. ఏ విద్యార్థికైనా తన మార్కుల విషయంలో అభ్యంతరాలుంటే పరిస్థితులు చక్కబడిన తరువాత పరీక్ష రాయొచ్చని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘ప్రాణం కంటే పరీక్ష ముఖ్యం కాదు’

"సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం మంచిదే. మా అబ్బాయి తాటిచెట్లపాలెం కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు. రెండు నెలల ముందు వరకు కరోనా తగ్గిపోయిందనే ధైర్యంతో ఉన్నాం. కానీ మళ్లీ కేసులు పెరుగుతుండటంతో స్కూల్ కి పంపేందుకే భయపడుతున్నాం. అయినా పదో తరగతి కాబట్టి తప్పదని పంపిస్తున్నాం. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని విన్నప్పుడు చాలా భయం వేస్తోంది. పిల్లలకు ఎక్కడ ఈ వైరస్ సోకుతుందో అని భయపడుతున్నాం. ఇంటి దగ్గరైతే మేం కాస్త చూసుకుంటాం. కానీ స్కూల్ వెళ్తే అక్కడ ఎలా ఉంటారో..? మిగతా పిల్లలంతా ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారో...? ఇలాంటి విషయాలు తెలియదు కదా.

మా చిన్నబ్బాయి ఆరోతరగతి చదువుతున్నాడు. కరోనా కేసులు మళ్లీ పెరిగినప్పుడే వాడిని స్కూల్ కు పంపడం మానేశాం. ఇంటి వద్దే మేమే రెగ్యులర్ గా సిలబస్ చదివిస్తున్నాం. కానీ పెద్దబ్బాయి పదోతరగతి కావడంతో ఇటు రిస్క్ తీసుకుని పంపలేక...స్కూల్ మాన్పించలేక సతమతమయ్యాం.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంతోషమే. అయితే పరీక్షలు రద్దు చేయడం సబ్జెట్ సరిగా నేర్చుకోరనే భయం ఉంది. కానీ ప్రాణాలు కంటే సబ్జెక్టులు, ప్రమోషన్లు ఇంపార్టెంట్ కాదు కదా...?" అని వైజాగ్‌లోని అక్కయ్యపాలేనికి చెందిన కాళ్ల శ్రీకాంత్ అన్నారు.

‘పరీక్షలు వద్దని తల్లిదండ్రులు కేంద్రానికి లేఖలు రాశారు’

"ఈ కరోనా సమయంలో పిల్లలను స్కూల్ కు పంపటం ఇష్టం లేదని చాలా మంది పేరెంట్స్ మా వద్ద రోజూ చెప్తుంటారు. కానీ సిలబస్ లో వెనుకపడిపోతారనే భయంతోనే పంపుతున్నామని...కాస్త జాగ్రత్తగా చూసుకోండని చెప్తుంటారు. ఈ కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం కంటే రద్దు చేయడమే మంచిందని చాలా మంది కోరారు.

ఈ విషయంలోనే మా కేవీలో చదువుకున్న పదో తరగతి పిల్లల తల్లిదండ్రులు కొందరు సమావేశం కూడా నిర్వహించారు. పరీక్షలు రద్దు చేయండంటూ కేంద్ర విద్యాశాఖకి సైతం లేఖలు రాశారు.

మాకు తెలిసి దేశవ్యాప్తంగా పరీక్షలు రద్దు చేయమని కోరుతూ దాదాపు రెండు లక్షల లేఖలు కేంద్రానికి చేరుకున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇప్పటీకే కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు కోరుకునే వారికి కోసం 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఈ నేపధ్యంలో ఈ అడ్మిషన్లు సంగతి ఏమౌతుందో చూడాలి." అని కేవీలో అధ్యాపకురాలుగా పని చేస్తున్న ఎం. రజని కుసుమ బీబీసీతో చెప్పారు.

నిరుడిలానే పరీక్షలు పెట్టాల్సింది’గత ఏడాది కూడా కరోనా కారణంగా వాయిదా పడిన బోర్డు పరీక్షలను జూన్‌లో నిర్వహించారు. ఈసారి కూడా అలాగే పరీక్షలు జరిపి ఉండాల్సిందని సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని తండ్రి పి మల్లికార్జున రావు అన్నారు.

విజయవాడకు చెందిన ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘నిరుడు కూడా కరోనా ఉంది. అయినా జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించారు ఈసారి కూడా సమస్య ఉంది. కానీ దానికి తగిన మార్గాలు వెదకాలి. హఠాత్తుగా వాయిదా వేస్తే విద్యార్థుల్లో ఎంత ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం ఆలోచించాలి. గత ఏడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా అన్ని పరీక్షలు జరిగాయి. అలానే ఈసారి వాయిదా వేయకుండా పరీక్షలు నిర్వహించి ఉంటే బాగుండేది.

కానీ ఇప్పుడు వాయిదా పడిన వాటి విషయంలో కూడా బోర్డు స్పష్టత ఇవ్వలేదు. పదో తరగతికి రద్దు చేసిన తరుణంలో 12వ తరగతి వారికి మళ్లీ ఎప్పుడు పరీక్షలన్నది చెప్పి ఉంటే కొంత బాగుండేది’’ అన్నారు.

‘వాయిదా మంచిదే.. కానీ రద్దు వల్ల నష్టం..’

సీబీఎస్ఈ 10 తరగతి పరీక్షలు రద్దు చేయడం పట్ల విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

రద్దు చేయకుండా వాయిదా వేసి కొద్దికాలం తర్వాత నిర్వహిస్తే బాగుండేదని గుంటూరుకి చెందిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థి ఆర్.ఆకాశ్ అన్నారు.

‘‘12వ తరగతి వారికి పరీక్షలు వాయిదా వేశారు. మాకు కూడా అలా చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు కూడా మార్కుల కేటాయింపు భవిష్యత్తులో మాకు కొంత సమస్యగా మారుతుంది. ఇప్పటికే ఎస్సెస్సీ విద్యార్థులకు పరీక్షలు జరపాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది పరీక్షలు రద్దయినప్పుడు స్టేట్ సిలబస్ విద్యార్థులకు సమస్య అయ్యింది. ఈసారి మాది కూడా అదే పరిస్థితి. అయితే కరోనా కాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మాకు కష్టమే అయినా తప్పదని అనుకుంటున్నాం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)