కరోనావైరస్ సెకండ్ వేవ్: భారత్‌లో ఒక్క రోజులోనే 1.26 లక్షల కేసులు... 685 మరణాలు - News Reel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,26,789 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 685 మంది ఈ వ్యాధి మూలంగా మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అదే సమయంలో 59,258 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది.

మొత్తంగా ఇప్పటివరకూ దేశంలో కరోనావైరస్ బారినపడ్డ వారి సంఖ్య 1.29 కోట్లు దాటిందని తెలిపింది. వీటిలో యాక్టివ్ కేసులు 9,10,319గా ఉన్నాయని పేర్కొంది.

ఇప్పటివరకూ కరోనాతో దేశంలో మొత్తంగా 1,66,862 మంది మరణించారని... 9 లక్షలకుపైగా మంది వ్యాక్సీన్లు వేయించుకున్నారని తెలిపింది.

ఇక భారత్‌లో కరోనా కేసుల్లో ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, భారత్ నుంచి వచ్చేవారు తమ దేశంలోకి ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు న్యూజీలాండ్ ప్రధాని జెసెండా ఆర్డెర్న్ ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఏప్రిల్ 11 నుంచి 28 వరకూ ఈ నిషధం అమల్లో ఉంటుందని పేర్కొంది.

కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు వేయించుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసును వేయించుకున్నారు.

గురువారం దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యులు ఆయనకు రెండో డోసు వేశారు.

భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సీన్‌ను వైద్యులు ప్రధాని మోదీకి ఇచ్చారు.

ఇదివరకు మార్చి 1న ఆయన తొలి డేసు వేయించుకున్నారు.

రష్యా: 'ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ ఆరోగ్యం దిగజారుతోంది... స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతున్నారు'

జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ ఆరోగ్యం దిగజారుతోందని... కాళ్లు, చేతుల్లో స్పర్శను ఆయన కోల్పోతున్నారని నవాల్నీ తరఫు న్యాయవాది తెలిపారు.

గతంలో ఓ కేసులో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘించారంటూ గత ఫిబ్రవరిలో ఓ కోర్టు నవాల్నీకి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

గత ఏడాది విమానంలో ప్రయాణిస్తుండగా నవాల్నీపై విషప్రయోగం జరిగింది. మరణం అంచుల వరకూ వెళ్లి, ఆయన బయటపడ్డారు.

ప్రస్తుతం నవాల్నీ వెన్నుకు రెండు హెర్నియాలతో బాధపడుతున్నారని ఆయన న్యాయవాది వాదిమ్ కోబ్జెవ్ చెప్పారు.

తన వెన్ను, కాలి నొప్పి సమస్యలకు సరైన చికిత్స అందించాలంటూ నవాల్నీ గతవారం జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు.

''అలెక్సీ తనకు తానుగా నడువగలుగుతున్నారు. నడిచేటప్పుడు నొప్పితో బాధపడుతున్నారు. కాళ్లు, అరచేతులు, మణికట్టుల్లో ఆయన స్పర్శ కోల్పోతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది'' అని కోబ్జేవ్ అన్నారు.

శ్వాస కోశ సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో ఈ వారం మొదట్లో నవాల్నీని జైల్లోని రోగుల వార్డుకు తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)