ఆంధ్రప్రదేశ్‌లో నిండుకుంటున్న కరోనావైరస్ టీకా నిల్వలు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకాల నిల్వలు తగ్గుతున్నాయని ఈనాడు పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

‘‘ఏపీలోని నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అవసరాలకు సరిపడా టీకాలు లేక.. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 లక్షల డోసులే ఉన్నాయి. కానీ అవసరం ఎక్కువగా ఉంద’’ని ఈనాడు రాసింది.

‘‘ప్రస్తుతం సరఫరా చేస్తున్న రెండు టీకాల్లో ఒకటే కాస్త అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,633 కేంద్రాల ద్వారా 2,32,355 మందికి టీకా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.

వీరిలో 90,947 మందికే పంపిణీ చేశారు. తొలి డోసులో వేయించుకున్న టీకానే రెండోసారీ వేయించుకోవాలి.

వీరి అవసరాలకు తగ్గట్లు టీకా అందుబాటులో లేక.. లబ్ధిదారులు కంగారుపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు మొత్తం 2,22,330 డోసులు రాగా.. వీటిలో 2,21,000 పంపిణీ చేశారు.

మంగళవారం సాయంత్రం నుంచి జిల్లాలో టీకా నిల్వలు బాగా తగ్గాయి. దీంతో కర్నూలు జిల్లా నుంచి తెప్పించిన ఐదువేల డోసుల్లో నెల్లూరుకు 4వేలు, కావలికి 1,000 డోసులు సర్దుబాటు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలోనూ మంగళవారం సాయంత్రానికే టీకాలు నిండుకున్నాయి. విశాఖ, ఇతర జిల్లాల నుంచి తెప్పించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం ప్రాంతాలకు కేటాయించిన టీకా పంపిణీ రెండు రోజుల నుంచి జరగడంలేదు.

ఇక్కడ 33 కేంద్రాలను ఏర్పాటుచేసినా, తక్కువ కేంద్రాల్లోనే పంపిణీ జరుగుతోంది. గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కృష్ణాజిల్లాలో ఫలానా టీకాయే కావాలని లబ్ధిదారులు చెబుతున్నందున అది అందుబాటులో లేదని అధికారులు అంటున్నార’’ని ఈనాడు రాసింది.

డిమాండ్‌కు తగ్గట్లు కేంద్రం నుంచి టీకాల పంపిణీ జరగడం లేదు. జిల్లా అధికారులు టీకాల పంపిణీ, నిల్వలపై కచ్చితమైన ప్రతిపాదనలు పంపకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల కూడా టీకాల రాక ఆలస్యం అవుతోంది,

జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి ఒకటి, రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, మరో వారంలోగా పది లక్షల డోసుల టీకాలు వస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న చోటకు టీకా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు తెలిపాయని ఈనాడు వివరించింది.

టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

తెలంగాణ చట్ట సభల్లో టీడీపీ ఉనికి కోల్పోయిందని ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, అశ్వారావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మెచ్చా నాగేశ్వర్‌రావు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.

టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షంలో విలీనమైంది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బుధవారం బులెటిన్‌ జారీ చేశారని పత్రిక తెలిపింది.

తొలుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు.

ఇద్దరు మాత్రమే సభ్యులు ఉన్న టీడీఎల్పీని టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేయాలనే తమ అభిమతాన్ని ఆయనకు తెలియజేశారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 2019 మార్చిలోనే టీడీపీని వీడి టీఆర్‌ఎ్‌సలో చేరినా.. అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగానే చలామణిలో ఉన్నారు.

తాజాగా తాను కూడా టీడీపీకి రాజీనామా చేసినట్లు మెచ్చా నాగేశ్వరరావు.. సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఇకపై సాంకేతిక సమస్యలు లేకుండా టీడీఎల్పీని టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసి, సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులుగా కొనసాగుతామని వారు ప్రతిపాదించారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఈ మేరకు లేఖను అందించగా.. సీఎం స్వాగతించారు. మెచ్చా నాగేశ్వరరావు మెడలో సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి, టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు.

అనంతరం వారిద్దరు రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి నివాసానికి వెళ్లారు.

టీఆర్‌ఎ్‌సఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లుగా అధికారిక లేఖను ఎమ్మెల్యేలిద్దరూ ఉమ్మడిగా స్పీకర్‌కు అందజేశారని పత్రిక రాసింది.

టీడీఎల్పీ విలీనానికి అభ్యంతరం లేదని ఆయనకు టీఆర్‌ఎస్ఎల్పీ నివేదించింది.

ఈ ప్రక్రియకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ నాల్గవ పేరా ప్రకారం స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆమోదం తెలిపారు.

అనంతరం టీఆర్‌ఎ్‌సఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా ఉత్తర్వులు వెలువడగా, టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరికీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గుర్తింపు లభించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు

చెక్ బౌన్స్ కేసులో నటుడు శరత్ కుమార్, రాధిక దంపతులకు చెరో ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చినట్లు సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

పత్రిక వివరాల ప్రకారం.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్‌ ఫ్రేమ్స్‌ సంస్థ 'ఇదు ఎన్న మాయం' అనే చిత్రాన్ని నిర్మించింది.

ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్‌ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు.

ఆ డబ్బుతో 'పాంబు సట్టై' అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్‌ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్‌ సంస్థ కోర్టులో పిటిషన్‌ వేసింది.

డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్‌ సంస్థకు అందజేశారు.

శరత్‌కుమార్‌ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్‌ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్‌ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్‌ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్‌ కేసు పెట్టారని సాక్షి రాసింది.

ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్‌ జారీచేసిందని పత్రిక వివరించింది.

100 మంది అర్హులుంటే వారు పనిచేసే చోటే వ్యాక్సినేషన్‌

45 ఏళ్లకు పైబడిన వారు వంద మందికి పైగా ఎక్కడైనా పనిచేస్తుంటే, అక్కడే టీకా వేసేందుకు కేంద్రం సిద్ధమైందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్‌ను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఈ నెల 11 నుంచి పని ప్రదేశాల్లో కూడా టీకా పంపిణీ చేపట్టేందుకు అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది.

టీకా తీసుకోవటానికి అర్హత కలిగి ఉన్న (45 ఏండ్లు పైబడినవారు) కనీసం వంద మంది సిద్ధంగా ఉంటే వారు పనిచేసే చోటే టీకా అందించనున్నట్టు తెలిపింది.

ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

కరోనా తీవ్రత నేపథ్యంలో వ్యాక్సిన్‌పై వయోపరిమితి తొలగించి టీకా ప్రక్రియను మరింత విస్తృతం చేయాలని పలు రాష్ర్టాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

దేశంలో కరోనా మహమ్మారి దడ పుట్టిస్తున్నది. రోజుకో కొత్త రికార్డు నమోదవుతున్నది. 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 1,15,736 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 630 మంది మరణించారు. రికవరీ రేటు 92.11 శాతానికి పడిపోయింది.

దేశంలో ఎనిమిది రాష్ర్టాల్లోనే (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ) 80.70 శాతం కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)