You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బకెట్‌కు తాడు బదులు తీగ కడితే... చిన్నారి చేయి తెగిపోయింది : ప్రెస్ రివ్యూ
కడప జిల్లాలో చిన్నపాటి నిర్లక్ష్యం తల్లీబిడ్డలను ప్రమాదంలోకి నెట్టిందంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
కడప అక్కాయపల్లెకు చెందిన ఫరీదా, సయ్యద్ ఆరిపుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. సయ్యద్ ఆరిపుల్లా జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు.
అక్కాయపల్లెలో ఫరీదా, ఆమె పిల్లలు రెండో అంతస్తులో కాపురముంటున్నారు. వీళ్లు ప్రతి రోజు ఇంట్లో పోగైన చెత్తను ప్లాస్టిక్ బకెట్‌లో వేసి తాడు సాయంతో కిందకు దించేవారు.
ఆదివారం రాత్రి వీరి పెద్ద కుమార్తె అయిషా(13) బకెట్‌కు తాడు బదులు పాత విద్యుత్తు తీగను కట్టింది. విద్యుత్తు తీగకు అక్కడక్కడ అతుకులున్నాయి. వీరు ఉంటున్న ఇంటికి అతి సమీపంలో 11 కేవీ విద్యుత్తు తీగలు వెళుతున్నాయి.
బకెట్‌ను కిందకు దించే సమయంలో ప్రమాదవశాత్తూ అతుకులున్న విద్యుత్తు తీగకు 11 కేవీ విద్యుత్తు తీగల నుంచి విద్యుత్తు సరఫరా కావడంతో పాటు అక్కడే ఉన్న స్టీల్ స్తంభానికి కూడా విద్యుత్తు సరఫరా అయింది.
ఒక్కసారిగా అధిక విద్యుత్తు ప్రసారం కావడంతో అయిషా చెయ్యి తెగి కిందపడింది. తన కుమార్తెను కాపాడేందుకు యత్నించి ఫరీదా కూడా తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణలో సెలూన్లకు, లాండ్రీలకు ఈ నెల నుంచే ఉచిత విద్యుత్
తెలంగాణలోని హెయిర్ సెలూన్లు (కటింగ్ షాపులు), లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ కథనం రాసింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలుచేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
రజక, నాయీబ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రం మొత్తానికి ఈ నిర్ణయం వర్తింపజేయాలని ఆదేశించారు.
సీఎం ఆదేశాలమేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదివారం జీవో విడుదలచేశారు. ఈ నెల 1వ తేదీనుంచే ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి జీహెచ్‌ఎంసీ వరకు కులవృత్తిలో ఉన్న నాలుగున్నర లక్షలమంది రజకులకు, రెండున్నర లక్షలమంది నాయీబ్రాహ్మణులకు ప్రయోజనం కలుగుతుంది.
ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు అంచనావేశారు.
పింఛన్ ఇచ్చేందుకు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకూ వెళ్లిన వలంటీర్...
ఆంధప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలికి పింఛన్ అందజేసేందుకు స్థానిక గ్రామ వలంటీర్ హైదరాబాద్ వరకూ వెళ్లారంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన వితంతువు ముక్క అప్పలనర్సమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
మూడు నెలలుగా ఆమెకు పింఛన్ అందడం లేదు.
దీంతో అప్పలనర్సమ్మకు పింఛన్ అందజేసేందుకు స్థానిక గ్రామ వలంటీర్ దూబ రాజశేఖరరావు శనివారం హైదరాబాద్‌కు వెళ్లారు.
అక్కడ ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని మూడు నెలల పింఛన్ మొత్తం రూ.6,750 ఆమెకు అందించారు.
‘కోట్లు వెచ్చించి కొన్న ఆ బస్సులు ఇక తుక్కే’
టీఎస్‌ఆర్టీసీ కోట్ల రూపాయాలు వెచ్చించి కొనుగోలు చేసిన వజ్ర బస్సులు తుక్కుగా మారనున్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం రాసింది.
వజ్ర బస్సులను వినియోగించడం సాధ్యం కాకపోతుండటంతో వాటిని పూర్తిగా వదిలించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
స్కాప్ పాలసీ కింద ఈ మినీ బస్సులను తుక్కుగా మార్చాలని అంతర్గత ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఫలితంగా ఒక్కోటి రూ.70 లక్షల చొప్పున రూ.40 కోట్లకుపైగా నిధులు వెచ్చించి కొన్న బస్సులు కాలగర్భంలో కలిసిపోనున్నాయి.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో 2017లో 60 వజ్ర మినీ ఏసీ బస్సులను సంస్థ కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన కాలనీల నుంచి వివిధ నగరాలకు ప్రయాణికులను చేరవేసేందుకు వజ్ర బస్సులను వినియోగించింది.
కేవలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఉండడం, చార్జీలు అధికంగా ఉండడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ బస్సులు కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా సాధించలేకపోయాయి.
ఇక, లాక్‌డౌన్ తర్వాత అన్ని బస్సులను దశలవారీగా రోడ్లపైకి తెచ్చిన ఆర్టీసీ.. వజ్ర బస్సులను మాత్రం బయటకు తీయలేదు. ఎక్కడికక్కడ షెడ్లకే పరిమితం చేసింది. వీటికి కనీస మెయింటెనెన్స్ చర్యలు సైతం చేపట్టకపోవడంతో తుప్పు పట్టిపోయాయి.
మినీబస్సులను ఉద్దేశపూర్వకంగానే గాలికొదిలేశారన్న విమర్శలు ఉండగా.. ఎలాగూ పనికిరాకుండా పోయినందున తుక్కుగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)